అనగనగా ఒక దేశం.. వ్యక్తుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఆ దేశ రాజు ఎంతో పేరు గాంచాడు. ప్రత్యేక ప్రతిభ ఉన్న వారికి రాజు బహుమతులు అందించి ప్రోత్సహించేవాడు. దీంతో స్వదేశంలోని వారే కాకుండా వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు వచ్చి తమలోని ట్యాలెంట్ ను అతడి ముందు ప్రదర్శించేవారు. ఒక సమయంలో పక్క దేశానికి చెందిన ఓ వ్యక్తి రాజు గారి దర్బార్ కు రెండు సూదులు తీసుకొని వచ్చాడు. ఒక సూదిని నిటారుగా నిలబెట్టి, కొంత దూరం నుంచి సూది రంధ్రంలో నుంచి మరో సూదిని విసిరాడు. ఇది చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. అతడికి వంద బంగారు నాణాలు బహుమానంగా ఇవ్వాలని మంత్రికి సూచించాడు. దాంతోపాటు రెండు వందల కొరడా దెబ్బలు కొట్టాలని సైనికులను ఆదేశించాడు. దీంతో సదరు వ్యక్తి భయపడి రాజును కారణమడిగాడు. దానికి రాజు సమాధానమిస్తూ నీలోని ప్రతిభ అద్భుతం.. అందుకు వంద బంగారు నాణాలు ఇవ్వాలని చెప్పాను. అయితే నువ్వు చేసిన పనితో ప్రజలకు, పర్యావరణానికి, ఎవరికీ ఎలాంటి లాభం లేదు కదా.. నీ లోని ప్రతిభను ఇలాంటి వాటిపై వృథా చేస్తున్నావు. అందుకే రెండు వందల కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశించాను.. అన్నాడు..
ఈ కథలో కేవలం ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటే.. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు - సూదీ రంధ్రంలో నుంచి సూదీ తీసే ప్రతిభ సేమ్ టూ సేమ్.. దీనిపై సోకాల్డ్ మేధావుల నుంచి ఎన్ని విమర్శలైనా రావచ్చు.. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రాణహిత ప్రాణం తీసిన పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టును సర్వరోగ నివారిణిగా చూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ అనుమతులు లేకుండా, డీపీఆర్ ను బహిర్గతపర్చకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్న అధికార పార్టీ, వారికి వంత పాడుతున్న మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించడంలో సక్సెస్ అయ్యాయనే చెప్పవచ్చు.. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ఎంతో తక్కువ ఖర్చుతో పూర్తి చేసి, ప్రజలకు ఉపయోగపడేలా చేసే అవకాశమున్నా.. సాగునీటి రంగానికి కేటాయించిన ఖర్చులో అధిక మొత్తాన్ని కాళేశ్వరానికి తరలించి ఇతర ప్రాజెక్టులకు మోక్షం లేకుండా చేశారు. అంచనాలను ఇష్టానుసారంగా పెంచేశారు.
విద్యుత్ ఖర్చు తడిసిమోపెడు
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్ని ఎకరాల సాగుభూమి అదనంగా వినియోగంలోకి వచ్చిందో తెలియదు గానీ కరెంటు ఖర్చు మాత్రం రెండు వేల కోట్ల రూపాయలు దాటింది. రెండు సంవత్సరాల్లో 3,604 మిలియన్ యూనిట్లను వినియోగించారు. ఆ లెక్కన కేవలం కరెంటు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 2,090 కోట్లను వెచ్చించాల్సి వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎత్తిపోసిన నీరు 99 టీఎంసీలు. గతేడాది 33 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి రూ 984.77 కోట్ల మేర విద్యుత్ కోసమే ఖర్చయింది. అంతకుముందు 2019-20లో 66 టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి రూ. 1,105.82 కోట్లు ఖర్చయింది. గతేడాది 1,697 మిలియన్ యూనిట్లను వాడితే అంతకుముందు ఏడాది 1,906.59 మిలియన్ యూనిట్లను వాడారు.
భారమే.. కానీ ఒప్పుకోరు
ఉమ్మడి రాష్ట్రంలో ‘జలయజ్ఞం’లో భాగంగా 31 భారీ, మధ్య తరహా సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు సిద్ధమైంది. అందులో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రీ డిజైనింగ్, రీ ఇంజనీరింగ్ పేరుతో ప్రాణహిత ప్రాణం తీసి కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టు పనులు చేపట్టడం మొదలుపెట్టారు. మేడిగడ్డ వద్ద పెద్దఎత్తున ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పంపులు ఏర్పాటు చేసి మేడిగడ్డ నుంచి అన్నారం వరకు, అక్కడి నుంచి సుందిళ్లకు, తర్వాత ఎల్లంపల్లికి నీటిని పోయడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి రివర్స్ పంపింగ్ సిస్టమ్ వల్ల తెలంగాణపై ఆర్థికంగా విపరీతమైన భారం పడే ప్రమాదముంది. నీరు కింది వరకు పోయి తిరిగి పైకి తీసుకురావటం వల్ల ఏటా వేల మెగావాట్ల విద్యుత్ భారం తప్పదు. వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తేవటం వల్ల వాటికి ఏటా వడ్డీ భారం పడుతుంది. దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో సొరంగాలు, భారీ పంపులు, పంప్ హౌజ్లు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేసినప్పుడు కచ్చితంగా అది అద్భుతంగానే కనిపిస్తుంది. కానీ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రైతాంగానికి ఏ మేరకు మేలు జరుగుతుందో కచ్చితంగా ఆలోచించాల్సి ఉంటుంది.
Feroz Khan 9640466464
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
addComments
Post a Comment