న్యాయం.. మానవత్వం మరిచిన ఫ్రెండ్లీలు!

‘వంద మంది నేరస్తులు తప్పించుకున్నా.. ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు’ అనేది భారతదేశ న్యాయవ్యవస్థ మౌలిక సూత్రం. కానీ పోలీసు రాజ్యంలా మారిన తెలంగాణలో నేరస్తులు ఎంత మంది తప్పించుకుంటున్నారో తెలియదు గానీ.. ఎంతో మంది నిరపరాధులు పోలీసుల చేత శిక్షింపబడుతున్నారు. న్యాయం, కారుణ్యం, మానవత్వం మరిచిన ఖాకీల చేతుల్లో లాఠీ దెబ్బలు తింటున్నారు. ఉపాధి కరువైన వేళ వేల రూపాయల ఫైన్లుచూస్తూ మానసిక క్షోభకు గురవుతున్నారు. అనుమతులున్నా అడ్డుకోబడుతున్నారు.. పోలీసులు ఇంత చేస్తున్నా.. అవగాహన లేక న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారు సామాన్యులు.





‘వంద మంది నేరస్తులు తప్పించుకున్నా.. ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు’ అనేది భారతదేశ న్యాయవ్యవస్థ మౌలిక సూత్రం. కానీ పోలీసు రాజ్యంలా మారిన తెలంగాణలో నేరస్తులు ఎంత మంది తప్పించుకుంటున్నారో తెలియదు గానీ.. ఎంతో మంది నిరపరాధులు పోలీసుల చేత శిక్షింపబడుతున్నారు. న్యాయం, కారుణ్యం, మానవత్వం మరిచిన ఖాకీల చేతుల్లో లాఠీ దెబ్బలు తింటున్నారు. ఉపాధి కరువైన వేళ వేల రూపాయల ఫైన్లుచూస్తూ మానసిక క్షోభకు గురవుతున్నారు. అనుమతులున్నా అడ్డుకోబడుతున్నారు.. పోలీసులు ఇంత చేస్తున్నా.. అవగాహన లేక న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారు సామాన్యులు.


లాక్ డౌన్ సమయంలో ఇంటికి వెళ్లేటప్పుడు పది నిమిషాలు ఆలస్యమైతే ఆటో డ్రైవర్లపై కేసులు.. వందల మంది ద్విచక్రవాహనదారులకు ఫైన్లు.. ‘ఈ - పాస్’లు ఉన్న అడ్డగింతలు.. లాక్ డౌన్ సమయం పూర్తి కా వడానికి రెండు గంటల ముందే సైరన్లు మోగిస్తూ.. వాహనం నడుపుతూ.. ఫోటోలు తీస్తూ సామాన్యులు, వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేయడం.. ఇది లాక్డౌన్ వేళ నిత్యం పోలీసులు చేస్తున్న పని. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పాలకులు చెబుతున్నా.. అది అధికార పార్టీ వారికి.. పలుకుబడి గల వారికి మాత్రమే పరిమితమవుతోంది. పేదలు, సామాన్యులకు కఠినత్వమే మిగులుతోంది.

ఎన్నెన్నో ఉదాహరణలు.. అయినా కానరాని చర్యలు
వారం రోజుల క్రితం హైదరాబాద్ లో లాక్ డౌన్ సమయం కంటే పది నిమిషాలు ఆలస్యం కావడంతో ఓ ఆటో డ్రైవర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కాళ్లు మొక్కినా కనికరించలేదు. ఇటీవల హైదరాబాద్ లో ని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సీతక్క తల్లికి రక్తం ఇచ్చేందుకు ములుగు నుంచి వెళ్తున్న బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులన్నీ చూపించినా.. గంటలపాటు నిరీక్షింపజేశారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ పోలీసు వాహనంలో డ్రైవర్ లాక్ డౌన్ సమయం పూర్తి కాకముందే సైరన్ మోగిస్తూ.. ఓ చేత్తో వాహనం నడుపుతూ.. మరో చేత్తో ఫోటోలు తీస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. ఆదిలాబాద్ లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొంది, డిశ్చార్చి అయి సొంతూరైన జైనథ్ మండలంలోని సాంగ్వి గ్రామానికి వెళ్తున్న ఓ యువకుడికి రెండు వేల జరిమానా విధించారు. ఇలాంటి ఉదాహారణలు వేలల్లో ఉంటాయి. గతేడాది లాక్ డౌన్ సమయంలోనైతే వేల మందిని పోలీసులు లాఠీలతో కుళ్లబొడిచారు. ఈ సారి హై కోర్టు ఆదేశాలతో కాస్త సంయమనం పాటించినా.. చాలా చోట్ల పోలీసులు లాఠీలను ఉపయోగించారు.



చలాన్ల పేరుతో..
ఇష్టమొచ్చినట్టు చలాన్లు వేస్తూ పోలీసులు సామాన్య, పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరు సంవత్సరాల్లో సుమారు రూ. 1700 కోట్లకు పైగా జరిమానాలు విధించారంటే ఏ స్థాయిలో ఫైన్లు వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఒక ఏడాది పాటు వివరాలు పోలీసులు వెల్లడించలేదు. క్రమక్రమంగా ఈ చలాన్ల జరిమానా పెరుగుతూనే ఉంది. 2014లో కేవలం రూ. 95 కోట్ల ఫైన్ వేసిన పోలీసులు, అదే గతేడాది రూ. 613 కోట్ల ఫైన్లు వేశారు. ఫైన్ వేయడమే కాకుండా సర్ చార్జీ పేరుతో మరో రూ. 35 వసూలు చేస్తున్నారు. చలాన్లు వేయడానికి పోలీసులకు ఉన్నతాధికారులకు టార్గెట్ విధిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది కిందిస్థాయి పోలీసులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

ఫోటోలు తీయడమే డ్యూటీగా..
చాలా మంది పోలీసులు ఫోటోలు తీసి, చలాన్లు వేయడమే తమ డ్యూటీగా భావిస్తున్నట్టు కనిపిస్తున్నారు. దుకాణాల వెనక దాక్కుంటూ ఫోటోలు తీస్తున్నారు. మరికొందరైతే డ్యూటీలో ఉన్నంత సేపు ఫోన్ లో వీడియో తీస్తూ.. ఆ తర్వాత స్టేషన్ కు వెళ్లి.. వాటిని ఫోటో గా క్యాప్చర్ చేసి ఫైన్లు వేస్తున్నారు. అదే సమయంలో చాలా చోట్ల ట్రాఫిక్ కు విఘాతం కలుగుతున్నా ఎక్కడా పట్టించుకోవడం లేదు. కొందరు కిందిస్థాయి పోలీసులైతే మతం కోణంలోనూ ఆలోచిస్తూ ఫైన్లు విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ముస్లింలు వెళ్తున్న వాహనాలనే లక్ష్యంగా చేసుకొని ఫోటోలు తీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లాల్చీ పైజామా వేసుకొని వెళ్తున్న వారి ఫోటోలు తీస్తూ వారికి ఫైన్లు వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొందరు కానిస్టేబుళ్లు ఇలా చేస్తున్నట్టు ఉన్నతాధికారులకు సమాచారమున్నా.. పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

‘రిపోర్ట్ అజ్’పై పట్టింపు లేదు..
తప్పుడు చలానా విధిస్తే ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసుకునేందుకు ‘రిపోర్ట్ అజ్’ ఆప్షన్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అయితే వాటిపై వెళ్లి ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బండికి 2019 ఫిబ్రవరి లో ఫైన్ వేయగా, నిబంధనలకు విరుద్ధంగా ఫైన్ వేశారంటూ అదే రోజు రిపోర్ట్ అజ్ లో ఫిర్యాదు చేశారు. ఏండ్లు గడుస్తున్నా దానిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఓ జిల్లాలో నైతే తన వాహన నెంబర్ పై వస్తున్న ఫైన్ల ఫోటోల్లో తన వాహనం లేదని ఓ వ్యక్తి నాలుగైదు సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇలాంటి ఫిర్యాదులు వేలల్లో ఉన్నా పోలీసుల నుంచి స్పందన కరువవుతోంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసేంత సమయం పేదలు, సామాన్యులకు లేకపోవడం, ఆన్ లైన్ పై అవగాహన లేకపోవడం, ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం లాంటి ఘటనలతో బలవుతున్నది సామాన్యులు, పేదలే. పోలీసులు విధిస్తున్న చలాన్లు చూస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పేరుకే అనేది స్పష్టమవుతోంది.


ఉపాధి లేని సమయంలో..
ఇప్పుడే లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలో లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. అసంఘటిత రంగ కార్మికులకు పని లేకుండాపోయింది. వ్యాపారాలు సాగడం లేదు. దాదాపు 97 శాతం మందికి సంబంధించి ఆదాయం గణనీయంగా పడిపోయింది. వీరిలో 30 శాతం మందికి అసలే ఆదాయం లేదు. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు పోలీసులతో ఫైన్లు వేయిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి. ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉండగా.. మరింత భారం వేస్తున్నాయి. కేవలం బియ్యం మాత్రమే ఇస్తూ ఏదో తమ బాధ్యత తీరిపోయినట్టు ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆర్థికంగా ఆదుకోకపోయినా.. మరింత భారం వేయవద్దని సామాన్యులు కోరుతున్నారు. బీపీఎల్ కుటుంబాల్లోని సభ్యులకు వేసిన ఫైన్లను ఇప్పటికైనా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Feroz Khan 9640466464 
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ 

                                                                                                              
                                                                                              
Comments