అమ్మాయిలను చదువుకు దూరం చేసే కుట్ర

 ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్, 9640466464

ముస్లిం అమ్మాయిలు.. ఇప్పుడిప్పుడే విద్య ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నారు. పెద్దలు ఒప్పించో.. ఎదిరించో ఇంటి గుమ్మాన్ని దాటుతున్నారు.. ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్నారు. ఉద్యోగాలు చేయాలని, అభివృద్ధి వైపు పయనించాలని కలలు కంటున్నారు. అయితే ముస్లిం అమ్మాయిల అభివృద్ధిని చూడలేని కొన్ని శక్తులు వారిని వివాదాల్లోకి లాగుతున్నాయి. వస్త్రధారణ పేరిట చదువుకు దూరం చేసే కుట్రను పన్నుతున్నాయి. ఇటీవల కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపుర పట్టణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు హిజాబ్‌ ధరించి వచ్చిన విద్యార్థినులను లోనికి అనుమతించకుండా ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో విద్యార్థినులకు, ప్రిన్సిపల్‌, ఇతర అధ్యాపకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు హిజాబ్‌ ధరించి కళాశాలకు వస్తే అనుమతించే ప్రసక్తే లేదని ప్రిన్సిపల్‌ స్పష్టం చేశారు. ప్రవేశాల సమయంలో ఈ విషయాన్ని స్పష్టం చేయకుండా ఇప్పుడు చెబితే ఎలా? అని విద్యార్థినులు ప్రశ్నించారు. వార్షిక పరీక్షలు మరో రెండు నెలల్లో ఉండగా, ఇప్పుడిలా ఆంక్షలు పెడితే ఎలాగని విమర్శించారు. విద్యార్థినులను కళాశాల మైదానం వెలుపలే కొద్దిసేపు గడిపి వెనుదిరిగారు. ఇది ఈ రోజు ఒక కళాశాలకే.. ఒక రాష్ట్రానికే పరిమితమై ఉండొచ్చు.. రేపు అన్ని రాష్ట్రాలకు, దేశానికంతటికి పాకితే ముస్లింల అమ్మాయిల చదువుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.


కావాలనే వివాదం..
ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి రావడం పై కాషాయ శక్తులు కావాలనే వివాదాన్ని సృష్టించాయి. కళాశాలకు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజికి రావడంతో, మరికొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో కాలేజి అధికారులు కుందాపూర్ ఎంఎల్‌ఎ హలది శ్రీనివాస్ శెట్టితో చర్చించారు. విద్యార్థులు యూనిఫామ్ నిబంధనకు కట్టుబడి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. హిజాబ్ తో తరగతుల్లోకి అనుమతించాలని పట్టుబట్టడంతో వారిని కళాశాలలోకి రానివ్వలేదు.  



వాదనలు ఇలా..
ప్రభుత్వ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే అని జిల్లా మంత్రి అంగార చెబుతున్నారు. మత సంప్రదాయాలు పాటించేందుకు విద్యాసంస్థలు వేదిక కాదని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అంటున్నారు. పాఠశాల యాజమాన్యమేమో ఇది గర్ల్స్ హైస్కూల్ అని, ఇక్కడ హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదని, అది కూడా క్లాసులో ఉన్నప్పుడు మాత్రమే ధరించవద్దని చెబుతున్నామని అంటోంది. ‘మా స్కూల్లో ఐదారుగురు మగ లెక్చరర్లు ఉన్నారు. వారి ముందు మేం బురఖా ధరించాల్సిందే’ అని విద్యార్ధినులు చెబుతున్నారు.

మద్దతు సైతం..
విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించకపోవడాన్ని జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఖండించారు. బాలికలకు విద్య అందించాలంటూ ఇస్తున్న నినాదం ఒట్టిదేనని అర్ధమవుతోందని కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తెలిపారు. హిజాబ్ ధరించినందుకు ముస్లిం బాలికలకు కాలేజీల్లో ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కర్నాటకలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమైనదిగా అభివర్ణించారు.



ఆహార్యంపై అభ్యంతరాలెందుకు..
వస్త్రధారణపై ఆంక్షల ద్వారా ప్రాథమిక హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోంది. కేవలం వస్త్రధారణ కారణంగానే ముస్లిం బాలికలకు విద్యాహక్కు లేకుండా చేసే కుట్ర జరుగుతోంది. ‘ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ నాయకురాలు ఉమాభారతి, భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కాషాయ వస్త్రాలు ధరించడం లేదా.. ‘వ్యక్తులు ఏమి ధరించాలో ఎంచుకోవచ్చు. మీరు వారి ఎంపికను ఇష్టపడవచ్చు లేదా ఇష్టపడకపోవచ్చు, కానీ అది మనందరికీ ఉన్న హక్కు. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులు కాదు.’ అంటూ ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్ గురించి ఆలోచించాల్సిందే.

హై కోర్టు నోటీసులు
హిజాబ్‌ ధరించడం తన ప్రాథమిక హక్కని, దానిని హరిస్తున్నారని నిరసన తెలుపుతున్న విద్యార్థిని ఒకరు కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఫిబ్రవరి 8న హైకోర్టు విచారణ జరగనుంది. హిజాబ్ తో అమ్మాయిలు కాలేజ్ లో అడుగు పెట్టకూడదని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చెయ్యడంతో కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు ఉడిపి ఎమ్మెల్యేకి, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో ప్రిన్సిపాల్, ఆ కాలేజ్ అధ్యాపకులు, సిబ్బందిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే గతంలోనూ కోర్టులో దీనిపై కేసు నడిచింది. విద్యార్ధులు తమ ఇష్టానుసారం దుస్తులు ధరించాలనేది ప్రాథమిక హక్కని, అయితే, విద్యార్ధులంతా యూనిఫాం ధరించేలా చూడటం పాఠశాలకున్న అధికారమని జస్టిస్ ఎ. మహ్మద్ ముస్తాక్ గతంలో తన తీర్పులో పేర్కొన్నారు. ‘‘విద్యార్ధుల హక్కులకు, మేనేజ్‌మెంట్ హక్కులకు పోటీ పెట్టడం సరికాదు. ఒక హక్కు ఎవరికి ఉందో ఎవరికి లేదో చెప్పాలి. ఆర్టికల్ 25 స్ఫూర్తిని కాపాడాలి’’ కాళేశ్వరన్ రాజ్ అనే న్యాయవాది అభిప్రాయపడ్డారు. ‘‘యూనిఫామ్‌గా ఉండాలన్న కారణంతో జుత్తు వరకు కప్పుకోవాడాన్ని కూడా యాజమాన్యం నిషేధించలేదు. ఎందుకంటే దీన్ని రాజ్యాంగం అంగీకరించదు. భిన్నత్వాన్ని మన రాజ్యాంగం పరిరక్షిస్తుంది’’ అని రాజ్ అభిప్రాయపడ్డారు.

పోరాడి సాధించుకున్నారు..
హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో గతంలో మహిళల వస్త్రధారణపై ఇలాగే వివాదం జరిగింది. మోకాళ్లు దాటిన కుర్తీలు మాత్రమే వేసుకుని కళాశాలకు రావాలని కొత్త నిబంధన విధించడంతో వివాదం మొదలైంది. అంతేకాకుండా ముస్లిం విద్యార్థినులు బుర్కా లోపల ఏ డ్రెస్ వేసుకున్నారో చూడాలంటూ గేటు దగ్గరే తనిఖీలు నిర్వహిస్తూ కళాశాల యాజమాన్యం క్రూరంగా ప్రవర్తించింది. దీంతో విద్యార్థినులందరు ఆందోళన బాట పట్టారు. కళాశాల ఎదుట బైఠాయించారు. వివాదం ఎక్కువ కావడంతో పాత డ్రెస్‌కోడ్‌ విధానమే కొనసాగుతుందని, కొత్త డ్రెస్‌ కోడ్‌ విధానాన్ని తొలగిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.



రాజకీయాలు.. కుట్రలు
ముస్లిం మహిళల వేష‌ధార‌ణ లో హిజాబ్ ఒక భాగం. తొలి నుంచి బుర‌ఖాల‌ను ముస్లిం మ‌హిళ‌లు ధ‌రిస్తారు. అయితే కర్ణాటక తీర ప్రాంత విద్యాసంస్థల్లో హిజాబ్ కు వ్యతిరేకత ఎక్కువవుతోంది. హిజాబ్‌ కు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలోని కొప్ప, మంగళూరుల్లోని కాలేజీల్లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. రాజకీయాల కోసం విద్యా సంస్థలను పార్టీలు యుద్థ క్షేత్రాలుగా మలుచుకుంటున్నాయి. క్రమంగా దీన్ని దేశవ్యాప్తం చేయాలనే కుట్ర పన్నుతున్నాయి. దీని ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని స్పష్టమవుతోంది. మరో ఏడాదిలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి. అభివృద్ధి పై చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి మళ్లీ ఏదో ఒక కారణంతో ప్రజల మధ్య బేధాలను సృష్టిస్తే మెజారిటీ వర్గాన్ని ఏకం చేయవచ్చే ఆలోచన కనిపిస్తోంది. అంతేకాకుండా ముస్లిం అమ్మాయిలను చదువుకు దూరం చేసే కుట్ర సైతం కనిపిస్తోంది. బురఖాను నిషేధిస్తే సమస్య ఉత్పన్నం కాదు.. కానీ హిజాబ్ (స్కార్ఫ్) సైతం వద్దంటే ముస్లిం అమ్మాయిలను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వరు. దీని ద్వారా వారు చదువులకు దూరమవుతారు. ఇప్పుడైనా మేధావులు ఏకం కావాలి. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో పోరాడాలి. అవసరమైతే వీధుల్లోకి రావాలి. రాజకీయ శక్తుల కుట్రలను పటాపంచలు చేయాలి. ముస్లిం అమ్మాయిలు చదువులు కొనసాగించే ప్రయత్నం చేయాలి. ముస్లిం అమ్మాయిలకు భరోసా కల్పించాలి.


Comments