వెన్నులో వణుకు.. పట్టించుకోరెందుకు?

పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్లు 

తరచూ ప్రమాదాలు.. ఆరోగ్య సమస్యలు 
వాహనాలకూ తప్పని రిపేర్లు 
పట్టించుకోని మున్సిపల్ అధికారులు 
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464

ఇది పట్టణంలోని శాంతినగర్ కాలనీ రోడ్డు.. డైట్ మైదానం వెనక ఉన్న ఈ అర కిలోమీటరు రోడ్డును దాటాలంటే.. కనీసం పది స్పీడ్ బ్రేకర్ల మీది నుంచి వెళ్లాలి. అయితే ఇక్కడ అధికారికంగా వేసినవి రెండే రెండు స్పీడ్ బ్రేకర్లు కాగా.. మిగితా పది చోట్ల రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. అయితే ఇది తవ్వింది స్థానికులా.. అక్కడున్న పాఠశాల వారా అనేది పక్కన పెడితే.. ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల తరచూ ప్రమాదాలు జరగడమే కాకుండా.. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనాలకూ రిపేర్లు తప్పడం లేదు. ఈ స్పీడ్ బ్రేకర్ వల్ల గతంలో ఇద్దరు విద్యార్థినులు సైతం మృతి చెందారు. అయినా మున్సిపల్ పాలకవర్గంలో, అధికారుల్లో ఎలాంటి స్పందన కానరావడం లేదు. 

వాహనాల వేగాన్ని నియంత్రించాల్సిన స్పీడ్ బ్రేకర్లే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కాలనీల్లో ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో.. ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ రోడ్డు మంచిగుందో తెలియని పరిస్థితి ఉంది. కొన్ని కాలనీల్లోనైతే ఇంటికో స్పీడ్ బ్రేకర్ అన్నట్టు పరిస్థితి ఉంది. కొన్ని చోట్లనైతే కిలోమీటర్ పరిధిలో పది నుంచి పదిహేను స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు తగ్గాల్సి ఉండగా.. పెరుగుతున్నాయంటే వాహన దారుల ఇక్కట్లను అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా స్పీడ్ బ్రేకర్లు, గుంతలున్న రోడ్లపై వాహనాలు నడపడం వల్ల వెన్ను సమస్యలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య సైతం పెరిగింది. ఈ వెన్ను సమస్యలకు కారణం అడ్డదిడ్డంగా ఉన్న రోడ్లపై వాహనాలు ఎక్కువగా నడపడమేనని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా స్పీడ్‌బ్రేకర్స్‌ కారణంగా జరిగిన ప్రమాదాల్లో తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయిన వారు సైతం ఉన్నారు. 
 
నిబంధనలకు విరుద్ధంగా.. 
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా.. సుమారు 30 వార్డుల్లో ఈ స్పీడ్ బ్రేకర్లు, గుంతల సమస్య తీవ్రంగాఉంది. నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్లు నిర్మించడంతోనే సమస్య ఉత్పన్మవుతోంది. వీధిలో వాహనాలు వేగంగా వెళుతున్నాయని కొందరు.. ప్రమాదాలు జరుగుతున్నాయని మరికొందరు.. విద్యా సంస్థలు, ఆసుపత్రుల వద్ద రోగులు, పిల్లల రక్షణ పేరుతో ఆయా సంస్థల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లుగా స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కనీసం వాటి వద్ద స్పీడ్‌ బ్రేకర్‌ ఉన్నది అని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. గ్రామీణ, పట్టణాల్లోని రహదారులపై స్పీడ్‌ బ్రేకర్‌ నిర్మించుకోవాలంటే ఐఆర్ సీ (ఇండియన్‌ రోడ్డు కాంగ్రెస్‌) 2017లో స్పష్టమైన నిబంధనలు విడుదల చేసినా.. వీటిని పట్టించుకునే వారు కరువయ్యారు. రంబుల్‌ స్ర్టిప్స్‌.. ఇవి రోడ్డుపై తెల్లటి గీతల మాదిరిగా ఉంటాయి. వీటిని ఇంచు ఎత్తు, అడుగు వెడల్పుతో ఒకేచోట ఎనిమిది ఏర్పాటు చేయాలి. ఇవి వాహనాల వేగాన్ని నియంత్రిస్తాయి. వాహనం కుదుపులకు గురవ్వదు. ఐఆర్‌సీ సూచించిన ఈ రంబుల్‌ స్ర్టిప్స్‌ పట్టణంలో అసలే కనిపించడం లేదు. తక్కువగా ఉన్నాయి. జాతీయ రహదారులపై మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. 

నిబంధనలివీ..
ఏదైన ఒక స్పీడ్‌ బ్రేకర్‌ ఎత్తు 10 సెంటీ మీటర్లకు మించకూడదు.
వరుసగా రెండు స్పీడ్‌ బ్రేకర్స్‌ కన్నా ఎక్కువ నిర్మించకూడదు
స్పీడ్‌ బేకర్స్‌ కు, మరో స్పీడ్‌ బేకర్స్‌ మధ్య కనీసం 150 మీటర్ల దూరం ఉండాలి.
దీని నిర్మాణానికి సంబంధిత రహదారుల సంస్థ అనుమతి తప్పని సరి.
దీని నిర్మాణాన్ని సూచిస్తూ కనీసం 50 మీటర్ల దూరంలో హెచ్చరిక బోర్డు ఉండాలి.
స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద పసుపు, నలుపు రంగుల్లో మార్కింగ్‌ ఇవ్వాలి.
 

ఆరోగ్య సమస్యలు.. 
స్పీడ్ బ్రేకర్లతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు అక్కడ దాకా వెళ్లి వేగంగా బ్రేక్‌ వేయడం లేదా వేగంగా దానిపై నుంచి వెళ్లే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడుతున్నారు. అటువంటి సమయంలో వెన్ను పూసపై అదనపు భారం పడుతుంది. వేగ నియంత్రణ వద్ద అదుపు చేయలేని పరిస్థితుల్లో వెన్నుపూసల మధ్య ఉండే స్పాండిలైటిస్‌ పదార్థం బయటకు రావడం, ఈ సమయంలో వెన్ను పూసల మధ్య గాయాలు కావడం, బయటకు రావడం, వాటి మధ్య రక్తనాళాలు గాడి తప్పడం వంటివి జరుగుతున్నాయి. అడ్డగోలుగా ఉన్న స్పీడ్‌ బ్రేకర్లను దాటే క్రమంలో వాహనదారుల వెన్నుకు సంబంధించిన డిస్క్‌ లు దెబ్బతింటున్నాయి. ఎక్కువ ప్రయాణం చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. అలాంటి వారికి నడుము, వెన్ను, స్పాండ్‌లైటీస్‌, షోల్డర్‌, కండరాల నొప్పులు వస్తున్నాయి. డ్రైవింగ్‌ చేసేప్పుడు అకస్మాత్తుగా స్పీడ్‌ బ్రేకర్‌ ఎదురైతే బ్రేక్‌ వేయడం వల్ల డిస్క్‌ ల్లో కదలికలు ఏర్పడతాయి. డిస్క్‌ లు పక్కకు జరగడం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతోంది. కండరాలు నొప్పులు ఉత్పన్నమవుతాయి. పెద్ద వయస్సున్న మహిళల్లో కాల్షియం తక్కువగా ఉండడం వల్ల స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వాహనాలు జర్క్‌ ఇస్తే ఎముకలు విరిగిపోయే ప్రమాదముంది. 


 
Feroz Khan 9640466464  
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
Comments