గీత దాటితే తాట తీస్తాం.!

 ఎక్కువ చేస్తే ఉక్కుపాదమే!

గుట్కా విక్రయదారులకు ఎస్పీ హెచ్చరిక 

న్యాయ స్థానంలో హాజరు పరిచి జైలుకు తరలిస్తాం

ఇద్దరిపై హిస్టరీ షీట్ (సస్పెక్ట్ షీట్) నమోదు 

తెరపైకి సెక్షన్ ఐపీసీ 328 

తరచుగా పట్టుబడితే పీడీ యాక్ట్ 


గుట్కా విక్రయదారులపై పోలీసులు ఇక ఉక్కు పాదం మోపనున్నారు.. మాటిమాటికి పట్టుబడితే కేసులతో సరిపెట్టకుండా న్యాయస్థానంలో ప్రవేశపెట్టి జైలుకు పంపనున్నారు. ఇంకా ఎక్కువ చేస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీని ద్వారా గుట్కా మహమ్మారిని కూకటి వేళ్లతో తీసివేసేందుకు నడుం బిగించారు. గుట్కా విక్రయదారులపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో బుధవారం ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర స్వయంగా తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 


‘గుట్కా విక్రయిస్తున్నారు.. మాటిమాటికి పట్టుబడుతున్నారు.. కేసులు నమోదు చేసినా భయపడడం లేదు. గుట్కా విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశించారు. అందుకే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం’ అని ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అన్నారు. బుధవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. గుట్కా, తంబాకుతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, గుట్కా విక్రయదారులను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని డీజీపీ డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశించారని వివరించారు. దీంతో ఇకమీదట గుట్కా విక్రయాలు చేపడితే సెక్షన్ 328 ఐపీసీ ప్రకారం నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచి జైలుకు తరలిస్తామని తెలిపారు. గుట్కా తినడంతో ప్రజలు, యువకులు క్యాన్సర్, ఇతర అనారోగ్యాలకు గురై బాధపడుతున్నారని తెలిపారు. ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న గుట్కా, తంబాకు వ్యాపారస్తుల ఆటలు జిల్లాలో ఇక సాగవని, చట్టపరిధిలో దాన్ని కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. చట్టపరమైన సెక్షన్ల సవరణతో నూతన సెక్షన్ 328 ఐపీసీతో నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి జైలుకు తరలిస్తామని తెలిపారు. గుట్కా కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా మళ్లీ తరచుగా గుట్కా వ్యాపారం కొనసాగిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. పట్టణంలోని ఇద్దరు ప్రధాన గుట్కా సరఫరాదారులైనా అక్రమ్ ట్రేడర్స్ యజమాని మొహమ్మద్ అక్రమ్, అస్లం ట్రేడర్స్ యజమాని సాజిదుల్లా ఖాన్పై జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్లలో 20 నుండి 30 కేసులు నమోదై ఉన్నట్టు తెలిపారు. గతంలో గుట్కా విక్రయదారులు పట్టుబడినప్పుడు బెయిలబుల్ కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ లోనే బెయిలు మంజూరు చేసి నిందితులను విడుదల చేసేవారని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకొని నిందితులు భయం లేకుండా ఇదే వ్యాపారాన్ని కొనసాగించారన్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల నిర్ణయంతో గుట్కా వ్యాపారాన్ని కూకటివేళ్లతో తుది ముట్టించాలని చాలా కఠినమైన సెక్షన్ విధించడానికి ఉత్తర్వులు వచ్చినట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి గుట్కా వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించాలని ఆదేశాలు వచ్చాయన్నారు. ప్రజల సహకారం మరింతగా పెరగాలని అన్నారు. డయల్ -100 లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 83339 86898 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని తెలిపారు. వారి కోరితే వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామన్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపారు. పోలీసుల నుండి అక్రమార్కులు తప్పించుకోలేరని అన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎన్ఎస్వీ వెంకటేశ్వరరావు, పట్టణ సీఐలు ఎస్ రామకృష్ణ, పోతారం శ్రీనివాస్, కే. పురుషోత్తం చారి పాల్గొన్నారు. 



Feroz Khan 9640466464 

ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464


Comments