కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు కలిసొస్తాయా.! ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్, 9640466464
కాంగ్రెస్, బీజేపీల మద్దతు లేకుండా ఎవరూ ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయారని చరిత్ర చెబుతోంది. ఏదైనా పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్‌సభలో 543 స్థానాలకుగాను కనీసం 272 స్థానాలు ఉండాలి. అంటే కాంగ్రెస్, బీజేపీ ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కష్టమనే చెప్పవచ్చు. గతాన్ని పరిశీలిస్తే ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే దానికి సైతం ఈ రెండు జాతీయ పార్టీలు బయటి నుంచి మద్దతు ఇచ్చాయి. 1989-91లో నేషనల్ ఫ్రంట్, 1996-98లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ హయాంలో నలుగురు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వీపీ సింగ్), చంద్ర శేఖర్, హెచ్‌డీ దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రులుగా వ్యవహరించారు. జనతాదళ్ నాయకుడు వీపీ సింగ్ ప్రధానమంత్రిగా 1989 డిసెంబరులో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు బీజేపీ, వామపక్షాలు వెలుపలి నుంచి మద్దతు అందించాయి. 1990లో వీపీ సింగ్ బలపరీక్షను ఎదుర్కొని ఓడిపోగా, జనతాదళ్ నాయకుడు చంద్ర శేఖర్ ఆ పార్టీ నుంచి వేరుపడి, సమాజ్‌వాదీ జనతా పార్టీ ఏర్పాటు చేసి కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో చంద్ర శేఖర్ పదవికి రాజీనామా చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ మద్దతుతో జనతాదళ్ నాయకుడు హెచ్‌డీ దేవెగౌడ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ లో విభేదాలు రావడంతో దేవెగౌడ బలపరీక్షను ఎదుర్కొని ఓడిపోయారు. ఆయన స్థానంలో ఐకే గుజ్రాల్ ప్రధాని అయ్యారు. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో 1997 నవంబరులో ఐకే గుజ్రాల్ కూడా రాజీనామా చేశారు. ఆ సమయంలో యునైటెడ్ ఫ్రంట్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కన్వీనర్‌గా వ్యవహరించారు.
addComments
Post a Comment