దుబ్బాకలో గెలవగానే ఇక తామే ప్రత్యామ్నాయం అన్నారు.. జీహెచ్ఎంసీలో సీట్లు సంపాదించగానే ప్రస్తుతం ప్రతిపక్షం తామేనన్నారు.. మూడేండ్ల తరువాత అధికారంలోకి వస్తామని బీరాలు పలికారు. కాంగ్రెస్ పనైపోయిందని, టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేది కాషాయమేనని చెప్పుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే బీజేపీ అసలు బలం బయటపడింది. కనీసం గెలిచి ఉప ఎన్నిక జరిగిన లింగోజీగూడను సైతం కాపాడుకోలేకపోయింది. మాటలు కోటలు దాటించి సృష్టించిన బుడగ పేలింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల లేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం, ప్రజలను రెచ్చగొట్టడంతోనే గెలవచ్చనే బీజేపీ ఆలోచన తెలంగాణలో చెల్లదని జనం తీర్పునిచ్చినట్టు కనిపించింది. అంతో ఇంతో కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తుండగా, ఇప్పటికైతే స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ కు తిరుగులేదని స్పష్టమవుతోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసి షాక్ లో ఉన్న తెలంగాణ బీజేపీ నాయకులు రాష్ట్రంలో జరిగిన నాగార్జున సాగర్, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కన్నీళ్లు తెప్పించాయనే చెప్పవచ్చు. ఇంత ఘోరంగా ఓడిపోతామని వారు ఊహించి ఉండరు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచినప్పటి నుంచి బీజేపీలో జోష్ కనిపించింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత అది మరింత ఎక్కువైంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను మూడో స్థానానికి పరిమితం చేసి, గెలవగానే ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేశామన్న ఉత్సాహం ఆ పార్టీ కార్యకర్తల్లో కనిపించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 58 స్థానాల్లో గెలవగానే ఇక తమకు తిరుగులేదని, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే వచ్చేది బీజేపీ ప్రభుత్వమేననే ప్రచారాన్ని చేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి..
ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నా.. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా నేరుగా స్పందించలేదు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తూ వచ్చారు. కాంగ్రెస్ కు ప్రతిపక్ష స్థానం లేకుండా చేసిన కేసీఆర్.. బీజేపీ ఎదుగుతుండడంతో ఆ పార్టీని ఢీలా చేసేందుకు వ్యూహ రచన చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను దానికి వినియోగించుకున్నారు. వ్యూహాత్మకంగా పీవీ నర్సింహరావు కుమార్తె సురభివాణిని రంగంలోకి దించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా మొదటి నుంచీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మరో ఎమ్మెల్సీ స్థానంలో కూడా బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఆ తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ కనీసం రెండో స్థానంలో వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో భరోసా కల్పించవచ్చని బీజేపీ భావించింది. అయితే కేసీఆర్ పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు. మంత్రులను ఇన్ చార్జీలుగా నియమించారు. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి జానారెడ్డి బరిలోకి దిగడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. దీంతో బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కకుండాపోయింది.
పురపోరులో వాడిన కమలం..
రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో కమలం పూర్తిగా వాడిపోయింది. అసలు బలం తెలిసొచ్చింది. క్షేత్రస్థాయిలో పటిష్టంగా లేరనే వాస్తవం బయటపడింది. గ్రేటర్ వరంగల్ లో మొత్తం 66 స్థానాలు ఉంటే కేవలం పది స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. ఖమ్మం కార్పొరేషన్ లో మొత్తం 60 స్థానాలు ఉండగా, కేవలం ఒక్క స్థానానికే బీజేపీ పరిమితమైంది. ఇక్కడ కాంగ్రెస్ పది స్థానాలను గెలిచింది. సిద్ధిపేట, అచ్చంపేట మునిసపాలిటీల్లో ఒక్కో స్థానం మాత్రమే దక్కించుకోగలిగింది. నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీల్లో అసలు ఖాతానే తెరవలేకపోయింది. జడ్చర్లలో కాంగ్రెస్ తో సమానంగా రెండు స్థానాల్లో విజయం సాధించింది. మొత్తంగా 248 వార్డుల్లో పోటీ చేస్తే గెలిచింది 16 మాత్రమే.
పునాది లేకనే..
తెలంగాణలో బీజేపీకి బలమైన పునాది లేదనేది స్పష్టం. క్షేత్రస్థాయిలో బలాన్ని, కార్యకర్తలను పెంచుకోకుండా, కేవలం మాటల ద్వారానే గెలచవ్చనే భావనకు ఇటీవల జరిగిన నాగార్జున సాగర్, పుర ఎన్నికలతో బ్రేక్ పడింది. గాలివాటపు విజయాలతో చరిత్రలు మలుపు తిరగవని, బలమైన నాయకులను ఎదుర్కొలేమని ఇప్పటికైనా బీజేపీ నాయకులు గ్రహిస్తే మంచిది. కేవలం హిందూత్వ, రెచ్చ గొట్టే మాటలపై ఆధారపడకుండా, ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడానికి, ప్రజా సమస్యలపై పోరాడడానికి, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించడానికి ప్రణాళికలు రూపొందిస్తే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల నమ్మకాన్ని గెలిచే ప్రయత్నం చేయవచ్చు. Feroz Khan 9640466464
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్
addComments
Post a Comment