45 సంవత్సరాలు దాటిన వారు సామాజిక బాధ్యతగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తూ వస్తున్నాయి. అంతేకాకుండా స్వచ్ఛందం అంటూనే ఫ్రంట్ లైన్ వారియర్లు అంటూ పోలీసులు, వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇంకా ప్రభుత్వ, వివిధ కార్పొరేషన్ల ఉద్యోగులను వ్యాక్సిన్ తీసుకోవాలంటూ బలవంతం చేస్తున్నాయి.. లేకుంటే ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తామంటూ బెదిరిస్తున్నాయి.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాధినేత కేసీఆర్ కు 67 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ముఖ్యమంత్రే వ్యాక్సిన్ తీసుకోకుండా, వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయకుండా బలవంతం చేస్తుండడం, ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.
ముందుగా 60 సంవత్సరాలకు పైబడిన వారికి ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ టీకాలను ఇవ్వడం మొదలు పెట్టింది. ఆ తరువాత వయసును 45 సంవత్సరాలకు కుదించింది. మే ఒకటో తేదీ నుంచి 18 సంవత్సరాలకు పైబడిన వారికి టీకా వేస్తామని హామీ ఇచ్చింది. జనవరి 16న రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. మొదట కోవిషీల్డ్, ఆ తర్వాత కో వ్యాగ్జిన్ టీకాలను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పడు రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ప్రతి రోజు వేలాది కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయినా ఇంకా 30 శాతానికి పైగా ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కారణం వ్యాక్యిన్ పై అనేక అనుమానాలు, అపోహలు ఉండడమే. దీనిని నివృత్తి చేయాల్సిన ప్రభుత్వం, బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఇటీవల తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్ గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మృతి చెందారు. కోవిడ్ టీకా తీసుకున్న మూడు రోజులకే ఆయనకు గుండెపోటు వచ్చింది. కోవిడ్ టీకా తీసుకోవడం వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని మరికొందరు సహనటులు ఆరోపించారు. గుండెపోటుకు టీకాతో ఎలాంటి సంబంధం లేదని వైద్యులు తేల్చి చెబుతున్నా.. వినే పరిస్థితులు కనిపించడం లేదు. అంతేకాకుండా తెలంగాణలోనూ ఎన్నో సంఘటనలు వ్యాక్సిన్ పై అపోహలు వచ్చేలా చేశాయి. కోవిడ్ డోసులు తీసుకున్న వారిలో కొందరు స్వల్ప అస్వస్థతకు గురి కాగా.. కొందరు మరణించారు. అయితే వ్యాక్సిన్ తర్వాత చోటుచేసుకున్న మరణాలకు టీకాతో ఎలాంటి సంబంధం లేదని, వాటికి ఇతర కారణాలున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. అయితే వాటిని పూర్తిస్థాయిలో ప్రకటించకపోవడం, ప్రచారం నిర్వహించకపోవడంతో ప్రజల్లో అనుమానాలు నివృత్తి కావడం లేదు.
బెదిరింపులతో..
పంచాయతీరాజ్ శాఖనే ఉదాహరణగా తీసుకుందాం. రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు పర్యవేక్షించమే కమిషనర్ డీపీఓలకు, డీపీఓలు మండలస్థాయి బాధ్యతలు పర్యవేక్షించే ఎంపీఓలకు, ఎంపీఓలు పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ కార్యదర్శులు తమ కింద విధులు నిర్వహించే సిబ్బందికి టీకాలు వేసుకోవాలని బలవంతం చేస్తున్నారు. టీకాలు తీసుకోని వారికి వేతనాలు కత్తిరించాలని, లేకుంటే సస్పెండ్ చేయాలని మౌఖికంగా చెబుతున్నారు. దీంతో వివిధ రకాల వ్యాధులున్న వారు తమ అనుమానాలను నివృత్తి చేసుకోలేక, మరోవైపు టీకా తీసుకోక మనోవేదనకు గురవుతున్నారు. ఇటీవల ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాలో కోవిడ్ టీకా ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోలేమని కొందరు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో, వారిని ఏదో ఒక కారణంతో సస్పెండ్ చేయాలని ఎస్పీ డీఎస్పీని ఆదేశించారు. ఆ విషయం డీఎస్పీ సదరు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల దృష్టికి తీసుకెళ్లి టీకా తీసుకునేలా ఒప్పించారు. స్వచ్ఛందం అంటూనే బలవంతం చేస్తుండడం, ఆయా శాఖల ఉన్నతాధికారులు తాము కరోనా టీకా తీసుకోకుండా కిందిస్థాయి సిబ్బందిని బలవంతం చేస్తుండడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచే రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాధినేతగా ఉన్న కేసీఆరే టీకా తీసుకోలేదని తేలడంతో టీకా పై మరిన్ని అనుమానాలు, అపోహలు పెరిగేలా ఉన్నాయి.
అనేక అనుమానాలు..
టీకా తీసుకున్న వారు కూడా మాస్కులు ధరించాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరైతేనే బయటకు వెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో టీకా తీసుకొని లాభమేమిటనే ప్రశ్న సామాన్య జనాల్లో వ్యక్తమవుతోంది. వ్యాక్సినేషన్ పై పూర్తిస్థాయిలో భయం తొలగిపోలేదు. కరోనా టీకా తీసుకున్న వారిలో కూడా మళ్లీ కరోనా సోకుతోందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం మరింత ఆందోళన పెంచే ప్రమాదముంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వారియర్లను టీకా తీసుకోవాలని బలవంతం చేసే బదులు వారిలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టడం, కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన అవసరముంది. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పలువురు సూచిస్తున్నారు. Feroz Khan 9640466464
Feroz Khan 9640466464
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్
addComments
Post a Comment