వెబ్ సిరీస్ కు తగ్గని మహారాష్ట్ర రాజకీయం

మున్ముందు ఏం జరుగుతుందోననే సస్పెన్స్.. రోజుకో ట్విస్ట్.. అనేక మలుపులు..  రెండో సిరీస్ ఎప్పుడొస్తుందనే వెయిటింగ్.. ఇది సినిమాలు, వెబ్ సిరీస్ లలో జరిగే తంతు.. కానీ రెండు నెలలుగా మహారాష్ట్ర రాజకీయాన్ని గమనిస్తే ఏ వెబ్ సిరీస్ కు, బాలీవుడ్ సినిమాకు తగ్గనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని రాజకీయ పార్టీలు, సంస్థలు ఆ ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నాయో అర్థమవుతోంది. అంతేకాకుండా ఈ పార్టీల రాజకీయాలకు కొందరు ఉద్యోగులు బలవుతుండగా.. మరికొందరు అమాయకులు లోకం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

2019లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు, 19వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేశాక మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎత్తుకు పై ఎత్తులతో ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోగా, వీరి రాజకీయాలు సినిమాలను తలపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కరోనా లాంటి మహమ్మారి ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న ఆయనకు.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనేది వాస్తవం. భారతదేశ అత్యంత సంపన్నుడు, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ముకేష్ అంబానీ నివాసమైన అంటిల్లా వద్ద ఒక వాహనంలో దొరికిన జిలిటెన్ స్టిక్స్ వ్యవహారం చిలికి చిలికి గాలివానై.. హోంమంత్రి రాజీనామా వరకు వెళ్లింది. అంతేకాకుండా ఈ వ్యవహారం ఎక్కడ వరకు సాగుతుందో.. అధికార మార్పిడి జరిగే వరకు వెళ్తుందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. 

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2021 ఫిబ్రవరి 25న జరిగిన ఘటనతో ఈ వ్యవహారం మొదలైంది. ముకేష్ అంబానీ ఇల్లయిన అంటిల్లా ఎదుట ఓ మహింద్రా స్కార్పియో వాహనం కనిపింది. ఈ వాహనంలో పేలుళ్లకు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ లభించాయి. దీంతో ముంబై పోలీసులు అప్పటికప్పుడు విచారణను ప్రారంభించారు. అంతేకాకుండా అంబానీ కుటుంబసభ్యులకు సెక్యూరిటీని మరింత పెంచారు. ఫిబ్రవరి 26న ముంబై పోలీసులు ఆ వాహనంలో 20 జిలెటిన్ స్టిక్స్ దొరికాయని, అయితే అవి పేలడానికి ఉపయోగించే డిటోనేటర్ లేదని ప్రకటించారు. అంటే ఆ జిలెటిన్ స్టిక్స్ తో కూడిన ఆ వాహనాన్ని వదిలి పెట్టి వెళ్లిన వారి ఉద్దేశం అక్కడ పేలుడు జరపడం కాదు.. కేవలం వారిని భయపెట్టడం లేదా ఒక సందేశాన్ని వదిలివెళ్లడం అనేది అర్థమవుతోంది. స్కార్పియో కు నెంబర్ ప్లేట్ కూడా నకిలీది అమర్చారు. అది కూడా అంబానీ సెక్యూరిటీ వాహనాల్లోని నెంబర్ ప్లేట్లకు సరిపోలి ఉంటుంది. అంటే ఈ పని చేసిన వాళ్లు అంబానీ కుటుంబసభ్యులనూ ఎన్నో రోజుల నుంచి గమనించారనే విషయం అర్థమవుతోంది. 


ఉగ్రవాదుల పనేనా అని అనుమానాలు

ముంబై బిలీయనీర్స్ రో గా పిలిచే ఆ ప్రాంతంలో సీసీ టీవీలను పరిశీలించగా ఓ వ్యక్తి ఆ స్కార్పియోను అక్కడి వదిలేసి, ఆ తర్వాత ఇన్నోవాలో కూర్చొని వెళ్లిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అతను మాస్క్ వేసి ఉండడంతో అతనెవరో గుర్తించలేకపోయారు. అంతేకాకుండా ఆ వాహనంలో ఒక లెటర్ కూడా దొరికింది. ‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. మరోసారి పూర్తి ఏర్పాట్లు జరుగుతాయి’ అనే బెదిరింపు సందేశం అందులో ఉంది. అదే సమయంలో సోషల్ మీడియా అప్లికేషన్ టెలిగ్రాంలో జైషుల్ హింద్ పేరుతో ఓ సందేశం వైరల్ అవుతుంది. ఇది తాము చేసిన పనేనని ఆ సంస్థ ప్రకటించుకుంటుంది. బిట్ కాయిన్ రూపంలో అంబానీ తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఆ తర్వాత మార్చి ఒకటో తేదీన అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన వాహనం పెట్టడంలో తమ పాత్ర ఏమీ లేదని జైషుల్ హింద్ ప్రకటిస్తుంది. టెలిగ్రాంలో తమ పేరుతో సర్క్యులేట్ అవుతున్నది ఫేక్ పోస్ట్ అని స్పష్టం చేస్తుంది. అంబానీ, వారి కుటుంబసభ్యులతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని, కేవలం తమ పోరాటం ప్రభుత్వం, వారు అవలంభిస్తున్న విధానాలపైనే అని ప్రకటిస్తుంది. అయితే జైషుల్ హింద్ పేరుతో ఎలాంటి సంస్థ తమ రికార్డుల్లోనే లేదని మార్చి రెండో తేదీన ముంబై పోలీసులు ప్రకటిస్తారు. అంతేకాకుండా టెలిగ్రాం పోస్టులో క్రిప్టో కరెన్సీ పంపాలని చెప్పిన అడ్రస్ కూడా ఫేకే అని గుర్తిస్తారు.  ఈ కేసు విషయమై మార్చి 11వ తేదీన ముంబై పోలీసులు ఓ ప్రైవేటు సైబర్ ఏజెన్సీని ఆశ్రయిస్తారు. ఆ టెలిగ్రాం గ్రూప్ ను ఏ మొబైల్ ఫోన్ తో తయారు చేశారో ఆ ఫోన్ లొకేషన్ ఢిల్లీలోని తిహార్ జైలు సమీపంలో ఉన్నట్టు ఆ ఏజెన్సీ గుర్తిస్తుంది. దీంతో ముంబై పోలీసులు ఢిల్లీ పోలీసుల సహాయాన్ని కోరుతారు. ఢిల్లీ పోలీసులు తిహార్ జైలులో విచారణ చేపడుతారు. 2013 హైదరాబాద్ జంట బాంబుపేలుళ్ల కేసు అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన తహసీన్ అఖ్తర్ బ్యారక్ నుంచి వారికి ఒక మొబైల్ ఫోన్ దొరుకుతుంది. ఇదే ఫోన్ తో జైషుల్ హింద్ పేరుతో గ్రూప్ తయారు చేశారా కోణంలో ఢిల్లీ పోలీసులు దర్యాపు జరపగా, ఈ కేసు విచారణను తప్పుదోవ పట్టించడానికి, పోలీసులను కన్ ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఆ ఫోన్ ను అక్కడ ఉంచారని తేలుతుంది. 


మన్సూఖ్ హీరేన్ హత్య..

ఉగ్రవాద కోణంలో దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే మరోవైపు నుంచి కూడా విచారణ సాగించారు. స్కార్పియో వదిలి వెళ్లిన మరుసటి రోజు ఫిబ్రవరి 26న మన్సూఖ్ హీరేన్ అనే వ్యక్తి ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వస్తాడు. అంబానీ ఇంటి ఎదుట దొరికిన వాహనం తనదేనని పోలీసులకు వెల్లడిస్తాడు. థానెకు చెందిన వాహనాల స్పేర్స్ పార్ట్స్ డీలర్ గా వ్యాపారం చేసే ఆ వ్యక్తి స్టీరింగ్ వీల్ జామ్ కావడంతో ఆ వాహనాన్ని ఫిబ్రవరి 17న అరోలి ములుంద్ బ్రిడ్జి వద్ద పార్క్ చేసి విడిచిపెట్టినట్టు చెబుతాడు. మరుసటి రోజు వాహనాన్ని తీసుకువెళ్లడానికి వస్తే ఆ వాహనం కనిపించలేదని వివరిస్తాడు. అంతేకాకుండా విక్రోలి పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగిందని కంప్లేంట్ ఇచ్చినట్టు చెబుతాడు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే మార్చి ఐదో తేదీన ముంబ్రా క్రీక్ లో మన్సూఖ్ హీరేన్ మృతదేహం లభ్యమవుతుంది. అతను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని థానే పోలీసులు ప్రకటిస్తారు. అంబానీ ఇంటి ఎదుట స్కార్పియో వాహనం దొరికిన తర్వాత పోలీసులు, మీడియా పదేపదే వేధించారని, దీంతో అతను ఆత్మహత్య చేసుకొని ఉంటారని విశ్లేషిస్తారు. ఈ విషయమై ముఖ్యమంత్రికి అతను ఉత్తరం కూడా రాశాడని చెప్పుకొచ్చారు. కానీ మన్సూఖ్ హీరేన్ భార్య విమల హీరేన్ ఇదంతా కట్టుకథ అని కొట్టిపారేస్తుంది. బాంబు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసు అధికారి సచిన్ వఝే తన భర్త మన్సూఖ్ హీరేన్ ను హత్య చేశాడని ఆరోపిస్తుంది. 


దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపణలతో మలుపులు

మన్సూక్ హీరేన్ హత్య తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును మహారాష్ట్ర ఏటీఎస్ కు అప్పగిస్తుంది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులపై ఏటీఎస్ హత్య కేసు నమోదు చేస్తుంది. విచారణ ప్రారంభిస్తారు. మరోవైపు ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తుతారు. మన్సూఖ్ హీరేన్ భార్య విమల హీరేన్ ఫిర్యాదు, కాల్ డిటేయిల్డ్ రికార్డ్స్ ను చదివి వినిపిస్తారు. అంతేకాకుండా సంచలన విషయాలను వెల్లడిస్తారు. వాహనాల పార్ట్స్ ల వ్యాపారం చేసే మన్సూఖ్ హీరేన్ కు వచిన్ వఝే కస్టమర్ అని ఆరోపిస్తారు. అంబానీ ఇంటి ఎదుట దొరికిన జిలెటిన్ స్టిక్స్ తో కూడిన వాహనం 2020 నవంబర్ నుంచి 2021 ఫిబ్రవరి ఐదో తేదీ వరకు సచిన్ వఝే వద్దే ఉన్నట్టు ఆధారాలున్నాయని సభకు వివరిస్తారు. స్టీరింగ్ హార్డ్ అయినట్టు చెబుతూ సచిన్ వఝే ఆ వాహనాన్ని మన్సూఖ్ హీరేన్ కు ఆ తర్వాత అప్పగించినట్టు వెల్లడిస్తారు. అంతేకాకుండా 25 ఫిబ్రవరి రోజు అంబానీ ఇంటి ఎదుట ఆ వాహనం దొరికిన తర్వాత కూడా 26, 27, 28 ఫిబ్రవరి మూడు రోజులు మన్సూఖ్ హీరేన్ సచిన్ వఝేతో కలిసి క్రైం బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లినట్టు చెబుతారు. అంతేకాకుండా హీరేన్ స్టేట్ మెంట్ ను కూడా వఝేనే రికార్డు చేసినట్టు చెప్పారు. వఝే సూచన మేరకే తనను వేధింపులకు గురి చేస్తున్నట్టు మన్సూఖ్ హీరేన్ మార్చి రెండో తేదీన ముఖ్యమంత్రి, హోం మంత్రి, ముంబై పోలీసు కమిషనర్ కు లేఖ రాసినట్టు స్పష్టం చేస్తారు. 


మన్సూఖ్ హత్యపై భార్య ఆరోపణలు.. 

మన్సూఖ్ హత్యతో కేసు మరిన్ని మలుపులు తిరుగుతుంది.అంబానీ బాంబు కేసులో తనను అరెస్టు కావాలని సచిన్ వఝే సూచించినట్టు మన్సూఖ్ హీరేన్ తనతో చెప్పారని అతడి భార్య విమల హీరేన్ వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో బెయిల్ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. అయితే అరెస్టు అయ్యేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మార్చి నాలుగో తేదీ రోజు రాత్రి తనను తావ్డే పేరు గల ఒక పోలీసు అధికారి పిలిచారని, రాత్రి భోజనం చేసి వస్తానని చెప్పి భార్యతో చెప్పి ఆటో రిక్షాలో బయటకు వెళ్లాడని వివరించారు. రాత్రి 11 గంటల తర్వాత మన్సూఖ్ హీరేన్ ఫోన్ అన్ రీచెబుల్ వచ్చిందని, మరుసటి రోజు అతని మృతదేహం లభ్యమైందని ఆమె వెల్లడించారు.  


వఝే ఎవరు?

1990 బ్యాచ్ కు చెందిన వఝే స్పల్ప కాలంలోనే థానే పోలీస్ స్టేషన్ లో స్పెషల్ స్క్వాడ్ లో నియమితులయ్యారు. వఝే ఎన్ కౌంటర్ స్పెషలిస్టులు ప్రదీప్ శర్మ, దయానాయక్ టీమ్ లలో పని చేశారు. ఈ టీమ్ లు 63 ఎన్ కౌంటర్లు చేసినట్టు చెబుతారు. 2002 ఘాతక్ పూర్ ఘటనలో పోలీసు కస్టడిలో ఉన్న ఖ్వాజా యూనుస్ ఎన్ కౌంటర్ కేసులో 2004 మార్చిలో 15 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేయగా, వారిలో వఝే ఒకరు. 2007లో వఝే తన పోస్టుకు రాజీనామా చేశారు. ఏడాది తర్వాత 2008లో శివసేన పార్టీలో చేరారు. 16 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత 2020లో వఝే సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కాలంలో మానవ వనరుల కొరతను చూపిస్తూ ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ పాత అధికారులను పిలిపించినట్టు చెబుతారు. సస్పెన్షన్ ఎత్తివేసిన కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లోనే సచిన్ వఝే కు ను ముంబై క్రైం బ్రాంచ్ క్రిమినల్ ఇంటెలీజెన్స్ యూనిట్ లో పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాకుండా హై ప్రొఫైల్ కేసులను సైతం అప్పగించారు. టీఆర్పీ స్కామ్, అంటిల్లా బాంబింగ్ కేసుల విచారణను కూడా ఆయన చేపట్టారు. పోస్టులో చిన్న వాడైనా, సుదీర్ఘ కాలం సస్పెన్షన్ లో ఉన్న ఆయన నేరుగా ముంబై పోలీస్ కమిషనర్ కే రిపోర్టు చేస్తుండడం గమనార్హం. 


పరంబీర్ సింగ్ ఎవరు?

నిజనిజాలు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో కేసు వేసిన పరంబీర్ సింగ్ మొట్టమొదటి గా 2008లో ఏటీఎస్ కమిషనర్ గా ఉన్నప్పుడు వార్తల్లో నిలిచారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాఠాకూర్, కల్నల్ పురోహిత్ ను అరెస్టు చేశారు. 2015లో అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరంబీర్ సింగ్ ను థానే పోలీసు కమిషనర్ గా నియమించారు. ఆ సమయంలో ఎన్నో హై ప్రొఫైల్ కేసులను పరిష్కరించారు. ఫడ్నవీస్ సర్కారుకు ఎంతో నమ్మకస్తుడిగా పని చేశారు. 2020లో పరంబీర్ సింగ్ ముంబై పోలీసు కమిషనర్ గా నియమితులయ్యారు. అప్పుడు కరోనా కష్టకాలం నడుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసును సైతం ఆయన విచారించారు. ఈ కేసు విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. 


వఝే అరెస్టు తర్వాత.. 

మార్చి 13వ తేదీన ఎన్ఐఏ సచిన్ వఝేను ఈ కేసులో అరెస్టు చేసింది. దీంతో అతడిని తిరిగి విధుల్లోకి తీసుకున్న ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో మార్చి 17వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వం పరంబీర్ సింగ్ ను ముంబై పోలీసు కమిషనర్ పదవి నుంచి తప్పించి హోంగార్డ్ డిపార్ట్ మెంట్ కు పంపించారు. బదిలీ అయిన మూడు రోజుల్లోనే పరంబీర్ సింగ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు లేఖ రాశారు. బార్లు, రెస్టారెంట్లు, ఇతర వనరుల నుంచి ప్రతి నెల రూ. 100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని మహారాష్ట్ర హోంమంత్రి అనీల్ దేశ్ ముఖ్ సచిన్ వఝేను ఆదేశించారని ఆరోపించారు. అప్పుడు అనీల్ దేశ్ ముఖ్ ఈ ఆరోపణలను ఖండించగా, ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. దీంతో దేశ్ ముఖ్ పై సీబీఐ విచారణ చేపట్టాలంటూ పరంబీర్ సింగ్ సుప్రీం కోర్టులో కేసు వేశారు. అంతేకాకుండా తన బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీంతో సుప్రీం కోర్టు బాంబై హై కోర్టుకు వెళ్లాలని అతడిని సూచించింది. అయితే మరోవైపు దేశ్ ముఖ్ పై న్యాయ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 


ప్రభుత్వంపై దాడిపై దాడి 

పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణల నుంచి తేరుకోక ముందే ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం పై మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. మార్చి 24వ తేదీన ‘మనీ ఫర్ ట్రాన్స్ ఫర్ స్కాం’ పై అనేక ఆరోపణలు చేశారు. 2020 ఆగస్టు 25వ తేదీన కమిషనర్ ఆఫ్ ఇంటెలీజెన్స్ రష్మీ శుక్లా డీజీపీ సుబోధ్ కుమార్ జైస్వాల్ కు ఒక రిపోర్ట్ అందజేశారని, ఆ రిపోర్ట్ ను అప్పటి చీఫ్ సెక్రెటరీ సీతారాం కుంతెకు ఫార్వర్డ్ చేశారని తెలిపారు. ఈ రిపోర్టులో కొందరు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, మధ్య వర్తుల మధ్య జరిగిన కొన్ని ఫోన్ సంభాషణలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ఉధ్ధవ్ ఠాక్రే ఈ రిపోర్టుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఫడ్నవీస్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చీఫ్ సెక్రెటరీ నుంచి రిపోర్ట్ ను అడిగారు. ఇదంతా అబద్ధమని.. వాస్తవాలు ఏమీ లేవని చీఫ్ సెక్రెటరీ వీటన్నింటినీ కొట్టిపారేశారు. అంతేకాకుండా రహాస్య సమాచారన్ని లీక్ చేశారంటూ రష్మీ శుక్లాపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 


సీబీఐ విచారణకు ఆదేశం.. హోం మంత్రి రాజీనామా..

సీబీఐ ఎంక్వైరీకీ బాంబై హై కోర్టు ఆదేశించడంతో నైతిక బాధ్యతతో మార్చి ఐదో తేదీన హోం మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు అనీల్ దేశ్ ముఖ్ ప్రకటించారు. అంతేకాకుండా సుప్రీం కోర్టుకు ఈ విషయమై వెళ్తానని స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్ష బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారం ఎంతో సుదీర్ఘంగా ఉన్నా, సంక్లిష్టంగా ఉన్నా.. మున్ముందు మరెన్నో ఘటనలు జరిగే అవకాశం కనిపిస్తోంది. 



సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో 

ఈ వ్యవహారంలో సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి. అంబానీ ఇంటి ఎదుట జిలెటిన్ స్టిక్స్ తో కూడిన వాహనం ఉంచిన వారి ఉద్దేశ్యం ఏమిటి? వఝే ఒక్కరే ఈ ప్రణాళికను అమలు చేసి ఉండరు కదా ? అయితే దీని వెనుక ఎవరు ఉన్నారు ? పరంబీర్ సింగ్, వఝే మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి ? అప్పటి హోం మంత్రి అనీల్ దేశ్ ముఖ్ పై పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవమెంత ? రష్మీ శుక్లా ఏదైనా పార్టీ లేదా ఏదైనా నాయకుడికి అనుకూలంగా పని చేశారా ? అవును అయితే ఎవరు ? ఈ వ్యవహారమంతా అనుకోని సంఘటనల సమాహారామా లేదా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రనా ? మున్ముందు ఎవరెవరి వికెట్లు పడతాయి.. అధికార మార్పిడి జరుగుతుందా.. ? ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కాపాడుకోగలుగుతారా ? ప్రజలకు వాస్తవాలెన్ని తెలుస్తాయి ?ఈ విషయాలు తేలాలంటే ఎన్నాళ్లు ఆగాల్సి వస్తుందో. 

Feroz Khan 9640466464 

ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ 

Comments