గుట్కా మాఫియా తెగింపు.. పోలీసులకే బెదిరింపు!

గుట్కా మాఫియా .. శృతి మించుతున్న ఆగడాలు..  పాన్ మసాలా పేరుతో దందా.. కోర్టులో రిటర్న్ కేసులు వేస్తానంటూ భయపెడుతున్న వ్యాపారులు.. పక్కా సమాచారమున్న అటు వెళ్లేందుకు వెనకాడుతున్న ఖాకీలు.. మంచిర్యాలతోపాటు వివిధ జిల్లాల్లో ఇలాంటి ఘటనలు..  

అతనో వ్యాపారి.. గుట్టు చప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం చేస్తుంటాడు.. మంచిర్యాల శ్రీనివాస థియేటర్ లైన్ లో ఉండే అతను తాను అమ్మేది పాన్ మసాలాలు మాత్రమే అని నమ్మిస్తుంటాడు.. అక్కడ గుట్కా అమ్ముతున్నట్టు పక్కా సమాచారంతో పోలీసులు వచ్చినా.. తనిఖీ చేస్తే రిటర్న్ కేసు వేస్తానని బెదిరిస్తుంటాడు. కోర్టు ఆర్డర్ కాపీ తన దగ్గరుందని చెబుతుంటాడు.. కోర్టు, కేసులపేరుతో భయపెట్టిస్తుండడంతో స్థానిక పోలీసులు అతని దుకాణాలను తనిఖీ చేయడానికి సైతం వెనుకాడుతున్నారు. దీంతో అతని ఇష్టారాజ్యం కొనసాగుతుండగా, అతను కోట్లకు పడుగలెత్తుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలో సైతం ఓ వ్యాపారి పోలీసులపై రిటర్న్ కేసు వేసి బెదిరింపులకు దిగాడు. దీంతో వారికి పోలీసు ఉన్నతాధికారుల నుంచి చివాట్లు రావడంతో మనకెందుకులే తలనొప్పి అని పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారు. అంతేకాకుండా తెలంగాణలోని 20కి పైగా జిల్లాల్లో గుట్కా వ్యాపారులు మాఫియాగా మారి పోలీసులనే భయపెట్టే స్థాయికి ఎదిగినట్టు తెలుస్తోంది. 

తెలంగాణలో పేరుకే గుట్కా నిషేధం.. అమ్మకాలు అంతా బహిరంగం.. పట్టణాల్లో, గ్రామాల్లో ఏ మూలకు వెళ్లినా.. ఏ గల్లీలో చూసినా గుట్కా ప్యాకెట్లు కనిపిస్తాయి. పదిహేను రోజులు, నెలకోసారి కొత్త కొత్త బ్రాండ్లు దర్శనమిస్తుంటాయి. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం గుట్కా మసాలా తయారీ, నిల్వ, సరఫరా, అమ్మకాలు నిషేధం. పొగాకు, నికోటిన్, ఖైనీ, ఖర్రా వంటి ఉత్పత్తులనూ ప్రభుత్వం నిషేధించింది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న వీటన్నింటినీ నిషేధిస్తూ 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనసాగించింది. అయినా రాష్ట్రంలో రోజుకు వందల కోట్ల గుట్కా వ్యాపారం కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడమే కాకుండా హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో జనావాసాల మధ్యే గుట్కా తయారు చేసి విక్రయిస్తున్నారు. బెదిరింపులో, మామూళ్లో కారణమేదైనా పోలీసులు వారిపై తూతూమంత్రంగా చర్యలు చేపట్టి ఆ తర్వాత వదిలేస్తున్నారు. 

పాన్ మసాలా పేరుతో దందా 
తెలంగాణలోని పలు జిల్లాల్లో పాన్ మసాలా పేరుతో యథేచ్ఛగా గుట్కా అమ్మకాలు సాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గుట్కా నిషేధం కాక ముందు గుట్కాలు నేరుగా అమ్మేవారు. పాన్ మసాలాలు తక్కువగా ఉండేవి. నిషేధం విధించిన తర్వాత వ్యాపారులు కొత్త తరహా వ్యాపారాన్ని ప్రారంభించారు. పాన్ మసాలాను తయారు చేసి, విడిగా తంబాకు పొట్లాలు తయారు చేస్తున్నారు. పాన్ మసాలాలో తంబాకు పొట్లాన్ని కలిపితే అది గుట్కా గా మారిపోతుంది. దీంతో పాన్ మసాలా పేరుతో వాటిని రవాణా చేయడమే కాకుండా, నిషేధం ఉన్న తంబాకు పొట్లాలను రహస్యంగా దుకాణాల వరకు చేరుస్తున్నారు. 

పోలీసులకు బెదిరింపులు.. 
మాటిమాటికి దాడులు చేసి గుట్కాను పట్టుకెళ్తుండడంతో పోలీసుల లొసుగులను తీసే పనిలో వ్యాపారులు పడ్డారు. ఇప్పటికే మంచిర్యాల, ఆదిలాబాద్ తోపాటు పలు జిల్లాల్లో పాన్ మసాలా పేరుతో గుట్కా వ్యాపారం చేసే వ్యాపారులు హై కోర్టులో కేసులు వేశారు. అవి ఇప్పటికీ కొనసాగుతుండగా, రాకపోకలు సాగించడం ఖాకీలకు తలనొప్పిగా మారింది. పాన్ మసాలా వ్యాపారం చేసే ఓ వ్యాపారి గోడౌన్ లో ఏడాది క్రితం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు దాడులు నిర్వహించారు. అతని వద్ద పెద్ద ఎత్తున పాన్ మసాలాతోపాటు నిషేధంలో ఉన్న తంబాకు పొట్లాలు సైతం లభించాయి. అయితే తంబాకుతోపాటు పాన్ మసాలాను సైతం పోలీసులు సీజ్ చేశారు. అంతేకాకుండా బహిరంగ మార్కెట్లో గుట్కా లభించే ధరను మీడియాకు వివరించారు. దీన్నే లొసుగుగా తీసుకున్న ఆ వ్యాపారి తన వద్ద ఉన్న పాన్ మసాలాను అక్రమంగా పోలీసులు సీజ్ చేశారని, అంతేకాకుండా దానిపై ఉన్న ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర ను మీడియాకు చెప్పారని ఆ వ్యాపారి పోలీసులపై హై కోర్టులో కేసు వేశాడు. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతుండగా, దాడి చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసులకు ఎస్పీ నుంచి చివాట్లు తప్పలేదు. కేసుల పేరుతో హై కోర్టుకు వెళ్లి రావాల్సి వస్తుండడం, పోలీసు ఉన్నతాధికారుల నుంచి చివాట్లు వస్తుండడంతో తమకెందుకెలే అన్నట్టు చాలా మంది పోలీసులు వ్యవహరిస్తున్నారు. బెదిరింపుల టెక్నిక్ వర్కౌంట్ అవుతుండడంతో పలు జిల్లాల్లో వ్యాపారులు పోలీసులపై బెదిరింపులకు దిగుతున్నారు. 

స్థానికంగానూ తయారీ.. 
వివిధ రాష్ట్రాల నుంచి రవాణా ద్వారా తీసుకురావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు వ్యాపారులు వివిధ జిల్లాల్లో జనావాసాల మధ్యే గుట్కా తయారు చేస్తున్నారు. గుట్కా ముడి సరుకును మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకొని యంత్రాల ద్వారా గుట్కాలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ తోపాటు పలు జిల్లాల్లో పోలీసులు దాడి చేసి వాటిని మూసివేయించినా.. ఇంకా ఆ దందా కొనసాగుతోంది. అందులో పనిచేసే వాళ్లను కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లను నియమించుకుంటున్నారు. స్థానికులైతే ఇతరులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉందనే ముందు జాగ్రత్తతో నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. గుట్కా తయారు చేస్తున్న వ్యాపారులు ఆ ఉత్పత్తును వందల సంఖ్యలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారులకు, అక్కడ్నుంచి వేలల్లో ఉన్న రిటైల్ వ్యాపారులకు చేరుస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన గుట్కాను స్థానికంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు సైతం తీసుకెళ్తున్నారు. 

ధరలూ అధికమే.. 
పాన్ మసాలా, గుట్కాపై ఉన్న వాటి కంటే రెండు, మూడు రేట్ల ఎక్కువ ధరకు వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో గుట్కా తినే వారి ఆరోగ్యంతోపాటు జేబు సైతం గుల్ల అవుతోంది. గుట్కా తినే వారు సైతం ఎక్కువ సంఖ్యలో ఉండడంతో గుట్కాలకు భారీగా డిమాండ్‌ ఉంది. రెండు నుంచి నాలుగు రూపాయాల మధ్య దొరికే గుట్కాలను ఇప్పుడు15 నుంచి రూ.20 వరకు అమ్ముతున్నారు. గుట్కా వ్యాపారులపై పోలీసులు దాడులు చేసినప్పుడే అక్కడక్కడ వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుట్కా దందాను అరికట్టడంలో భాగంగా పోలీసులు జరుపుతున్న దాడుల్లో మాములు వ్యాపారులే పట్టుబడుతుండగా, బెదిరింపులకు దిగుతూ, మామూళ్లు అందిస్తూ చాలా మంది పెద్ద వ్యాపారులు మాత్రం తప్పించుకుంటున్నారు. Feroz Khan 9640466464 


Feroz Khan 9640466464  




Comments