యువతకు ప్రాధాన్యం.. విధానపర నిర్ణయం.. అంటూ ఎన్ని కారణాలు చెప్పినా.. దేశ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని కమ్యూనిస్టులు మరోసారి నిరూపించారు. కేరళలో నిఫా, కోవిడ్ వైరస్ నివారణలో తీసుకున్న చర్యలతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన కేకే శైలజా టీచర్ ను పక్కన పెట్టి కొత్త ప్రయోగాలు మొదలుపెట్టారు. ఇతర పార్టీల్లో వారసత్వ రాజకీయాల గురించి విమర్శించే సీపీఐ(ఎం) నాయకులు.. ఇప్పుడు దగ్గరి బంధువులకు కేబినెట్ లో చోటు కల్పించారు. అదే సమయంలో వారి విధానపర నిర్ణయాల్లో కొందరికి మినహాయింపునిచ్చారు. వందేళ్ల చరిత్రలో ఎన్నో ఒడిదొడుకులను కమ్యూనిస్టులు ఎదుర్కొన్నా.. వారి చేసిన చారిత్రక తప్పులు నేటికీ వారిని వెంటాడుతున్నాయి. పార్టీ ప్రయోజనాల కోసం ప్రజా సంక్షేమాన్ని సైతం పక్కన పెట్టినట్టు అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. కేరళ తీసుకున్న విధానపర నిర్ణయం కూడా అలాగే అవుతుందా అనే అనుమానాలను ఆ పార్టీ కార్యకర్తలే ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు.
విధాన నిర్ణయమా.. ప్రజా సంక్షేమమా..! ఏది ముఖ్యం?
భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీకి వందేళ్ల చరిత్ర ఉంది. 1920లో అప్పటి సోవియట్ యూనియన్ లో ఉన్న తాష్కెంట్ లో ఇండియాకు చెందిన ఎంఎన్ రాయ్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 1925లో కాన్పూర్ లో జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటైనట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కమ్యూనిస్టులు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా సాగుతున్నాయి తప్ప ప్రజా సంక్షేమం వారికి పట్టదన్నట్టు నిరూపిస్తున్నాయి. 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయం మొదలుకొని ఇప్పటికీ వారి తప్పిదాలు కొనసాగుతున్నాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కూడా అధికారం మాత్రమే చేతులు మారిందని కమ్యూనిస్టులు తీర్మానాలు చేశారు. 1952లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1962లో భారత్, చైనా యుద్ధం జరగడం, కొందరు చైనాకు మద్దతుగా నిలవడం, ఇలా 1964లో పార్టీ సీపీఐ, సీపీఐ(ఎం)గా చీలిపోయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా చీలికలు వచ్చి అనేక కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి.
క్రమక్రమంగా ప్రజల నుంచి దూరం..
కమ్యూనిస్టు పార్టీలు క్రమక్రమంగా అధికారానికి, అంటే ప్రజలకు దూరంగా జరిగిపోతున్నాయి. 1952, 1957 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టులు.. ఇప్పుడు అనేక పార్టీలుగా చీలిపోయి.. రెండంకెల స్థానాల్లో సైతం ప్రాతినిధ్యం వహించలేకపోతున్నాయి. ప్రస్తుతం లోక్ సభలో కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ(ఎం)కు 3, సీపీఐకి రెండు, ఆర్ ఎస్పీకి ఒక సీటు మాత్రమే ఉంది. రెండున్నర దశాబ్దాలుగా పరిపాలించిన పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దశాబ్దంన్నర కాలంగా పాలించిన త్రిపురలో పార్టీ ఎదురీదుతోంది.
కేరళదీ ప్రత్యేక స్థానం..
కేరళలో కమ్యూనిస్టులు మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. 1957 ఎన్నికల్లోనే కమ్యూనిస్టులు కేరళలో ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో కమ్యూనిస్టులు ఎన్నికల ప్రక్రియ ద్వారా అధికారంలోకి రావడం ప్రపంచ వ్యాప్తంగా అరుదైన ఘటన. భూ సంస్కరణలు, వేతన సంస్కరణల అమలుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు జరగడంతో 1959లో నంబూద్రిప్రసాద్ ప్రభుత్వాన్ని అప్పటి ప్రధాని నెహ్రూ బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత 1965, 1967లలో జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. సీపీఐ(ఎం) నేతృత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఏర్పడి 1980, 1987, 1996, 2006, 2016, 2021లలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. అయితే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఏర్పడిన తర్వాత నాలుగు దశాబ్దాలుగా అధికారం చేతులు మారుతూ వస్తుండగా, 2021 ఎన్నికల్లో ఎల్డీఎఫ్ చరిత్రను తిరగరాసి రెండోసారి అధికారంలోకి వచ్చింది.
అనేక చారిత్రక తప్పిదాలు..
కమ్యూనిస్టు పార్టీలో అనేక చారిత్రక తప్పిదాలు ఉన్నాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోకపోవడం ఒకటైతే.. విధానపరమైన నిర్ణయాలంటూ పార్టీకి, ప్రజలకు, దేశానికి మేలు చేసే వారిని పక్కన పెట్టడం, వారి సేవలను వినియోగించుకోకపోవడం. పశ్చిమ బెంగాల్ లో రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా పని చేసి ప్రజల మన్ననలు పొందిన జ్యోతిబసుకు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా పార్టీ చేయనివ్వలేదు. దీంతో చాలా మంచి పనులు చేసే అవకాశాన్ని కోల్పోవడంతోపాటు ప్రజల ఆదరణ నుంచి దూరమైంది. ప్రతిపక్ష పార్టీలు కోరినా సీతారాం ఏచూరిని మూడోసారి రాజ్యసభకు పంపించలేదు. దీంతో ప్రజా సమస్యలను లేవనెత్తి, అధికార పక్షం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించగలికే చాతుర్యం ఉన్న నాయకుడిని పక్కనపెట్టినట్టయింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కేకే శైలజా టీచర్ ను మంత్రి వర్గంలో చోటు కల్పించలేకపోయింది.
కొందరికి వెసులుబాటు ఎందుకు?
విధానపరమైన నిర్ణయాలంటూ కొందరికి అవకాశమివ్వని కమ్యూనిస్టు నాయకులు, మరికొందరికి మాత్రం వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు. కేరళలో కూడా జరిగింది ఇదేననే చర్చ జరుగుతోంది. అభధ్రతా భావంతోనే విధానపరమైన నిర్ణయంటూ ముఖ్యమంత్రి పినరై విజయన్ మంత్రి వర్గంలో అందరినీ కొత్త వారిని తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 75 సంవత్సరాలు దాటిన వారు పార్టీ కేంద్ర కమిటీలో ఉండవద్దని వారి విధానపరమైన నిర్ణయం. కానీ ఆయన ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉండడంతోపాటు పొలిట్ బ్యూరోలో సైతం ఉన్నారు. అంతేకాకుండా కేరళ ముఖ్యమంత్రి గా రెండో సారి బాధ్యతలు స్వీకరించారు. మంత్రులందరినీ మార్చిన పార్టీ ముఖ్యమంత్రిని ఎందుకు మార్చలేకపోయింది. ఆయనకు వెసులు బాటు కల్పిస్తే కేకే శైలజకు ఎందుకు వెసులుబాటు కల్పించలేకపోయింది. ఆమెకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తే, సేవలను ఉపయోగించుకోగలిగితే పార్టీతోపాటు రాష్ట్రానికి, దేశానికి మరింత మేలు జరిగేదే కదా! బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పుకునే పార్టీ విజయన్ అల్లుడు రియాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయరాఘవాన్ భార్య బిందుకు మంత్రి వర్గంలో ఎందుకు చోటు కల్పించింది. విధానపరమైన నిర్ణయాలంటూ శైలజకు వస్తున్న పేరు ప్రఖ్యాతులను తట్టుకోలేక, అభద్రతా భావంతోనే ముఖ్యమంత్రి పినరై విజయన్ వారిని పక్కనపెట్టారనే ప్రచారం సైతం జరుగుతోంది. అయితే ఎలాంటి విధానపరమైన నిర్ణయాలైన, ఆచరించే సిద్ధాంతాలైనా అవి అంతిమంగా ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఉండాలని కమ్యూనిస్టులు ఎప్పటికి గ్రహిస్తారో!
Feroz Khan 9640466464
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్
addComments
Post a Comment