పేరు పాన్ మసాలా.. అమ్మేది గుట్కా!
వ్యాపారంలో కొత్త కొత్త వారి ఎంట్రీ
యథేచ్ఛగా అమ్మకాలు
చాందా వెళ్లే దారిలో గోడౌన్లలో గుట్కా నిల్వ
అనుమానం రాకుండా తరచూ మార్పులు
కొత్త కొత్త మార్గాల్లో తరలింపు
ఆదిలాబాద్ పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ప్రాంతమది. మెయిన్ మార్కెట్ కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో కొందరు పాన్ మసాలా పేరుతో గుట్కా వ్యాపారం చేస్తున్నారు. కోట్లకు పడుగలెత్తుతున్నారు. విపరీతమైన లాభాలు వస్తుండడంతో మరికొందరు ఈ నిషేధిత వ్యాపారంలో చేరుతున్నారు. దీంతో ఆ ప్రాంతం ఇప్పుడు గుట్కా హబ్ గా మారింది. అంతేకాకుండా గుట్కాను పెద్ద ఎత్తున నిల్వ ఉంచేందుకు ప్రత్యేకంగా గోడౌన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు సొంతంగా గోడౌన్ లు నిర్మించుకుంటుండగా, మరికొందరు అద్దెకు తీసుకొని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఎక్కువగా గోడౌన్లు ఆదిలాబాద్ నుంచి చాందా వెళ్లే మార్గంలో ఉండడం గమనార్హం. దీంతో ఆదిలాబాద్ పట్టణం అమ్మకాలకు హబ్ గా మారగా.. నిల్వలకు హబ్ గా చాందా వెళ్లే దారి మారింది.
ఆదిలాబాద్ జిల్లాలో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణ శివారు ప్రాంతాలు, దగ్గరగా ఉన్న గ్రామాలు నిల్వ కేంద్రాలుగా మారగా.. పట్టణంలోని మెయిన్ మార్కెట్ కు సమీపంలో ఉన్న ప్రాంతం దీనికి ప్రధాన కేంద్రంగా మారింది. లాభాలు ఎక్కువగా వస్తుండడంతో కొత్త కొత్త వారు ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి గుట్కాను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. పోలీసులకు దొరక్కకుండా కొత్త కొత్త మార్గాల్లో గుట్కాను పట్టణానికి తీసుకువస్తున్నారు. లారీలు, పెద్ద పెద్ద కంటైనర్లలో ఈ సరుకు వస్తోంది. పట్టణ సరిహద్దున సరుకు వచ్చిన తర్వాత వాటిని కార్లు, ప్రయివేటు వాహనాల్లో వివిధ ప్రాంతాలకు, గోడౌన్లకు తరలిస్తున్నారు. జిల్లాలో రోజుకు సమారు కోటిరూపాయల వరకు వ్యాపారం సాగుతున్నట్టు తెలుస్తోంది.
పోలీసులపైనే పూర్తి భారం..
నిషేధిత గుట్కా విక్రయాలు సాగవద్దంటే పలు శాఖలు ఉమ్మడిగా పని చేయాల్సి ఉంది. అయితే పోలీసులు తప్ప దీని గురించి ఏ ఒక్క శాఖ పట్టించుకోవడం లేదు. పోలీసులపైనే పూర్తి భారం పడుతోంది. గుట్కా వ్యాపారం కొనసాగనివ్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పలు శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో పోలీసులతోపాటు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ, కార్మిక శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, ఆహార నాణ్యతా ప్రమాణాల శాఖలు ఉన్నాయి. అయితే ఈ శాఖల అధికారులు వీటి గురించి అసలే పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసులు దృష్టి సారిస్తేనే గుట్కా నిల్వలు దొరుకుతున్నాయి. అయితే గుట్కా వ్యాపారాలు పోలీసులను మేనేజ్ చేసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పుడప్పుడు దాడులు నిర్వహించినా దొరికిన నిల్వలను తక్కువగా చూపించేలా చేస్తున్నారు.
కొత్త కొత్త వారి ప్రవేశం
రెండేండ్ల క్రితం వరకు ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే గుట్కా వ్యాపారం నిర్వహించే వారు. అయితే వారు కోట్లాది రూపాయల ఆస్తులు కొనుగోలు చేస్తుండడంతో చాలా ఇతర వ్యాపారాలు నిర్వహించే వారు సైతం ఈ గుట్కా వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నారు. రియల్ ఎస్టేట్, మొబైల్ ఫోన్ల విక్రయాలు, ఇతర వ్యాపారాలు నిర్వహించే వారు సైతం ఈ నిషేధిత గుట్కా వ్యాపారంలోకి ప్రవేశించారు. మెయిన్ మార్కెట్ కు సమీపంలో దుకాణాలను అద్దెకు తీసుకొని, ఇతర వ్యాపారాలు చేస్తున్నట్టు కనబడినా.. వారి ప్రధాన వ్యాపారం మాత్రం గుట్కా అమ్మకాలే. పలువురిని ఏజెంట్లుగా నియమించుకొని ప్రతి దుకాణానికి గుట్కాను సరఫరా చేస్తున్నారు.
చాందా వెళ్లే దారిలో ప్రత్యేక గోడౌన్లు
ఆదిలాబాద్ పట్టణం నుంచి చాందా, అటు నుంచి హైవేపైకి వెళ్లే దారిలో గుట్కా నిల్వల కోసం ప్రత్యేకంగా పెద్ద పెద్ద గోడౌన్లే నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ గుట్కా వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు గడించిన వారు స్వతహాగా గోడౌన్లు నిర్మించుకొని గుట్కాను నిల్వ చేస్తుండగా.. ఏడాది నుంచి రెండేండ్ల క్రితం వ్యాపారంలో ప్రవేశించిన వారు గోడౌన్లను అద్దెకు తీసుకొని నిల్వ ఉంచుతున్నట్టు తెలుస్తోంది. అయితే హైవే కు అతి దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. పోలీసులకు, ఎవరికీ అనుమానం రాకుండా పెద్ద పెద్ద కంటైనర్లు, లారీల్లో సరుకును తెప్పిస్తున్నారు. అక్కడ వాహనాన్ని నిలిపి రాత్రి సమయాల్లో గోడౌన్లలో వాటిని ఖాళీ చేస్తున్నారు. ఆ తర్వాత కార్లు, ఇతర ప్రయివేటు వాహనాల్లో పట్టణానికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి దుకాణాలకు చేరవేస్తున్నారు. Feroz Khan 9640466464
Feroz Khan 9640466464
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
addComments
Post a Comment