కరోనా కష్ట కాలంలో ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం.. దానికి పోటీగా తాము కూడా రూపాయి కిలో లేదా ఉచితంగా బియ్యం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఉద్ధరిస్తున్నట్టు ప్రకటనలు గుప్పించడమే తప్పా.. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో.. పేదల అవసరాలు గుర్తించే వారు.. కష్టాలు తీర్చే వారు కరువయ్యారు. ఉపాధి పోయి.. వ్యాపారాలు సాగక.. కోట్లాది మంది అవస్థలు పడుతుంటే.. అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి.. వారికి భరోసా కల్పించలేకపోతున్నాయి.
2021 కొవిడ్ కాలంలో భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం కింద అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అంత్యోదయ అన్న యోజన, ఇతర లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ నెలకు 5 కిలోల చొప్పున మే, జూన్ 2021 నెలలకు గాను ఉచితంగా అందజేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మొదట అమలు చేయకపోవడానికి ఇష్టపడకపోయినా.. ఆ తర్వాత విమర్శలు రావడంతో అమలు చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న దానికి తోడు తాము కూడా రూపాయి కిలో బియ్యం లేదా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేవలం ఆహార ధాన్యాలు ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటుండగా.. పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి.
ఉపాధి లేక. వ్యాపారాలు సాగక..
కరోనా విజృంభణ నేపథ్యంలో గతేడాది దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో నిరుద్యోగం రేటు పెరిగింది. గతేడాది దేశవ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇది అధికంగా ఉంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కేవలం మూడు శాతం ఉన్న నిరుద్యోగిత ఇప్పుడు 14 శాతానికి చేరింది. గతంలో మధ్య తరగతిలో ఉన్న వారు సైతం ఏడాది కాలంగా ఉపాధి లేక, వ్యాపారాలు సాగక పేదరికంలోకి నెట్టబట్టారు. సుమారు 23 కోట్ల మంది పేదరికంలో నెట్టబడ్డారని అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం ఒక అధ్యయనంలో తేల్చింది. 2020 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 23.74 శాతం ఉండగా, ప్రస్తుతం ఇది 25 శాతానికి పైగా దాటింది. ప్రభుత్వ రంగాల్లో కొత్త ఉద్యోగాల భర్తీ లేక, ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కోల్పోతుండడంతో ఇది మరింతగా పెరిగే ప్రమాదముంది. అంతేకాకుండా లాక్ డౌన్ వల్ల అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. హోటల్, లాడ్జింగ్ వ్యాపారాలైతే మూతపడే స్థాయికి చేరాయి. చిరు వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అయితే ప్రభుత్వాలు వీరికి ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టడం లేదు.
అవసరాలు తీరేదెలా?
లాక్ డౌన్ వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కేవలం నాలుగు గంటలు మాత్రమే అనుమతి ఉండడంతో వ్యాపారాలు సజావుగా సాగడం లేదు. అంతేకాకుండా అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి దొరకడం లేదు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, నిర్మాణ రంగ కార్మికులు, అడ్డా కూలీలకు పని లేకుండా పోయింది. కేవలం బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వాలు పేదల, ఇతర అవసరాలను గుర్తించలేకపోతున్నాయి. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లాలంటే బియ్యమే కాదు.. వంట చేసుకోవడానికి అవసరమయ్యే పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, ఉప్పు, కారం ఇవన్నీ అవసరమే.. వంట చేసుకోవడానికి అవసరమయ్యే గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చాలా మంది గ్యాస్ ను పక్కనపెట్టి కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటున్నారు. అంతేకాకుండా లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉండాల్సి రావడం, వేసవి కాలం కావడంతో కరెంటు బిల్లులు సైతం వెయ్యి నుంచి ఐదు వేల వరకు వస్తున్నాయి. పెట్రోల్, మందుల ఖర్చులు దీనికి అదనడం. దీంతో పేదలు అప్పులు చేసి తమ అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మందికి అప్పులు కూడా దొరక్కపోవడంతో బంగారం, ఇతర వస్తువులు కుదువ పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు.
ఆర్థిక సాయం అందజేస్తేనే..
గతంలో కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ ఖాతాలు ఉన్న మహిళలకు నెలకు రూ. 500 చొప్పున మూడు నెలల పాటు అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు నెలల పాటు కుటుంబానికి రూ. 1500 చొప్పున అందజేసింది. ఇప్పుడు దీనిపై ఎలాంటి ఆలోచన చేయడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసైనా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు. పేదలు ఇబ్బందులు పడకుండా ఇప్పటికే కేరళలో అన్ని కుటుంబాలకు ఉచితంగా ఆహార వస్తు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా వచ్చి ఎలాంటి పనులు చేయలేకపోతున్న కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ. 4వేల ఆర్థిక సాయాన్ని అందజేసింది. కరోనాతో అనాథలైన పిల్లలకు అనేక రాష్ట్రాలు రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నాయి. కేరళలో రూ. 3 లక్షలతోపాటు నెలకు రూ. 2 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం జీవన ప్రమాణాలు బాగా పెరిగాయి. కేవలం బియ్యంతోనే ప్రజల అవసరాలన్నీ తీరిపోవు. నగదు రూపంలో ఎంతోకొంత పేదలకు అందేలా ఏర్పాటు చేస్తేనే అవసరాలు తీరే అవకాశముంది.
addComments
Post a Comment