నిరుద్యోగం.. బలవన్మరణం.. రాజకీయం.. ఏమిటీ పరిష్కారం!

మొన్న సునీల్.. నేడు పాక శ్రీకాంత్.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఆలోచించాల్సిన పాలకపక్షం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సమస్యకు పరిష్కార మార్గాలను చూపాల్సిన విపక్షాలు దీన్ని రాజకీయం చేస్తున్నాయి. ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యంగా కాగా, మధ్యలో ఆందోళనకు గురవుతున్నది, నష్టపోతున్నది నిరుద్యోగులే. దీంతో నిరాశ నిస్పృహలకు గురై యువత బలవన్మరణాన్ని ఆశ్రయిస్తుండగా.. ధైర్యం చెప్పాల్సిన వారు, నమ్మకం కల్పించాల్సిన వారు కరువయ్యారు.



దేశవ్యాప్తంగా..
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం, భవిష్యత్తుపై బెంగ వంటి కారణాలతో నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం  2019లో 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వీటిలో నిరుద్యోగులు సుమారు పది శాతం వరకు ఉంటారు. 2018లో దేశ్వ్యాప్తంగా 1, 34, 516మంది ఆత్మహత్య చేసుకోగా, వీటిలో 12,936(9.6%) నిరుద్యోగులు ఉన్నారు.  2017లో 1,29,788మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 12,241(9.4%)మంది నిరుద్యోగులు ఉన్నారు. 2016లో 1,31,008 మంది ఆత్మహత్యలు రికార్డ్ కాగా,  అందులో 11,173 (8.5%)మంది నిరుద్యోగులు ఉన్నారు. 2015లో ఆత్మహత్య చేసుకున్న వారిలో నిరుద్యోగుల శాతం 8.2 కాగా, 2014లో 7.5 శాతముంది. 2020 రికార్డులు ఇంకా బహిర్గతం కాలేదు. గమనించాల్సిన విషయమేమిటంటే రైతుల ఆత్మహత్యల కంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు రెండు శాతం ఎక్కువే. వీరిలో కూడా 82 శాతం మంది మగవారే ఉంటున్నారు.
తెలంగాణలో తక్కువే..
దేశవ్యాప్తంగా పోల్చుకుంటే తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు చాలా తక్కువ. నేషనల్ క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక కంటే చాలా తక్కువగా నిరుద్యోగుల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. అంటే ప్రభుత్వం నిరుద్యోగుల ఆత్మహత్యల విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం కాదు. ఒక్క నిరుద్యోగి కూడా నిరాశ నిస్పృహలకు గురి కాకుండా, ఆత్మహత్య గురించి ఆలోచించకుండా చర్యలు తీసుకోవాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే. నిరుద్యోగ నిర్మూలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది.
ఏడేండ్లలో 1.32 లక్ష ఉద్యోగాలు భర్తీ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. టీఎస్ పీఎస్సీ ద్వారా 30,594, పోలీసు రిక్రూట్ మెంట్ బోర్ఢు ద్వారా 31,972, విద్యుత్ శాఖలో 22,637 మంది, ఆర్టిజన్లు, జెన్‌కో, ట్రాన్స్‌ కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌లో 6,648, టీఎస్ జెన్‌కోలో 856, టీఎస్ ట్రాన్స్‌ కోలో 206, టీఎస్ ఎస్పీడీసీఎల్లో 201, టీఎస్ ఎన్పీడీసీఎల్‌లో 164, సింగరేణి కాలరీస్‌లో 12,500, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు 9,355, టీఎస్ ఆర్టీసీలో 4,768, రెసిడెన్షియల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 3,623, హైదరాబాద్ జల మండలిలో 807, టీఎస్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో 243, డీసీసీబీల్లో 1,571, ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూని వర్సిటీలో 179, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీలో 80, ఆయుష్ డిపార్టుమెంట్‌లో 171, మైనారిటీ సంక్షేమశాఖలో 66 ఉద్యోగాలను ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా 6,258 ఉద్యోగాలు తుది దశ భర్తీలో ఉన్నాయి. త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా ఆ ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం అవకాశం కల్పిస్తామని చెప్పింది.

బడ్జెట్ లో వేతనాలకే ఎక్కువ..
ప్రభుత్వోద్యోగాలు నమ్మకమైనవి, నికరమైనవి అయినందువల్ల ఉపాధి కల్పనలో ప్రభుత్వ రంగం నిర్వర్తించే పాత్ర కీలకమైంది. కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకోసం ఒత్తిడి అధికంగా ఉంటుంది. అన్నింటికి పరిమితులు ఉన్నట్టు ప్రభుత్వాలకూ పరిమితులుంటాయి. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.52 కోట్లు. ప్రస్తుతం నాలుగు కోట్లకు పైగానే దాటి ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో సుమారు 9.37 లక్షల మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ 2.30 లక్షల కోట్లు కాగా, సుమారు 30 నుంచి 40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందించేందుకే సరిపోతుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఆత్మహత్యలు పరిష్కారం కాదు..
ఏ సమస్యకైనా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదని ప్రభుత్వం ఆ నమ్మకాన్ని యువతలో నింపేలా కృషి చేయాలి. వాటికి ప్రతిపక్షాలు సైతం సహకరించాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎవరి ప్రయోజనాల కోసం వారు ప్రయత్నిస్తున్నారు. యువతను రెచ్చగొడుతున్నారు. అయితే నిరుద్యోగుల ఆత్మహత్యలపై బీజేపీ లాంటి పార్టీలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందనే చర్చ సామాన్య ప్రజల్లోసైతం జరుగుతోంది. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ క్రమక్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుకు కట్టబెడుతోంది. పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది. మెల్లమెల్లగా వాటిని నిర్వీర్యం చేస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడుతోంది. బాధ్యతగా ఉండాల్సిన ప్రతిపక్షం యువతను రెచ్చగొడుతూ కాలం వెళ్లదీస్తోంది. కానీ ఆత్మహత్యలు పరిష్కారం కాదని.. ప్రభుత్వం తో పోరాడి నోటిఫికేషన్లు వచ్చేలా చేస్తామని యువతలో నమ్మకాన్ని కలిగించలేకపోతోంది.

తక్కువ వేతనాలతో ఎక్కువ మందికి..
ప్రయివేటు ఉద్యోగాలతో పోల్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చాలా ఎక్కువ. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో ప్రభుత్వం 30 శాతానికి పైగా ఖాళీగా ఉంచుతున్నట్టు స్పష్టమవుతోంది. వేల మందికి సరిపడా వేతనాలను కొందరికే ప్రభుత్వం అందిస్తున్నది. సీనియార్టీని బట్టి ఆఫీస్ సబార్డినేట్లకు సైతం రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు వేతనం అందుతున్నదంటే అర్థం చేసుకోవచ్చు. ఇష్టానుసారంగా వేతనాలు పెంచడం ద్వారా ఆర్థిక అసమానతలను పెంచడమే కాకుండా, బడ్జెట్ పై పడుతున్న భారంతో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేకపోతున్నారు. ఇంకా ప్రస్తుతమైతే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులనే వివాహం చేసుకుంటున్నారు. దీని ద్వారా ఒకే ఇంట్లో ఉంటున్నా రెండేసి హెచ్ ఆర్ఏలు పొందుతున్నారు. స్వల్ప కాలంలోనే కోటీశ్వరులుగా మారుతున్నారు. అంతేకాకుండా ఇతర వ్యాపారాలు సైతం నిర్వహిస్తున్నారు. మరోవైపు సిబ్బంది కొరత సైతం వేధిస్తున్నది. ఓ స్థాయిలో వేతనాలతో ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్యకు కాస్తంతైనే పరిష్కారం లభించే అవకాశముంటుంది. అంతేకాకుండా ప్రయివేటు రంగంలోనూ కనీస వేతనాల అమలయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకువస్తే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు రాకున్నా ప్రయివేటు ఉద్యోగాల వైపు ఆసక్తి చూపే అవకాశముంటుంది. Feroz Khan 9640466464 
                                                                       

 Feroz Khan 9640466464
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్
Comments