ప్రాణాలు తీసి... పశ్చాత్తాపమా..! - ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464

 ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో మిలిటెంట్లుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో నాగాలాండ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మోన్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా, కేంద్రం ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రప్రభుత్వం పశ్చాత్తాపం ప్రకటించింది. వాహనంలో ఉన్నది తీవ్రవాదులనే అనుమానంతోనే బలగాలు కాల్పులు జరిపాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఘటనపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. నెల రోజుల్లోగా దర్యాప్తును ముగించి నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే దర్యాప్తులు, విచారణలు, శిక్షలతో సరిపుచ్చితే సరిపోతుందా..! భద్రతా బలగాలకు ఉన్న ప్రత్యేక అధికారాలతో అమాయకుల ప్రాణాలు పోవడం ఇది మొదటి సారి కాదు కదా.! ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనలేమా..! ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోలేమా..!




మళ్లీ తెరపైకి రద్దు డిమాండ్
మోన్ ఘటనతో కశ్మీర్‌తోపాటు ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.. ఇవి దుర్వినియోగం అవుతున్నాయని, దీని కారణంగా చాలా సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు, వివాదాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏఎఫ్ఎస్ పీఏ చట్టం వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటోందనీ, నాగాలాండ్‌లో దీనిని తొలగించాలని ఆ రాష్ట్ర సీఎం నిఫియు రియో డిమాండ్‌ చేశారు. మేఘాలయ ముఖ్యమంత్రి  సంగ్మా కూడా కూడా ఏఎఫ్‌ఎస్‌పీఏను రద్దు చేయాలంటూ ట్వీట్‌ చేశారు.

ఏమిటీ ‘ఏఎఫ్ఎస్పీఏ’
కశ్మీర్‌తోపాటు ఈశాన్య భారతంలో కల్లోలిత ప్రాంతాలను గుర్తించి, అక్కడ శాంతిభద్రతలను కాపాడేందుకు సైన్యానికి ప్రత్యేక అధికారాలు కట్టబెడుతూ కేంద్రం ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని 1958లో తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని అసోం, కేంద్రపాలిత ప్రాంతం మణిపూర్లో అమలుచేశారు. 1987 ఫిబ్రవరి 20న అవతరించిన అరుణాచల్ ప్రదేశ్ దీనిని వారసత్వంగా పొందింది. తదనంతర కాలంలో మేఘాలయ, మిజోరం, నాగాలాండ్లకూ ఈ చట్టం వర్తింపజేశారు ప్రస్తుతం అస్సాం, నాగాలాండ్, మణిపూర్‌(మణిపూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏరియా మినహా), అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాంగ్‌లాంగ్, లాంగ్‌డింగ్, తిరప్‌ జిల్లాల్లో ఈ చట్టం అమలులో ఉంది. భద్రతా పరిస్థితిలో మెరుగుదల కారణంగా మేఘాలయలో ఏప్రిల్‌ 1, 2018న ఈ చట్టాన్ని ఎత్తివేశారు. అంతకుముందే ఎఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని ఉపసంహరించాలని 2015లో త్రిపురలో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఏఎఫ్‌ఎస్పీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో సైన్యం చర్యలకు సాధారణ కోర్టుల నియమాలు వర్తించవు. భద్రతా దళాల చర్యలపై కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా న్యాయస్థానాల్లో కేసు పెట్టడం కూడా సాధ్యం కాదు. ప్రత్యేక అధికారాల చట్టంలోని 4, 5 నిబంధనలు సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టాయి. ఐదుగురు ఒక చోట గుమిగూడితే, వారిని తీవ్రవాదులుగా లేదా ఉగ్రవాదులుగా అనుమానించి కాల్చివేసే హక్కు సైన్యానికి ఉంది. మారణాయుధాలు ఉన్నాయనే అనుమానం వస్తే ఏ కట్టడానినైనా కూలగొట్టవచ్చు. ఎటువంటి వారెంటు లేకుండానే ఏ వాహనాన్నైనా, వస్తువులనైనా సోదా చేయవచ్చు. అంతేకాకుండా ఏఎఫ్ఎస్పీఏ చట్టం లోని సెక్షన్ 3 ప్రకారం ఏ ప్రాంతాన్నైనా ‘కల్లోలిత ప్రాంతం’గా కేంద్ర ప్రభుత్వం (హోంశాఖ), లేదా రాష్ట్ర గవర్నర్‌ ప్రకటించవచ్చు.



అమాయకుల ప్రాణాలు బలి..
ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉన్న సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం-1958 భద్రతా బలగాలకు కల్పిస్తున్న అధికారాలు ఎప్పటి నుంచో అమాయకుల ప్రాణాలు బలిగొంటూనే ఉన్నాయి. తిరుగుబాట్లు, వేర్పాటువాదాన్ని, నిషేధిత ఉగ్రసంస్థలను అణచివేసే చర్యల పేరిట అమాయాకుల ఊచకోత, మహిళలపై సైన్యం అకృత్యాలు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. మణిపూర్‌లోని మలోం గ్రామంలో 2000 నవంబర్ 2న బస్టాప్ వద్ద నిలబడిన 11 మంది అమాయకులను భద్రతాదళాలు కాల్చి చంపాయి. అందులో 62 ఏళ్ల వృద్ధురాలు, జాతీయ సాహస బాలల అవార్డు అందుకున్న 18 ఏళ్లబాలుడు కూడా ఉన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో 2000 సంవత్సరంలో జరిగిన చిట్టిసింగ్‌పురా ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు యువకులను సాయుధ బలగాలు కాల్చి చంపాయి. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసిన జవాన్లను ఏ కోర్టులో విచారించాలనే అంశంపై పన్నెండేళ్లు పట్టింది. 2012లో సుప్రీంకోర్టు జోక్యంతో సైనిక కోర్టులో విచారణకు సైన్యం అంగీకరించింది. 2004 జులై 11న మణిపూర్‌లో ఇంఫాల్‌లో మనోరమ అనే యువతి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. శరీరంపై సగం సగం బట్టలు, ఒంటి నిండా నెత్తుటి మరకలు, కత్తిగాట్లు, బుల్లెట్‌ గాయాలు.. హత్య గావించబడ్డ ముందురోజు రాత్రే ఇండియన్‌ ఆర్మీ ఆమెను అరెస్ట్‌ చేసి రోడ్డు మీద హింసించుకుంటూ తీసుకెళ్లిందని స్థానికులు ఆరోపించారు. దీనికి నిరసనగా జులై 14న ''ఇండియన్‌ ఆర్మీ.. రేప్‌ అజ్‌'' అన్న బ్యానర్‌ను ప్రదర్శిస్తూ పదకొండు మంది మహిళలు పూర్తిగా వివస్త్రలుగా మారి.. నేరుగా అస్సామ్‌ రైఫిల్స్‌ ఆర్మీ బస చేసిన కోట దగ్గరకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో జరిగిన ఆరు ఎన్‌కౌంటర్లపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే కమిషన్‌ ఆ ఉదంతాలన్నిటిలో మరణించింది సాధారణ పౌరులేనని, సాయుధ దళాలు భయోత్పాతం సృష్టిస్తుండ డంతో సాధారణ పౌర జీవనానికి భంగం కలుగుతోందని తేల్చి చెప్పింది. 2005లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీపీ జీవన్‌ రెడ్డి ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం సాయుధ దళాల చట్టం దుర్వినియోగంపై క్షేత్ర స్థాయి అధ్యయనం చేసేందుకు ఒక కమిషన్‌ను నియమించింది. జీవన్‌ రెడ్డి కమిషన్‌ సాయుధ దళాల చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోనే కొన్ని మార్పులు చేపట్టడం ద్వారా ఉగ్రవాద చర్యల్ని అదుపు చేసేందుకు అవకాశముందని సూచించింది. మణిపూర్‌లో 20 ఏళ్ల వ్యవధిలో సుమారు 1500కుపైగా నకిలీ ఎన్‌కౌంటర్లు జరిగాయని పౌరసంఘాల ఆరోపణ.



శాంతి భద్రతలను కాపాడటం, అంతర్గత కలహాలను నియంత్రించడం ప్రభుత్వం బాధ్యత. రాజ్యాంగంలోని అధికరణం 355 ప్రకారం రాష్ట్రాల సంరక్షణ కేంద్రం బాధ్యత. విదేశీ దురాక్రమణ నుండి, అంతరంగిక కల్లోలం నుండి రాష్ట్రాలకు రక్షణ కల్పించి ఆయా ప్రభుత్వాలు రాజ్యాంగ బద్ధంగా కొనసాగేట్టు చేయడం కేంద్రం విధి. అయితే, ఆ సాకుతో సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తామంటే ఎవరూ ఊరుకోరు. సామాన్యుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కబళిస్తున్న ఈ క్రూరమైన చట్టాన్ని ఉపసంహరించడమో... లేదా భద్రతా దళాల అధికారాల పరిధి తగ్గించడమో.. లేదా ప్రాంతాల పరిధి తగ్గించడమో.. ఏదో ఒక శాశ్వత పరిష్కారాన్ని తక్షణం కనుగొనాల్సిన అవసరముంది.



Comments