‘రిమ్స్’ పోస్టుల భర్తీలో ఏజెన్సీల ఇష్టారాజ్యం
దరఖాస్తుల స్వీకరణలో ప్రభుత్వ ప్రమేయం శూన్యం
మెరిట్, రోస్టర్ పై గందరగోళం
రిమ్స్ లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతరేస్తున్నట్టు కనిపిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ సమయంలోనే పరిస్థితి దారుణంగా తయారైంది. సుమారు 247 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ అయింది. జూన్ ఏడో తేదీన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ప్రభుత్వ ప్రమేయం శూన్యంగా కనిపిస్తోంది. ఏజెన్సీ నిర్వాహకులే ఇష్టారాజ్యంగా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, కనీసం దరఖాస్తులు తీసుకున్నట్టు ఎలాంటి రుజువులు, రిసిప్ట్ లు అందించడం లేదు. కేవలం రిజిష్టర్ లో మాత్రమే పేరు నమోదు చేసుకుంటున్నారు. అంతేకాకుండా మెరిట్, రోస్టర్ విధానంపై గందరగోళం నెలకొంది. పోస్టుల భర్తీలో అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు ఉండగా, ఒక్కో పోస్టు భర్తీకి ఏడాది నుంచి రెండేళ్ల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు వినిపిస్తోంది. అయితే అవినీతి లేకుండా, పారదర్శకంగా పోస్టుల భర్తీ జరగాలంటే దరఖాస్తుల స్వీకరణ నుంచే ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాకుండా దరఖాస్తుల స్వీకరణ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించే అవకాశాలు లేనందున, ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని దరఖాస్తు దారులు డిమాండ్ చేస్తున్నారు.
నిరుద్యోగం.. అత్యధిక మందిని, కుటుంబాలను పట్టిపీడిస్తున్న సమస్య. ఇదే పేదరికానికి మూలం.. నేరాలకు కారకం...! ఉద్యోగం పొందాలంటే ఏళ్ల తరబడి నిరీక్షించాలి. ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాలి. అప్పటి వరకు ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ ఉండాలి. అయినా నోటిఫికేషన్లు రాక యువత విసిగి వేసారిపోతున్నారు. కొందరు బలవరన్మరణాలను సైతం ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు లక్ష్యాలను పక్కన పెట్టి.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి కుటుంబాలను పోషించేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం రాజ్యమేలుతున్న తరుణంలో.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రిమ్స్ లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 247 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. దీన్ని అక్రమార్కులు అస్త్రంగా మలుచుకున్నారు. దళారులు ప్రవేశించారు. దరఖాస్తుల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోయినా.. అప్పుడే బేరసారాలు మొదలు పెట్టారు. లక్షన్నర నుంచి నాలుగు లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అంత ఇచ్చినా ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ ఉన్నారు. ఇచ్చి ఉద్యోగం లో చేరినా అది ఎన్నాళ్లుంటుందనే భరోసా లేదు. అయినా కుటుంబ పోషణ, ఆర్థిక ఇబ్బందులు పోతాయనే ఆశతో అప్పులు చేసి సైతం డబ్బులు ఇచ్చేందుకు అభ్యర్థులు రెడీగా ఉండగా.. అర్హులైన వారికి మాత్రం తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముంది.
భర్తీ కానున్న ఉద్యోగాలివే...!
సూపర్ స్పెషాలిటీ ఆస్ప్తరిలో సుమారు 25 విభాగాల్లో ఖాళీలగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. జూన్ 11వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. స్టాఫ్ నర్స్ 144 పోస్టులు, స్టోర్ కీపర్ 6, స్టెనో/టైపిస్ట్ 11, రికార్డ్ క్లర్క్/రికార్డ్ అసిస్టెంట్ 06, పెర్ఫ్యూజనిస్ట్ ఒకటి, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ రెండు, ఈఈజీ టెక్నీషియన్ రెఁడు, ఈసీజీ టెక్నీషియన్ నాలుగు, ల్యాబ్ అసిస్టెంట్ 15, ఎలక్ర్టీషియన్ రెండు, ప్లంబర్ ఒకటి, పీఆర్‌ఓ రెండు, ల్యాబ్ అంటెండంట్ 8, దోబీ 2, బార్బర్ ఒకటి, రెసిప్రేటరీ థెరపిస్ట్ 2, చెస్ట్ ఫిజియోథెరపిస్ట్ రెండు, డయాలసిస్ టెక్నీషియన్ మూడు పోస్టులు, ఫార్మాసిస్ట్ 03, రేడియో గ్రాఫర్ 4, డిజిటల్ ఇమేజింగ్ టెక్నిషియన్ 2, సిటీ టెక్నీషియన్ 4, ఎమ్ఆర్ టెక్నీషియన్ 4, ఓటీ టెక్నీషియన్ 4, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్స్ 12 పోస్టులు ఉన్నాయి.
అంతా గోప్యమే..!
వైద్య కళాశాలతో ఎలాంటి సంబంధం లేని ఓ నలుగురు గుత్తేదారులను నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేశారు. మానవ వనరులను సమకూర్చడానికి గుర్తింపు పొందిన అనేక సంస్థలు ఉన్నప్పటికీ గతంలో జిల్లా కేంద్రాసుపత్రిలో మ్యాన్‌పవర్ ఇచ్చే అర్హత ఆ నలుగురికే ఉన్నట్లు నిబంధనలను తీసుకురావడంలో అధికార పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారు. గత నెల మొదటి వారంలో వివిధ విభాగాల్లో కలిపి 25 మందిని నలుగురు గుత్తేదారుల ద్వారా ఎలాంటి ప్రకటన లేకుండా ఎంపిక చేశారు. సెప్టెంబర్ 16న 'నియామకాలు షురూ.. నిబంధనలకు నీళ్లు' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనంతో స్పందించిన అప్పటి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఎంపికను తాత్కాలికంగా నిలిపివేశారు. జిల్లా అధికారులు సైతం ఎంపిక వ్యవహారంలో వెనకడుగు వేసి డీఎంఈకి వదిలేసినట్లు సమాచారం. కొద్దిరోజుల తరువాత రంగంలోకి దిగిన గుత్తేదారులు అధికార పార్టీ నాయకుడి చొరవతో ఎవరికి అనుమానం రాకుండా విడతల వారీగా వివిధ విభాగాల్లో ఉద్యోగులను ఎంపిక చేశారు. వారిలో స్థానిక నాయకుడి సిఫారసుతో పాటు ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలకు పైగా గుత్తేదారులు వసూలు చేసినట్లు చర్చించుకుంటున్నారు.
సమాచారం ఇవ్వరు..
ఏజెన్సీల ఎంపిక నుంచి.. ఉద్యోగులను నియమించే వరకు ఎలాంటి సమాచారాన్ని అధికారులు ఇవ్వడం లేదు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంపిక చేయాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. అంతేకాకుండా టెండర్లు వేసి ఏజెన్సీలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటిది ఇక్కడ జరిగినట్టు కనిపించడం లేదు. అసలు ఏజెన్సీలను ఎలా ఎంపిక చేశారనే దానిపై అధికారులు వివరణ ఇచ్చేందుకు సైతం సిద్ధంగా లేరు.
అంతా గందరగోళం..
ఏజెన్సీల ఎంపిక నుంచే వ్యవహారమంతా గందరగోళంగా, అవినీతికి ఆస్కారం ఉన్నట్టు కనిపిస్తోంది. పోస్టులు, విద్యార్హతల గురించి నోటిఫికేషన్ లో ఇచ్చి, మెరిట్, రోస్టర్ విధానం ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు. అయితే నోటిఫికేషన్ లో ఎక్కడా రిజర్వేషన్ల గురించి ప్రస్తావించలేదు. అంతేకాకుండా కొన్ని రకాల పోస్టులకు విద్యార్హతలు తక్కువగా ఇచ్చినట్టు విమర్శలున్నాయి. పీఆర్ఓ పోస్టులకు మాస్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజంలో పీజీ చేసిన వారికి అవకాశమివ్వాల్సి ఉండగా, అలా చేయకుండా ఎనీ డిగ్రీ విద్యార్హతనిచ్చారు. అంతేకాకుండా మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తామని చెప్పినా.. మొదటి స్థానంలో ఉన్న వారు డబ్బులు ఇవ్వకుంటే అప్పటికప్పుడే రిజర్వేషన్ ను మార్చేసి, ఇతరులతో బేరసారాలు చేసుకునే అవకాశం సైతం ఉంది. అందుకే ముందుగా రిజర్వేషన్లను ప్రకటించలేదనే ఆరోపణలున్నాయి. దరఖాస్తుల ప్రక్రియపై సైతం ఎన్నో విమర్శలు వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకపోగా, ఏజెన్సీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దరఖాస్తు తీసుకున్నాక కేవలం రిజిష్టర్ లో పేరు నమోదు చేస్తున్నారు. కానీ ఎలాంటి రీసివ్డ్ కాపీ ఇవ్వడం లేదు. ఆన్ లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ చేపడితే పారదర్శకంగా ఉంటుందని తెలిసినా పట్టించుకునే వారు లేరు.
అధికారుల తీరుపై విమర్శలు..
పోస్టుల భర్తీలో గందరగోళం ఉన్నట్టు, అవినీతి జరుగుతున్నట్టు విమర్శలు వచ్చినా, ఆరోపణలు వచ్చినా అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించేలా, ప్రభుత్వ అధికారులే ఉద్యోగులను ఎంపిక చేసి వారిని ఏజెన్సీలకు అప్పజెప్పాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయఅఖిలపక్ష నాయకులకు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేసినా .. చేస్తాం చూస్తాం అనడమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ జిల్లా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలని, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని కోరినా.. దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ తీరే మారలేదు. దరఖాస్తులను ఆన్ లైన్ లో స్వీకరించేలా అధికారులు చర్యలు తీసుకుంటే నిరుద్యోగుల్లో కాస్తంతైనా నమ్మకం వచ్చే అవకాశముంది.
సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేయాలి..
దర్శనాల మల్లేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
హైదరాబాద్ లో గతంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు జరిగినప్పుడు అప్పటి కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిబంధనల ప్రకారం నియామకాలు జరిపి, ఉద్యోగులను ఏజెన్సీలకు అప్పగించారు. అలాంటి పద్ధతే ఇక్కడ కూడా పాటిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. జిల్లా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. దానికంటే ముందే ముందే రిజర్వేషన్ల ను ప్రకటించాలి. రోస్టర్, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాలి. అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అర్హులకు కాకుండా అనర్హులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తే పోరాటం చేస్తాం. Feroz Khan 9640466464
Feroz Khan 9640466464
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్
addComments
Post a Comment