జర్నలిస్టులారా.. జాగ్రత్త!

‘మీకు ఉన్నత స్థాయి వారు తెలుసని, దేన్నుంచి అయినా సురక్షితంగా బయటపడగలమని నమ్మకం పెట్టుకోకండి. నాకు సన్నిహితంగా ఉండే నలుగురు పాత్రికేయులు, తెలిసిన వారు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. అందరూ పలుకుబడి గల వారే. ఉన్నత స్థానాల్లోని వారికి పరిచయస్తులే. పెద్ద పెద్ద సంస్థల్లో పని చేస్తున్న వారే.’
సీనియర్ జర్నలిస్ట్ శివ్ అరోరా ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఈ మెస్సేజ్ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘ఎలాగో మీడియాలో పని చేస్తున్నాం. నాకు ఈ మంత్రి తెలుసు.. నాకు ఆ అధికారి తెలుసు.. ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు నాతో ఫోన్ లో మాట్లాడుతారు.. కరోనా వచ్చినా ఏం కాదు..’ అనే అతి విశ్వాసం కొందరు జర్నలిస్టులను బలిగొంటోంది. విధి నిర్వహణలో యాజమాన్యాల ఒత్తిడి, పని ప్రదేశాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడం ఇంకొందరిని మృత్యు ఒడికి చేరుస్తోంది. ఇలాంటి సమయంలోనే సమాజానికి ఏదైనా చేయాలనే యావ మరికొందరిని కాటికి పంపుతోంది. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో జర్నలిస్టులు మృతి చెందగా, సుమారు 15 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే.

తెలుగు రాష్ట్రాల్లో విషాదం
తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టుల కుటుంబాల్లో వారం రోజులుగా విషాదం నెలకొంది. రెండు రోజుల్లో సుమారు 15 మందికి పైగా జర్నలిస్టులు కరోనా బారిన పడి మృతి చెందారు. తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కె అమర్నాథ్, రాంచంద్రారావు, కల్పన, కరీంనగర్ కు చెందిన జయ ప్రకాశ్, పి. ప్రకాష్, రంగారెడ్డికి చెందిన శ్రీనివాస్, నిర్మల్ కు చెందిన సాయినాథ్, నిజామాబాద్ కు చెందిన డి. అశోక్, వేణుగోపాల్, అల్లాడి శేఖర్, కాసం గోపీకృష్ణ, సిరిసిల్లకు చెందిన బుర్రా రమేష్, సిద్ధిపేటకు చెందిన సిహెచ్ నాగరాజు, ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన తాతయ్య, శ్రీకాకుళంకు చెందిన చంద్రశేఖర్ నాయుడు, కృష్ణా జిల్లాకు చెందిన శ్రీనివాస్ రావు, కడపకు చెందిన ప్రభాకర్ రెడ్డి మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో జీ సంస్థలో వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్న విజయవాడకు చెందిన సిద్ధిఖి మహమ్మద్‌ (29) రాంమనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

విధి నిర్వహణ, పని ఒత్తిడి..
దేశ వ్యాప్తంగా మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులకు పని ఒత్తిడి వల్ల విధి నిర్వహణలోనే కరోనా సోకుతోందనే విషయం స్పష్టమవుతోంది. ఇంటి దగ్గర నుంచి పని చేస్తే ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయేమోననే భయం వారిలో కనిపిస్తోంది. విధి నిర్వహణలో ఫీల్డ్ కు వెళ్లినప్పుడు ఎక్కడి నుంచి వైర్ సోకిందో అర్థం కావడం లేదని చాలా మంది జర్నలిస్టులు చెబుతున్నారు. రిపోర్టింగ్ చేసేటప్పుడు ప్రజలతో మాట్లాడాల్సి ఉంటుంది. పత్రికల్లో పని చేసేవారు కొంత వరకు ఇంటి దగ్గరే ఉండి సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో సమాచారం అందదు. వ్యక్తులను కలిసి, పరిస్థితులని నేరుగా పరిశీలిస్తే తప్ప సమగ్ర సమాచారం సేకరించలేం. ఎలక్ర్టానిక్ మీడియాలో పనిచేసే వారైతే మనుషుల్ని కలవడం తప్పనిసరి. అంతేకాకుండా ఎలక్ర్టానిక్ మీడియా రిపోర్టర్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించడమే తప్ప వేరే ఇతర మార్గం లేదని చాలా మంది జర్నలిస్టులు పేర్కొంటున్నారు. తమ ఉద్యోగులకు కరోనా సోకిందని తెలిసినా కొన్ని సంస్థలు వారి మానాన వారిని వదిలేయడమే తప్ప ఎలాంటి సాయాన్ని అందించలేదు.
 
సంక్షేమంలో తెలంగాణే భేష్.. అయినా..
జర్నలిస్టుల సంక్షేమంలో దేశంలోని మిగితా రాష్ట్రాల కంటే తెలంగాణ ఎంతో ముందుందనే చెప్పవచ్చు. అయినా మరిన్ని సదుపాయాలు కల్పిస్తే వారి కుటుంబాలకు ఆదుకున్న వారవుతారు. 2020 మార్చి లో కరోనా ఉధృతి పెరుగుతున్న సమయంలోనే జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా సోకిన వారికి రూ. 20 వేల ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఇప్పటి వరకు సుమారు 1700 మందికి ఈ ఆర్థిక సాయాన్ని అందజేసింది. అంతేకాకుండా హోం క్వారంటైన్ లో ఉన్న వారికి రూ. 10వేల ఆర్థిక సాయాన్ని అందజేసింది. సుమారు 90 మందికి ఈసాయాన్ని అందజేశారు. ఆ తర్వాత హోం క్వారంటైన్ లో ఉన్న వారికి సాయాన్ని నిలిపివేయగా, కరోనా సోకిన వారికి అందజేసే ఆర్థిక సాయాన్ని రూ. 10 వేలకు తగ్గించారు. దీన్ని సుమారు 400 మంది జర్నలిస్టులకు అందజేశారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ. లక్ష నగదు సాయాన్ని అందజేశారు. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ. 3 వేల పెన్షన్ ను ఐదేండ్ల పాటు అందజేస్తున్నారు. కరోనా బారిన పడిన 1927 మంది జర్నలిస్టులకు 3 కోట్ల 56 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అయితే ఈ సంక్షేమ చర్యలు జర్నలిస్టులకు అభయాన్ని ఇవ్వలేకపోతున్నాయి. హర్యానా రాష్ట్రంలో కల్పిస్తున్నట్టు రూ. 10 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి. అంతేకాకుండా మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, వారికి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. పాత్రికేయులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ప్రకటించాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కరోనా ఉద్ధృతమవుతున్న తరుణంలో పాత్రికేయ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చి రక్షణ కల్పించడం అవసరమని తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులలో జర్నలిస్టులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల హెల్త్‌ కార్డుల్లో కరోనా చికిత్సలు చేర్చి అవి పనిచేసేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఉన్నాయి. అంతేకాకుండా జీవిత కాలం పాటు పెన్షన్ ను అందజేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వరంగల్ కు చెందిన కొన్ని జర్నలిస్టు కుటుంబాల వారు ఇటీవల మీడియా అకాడమీ చైర్మన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. Feroz Khan 9640466464 


Feroz Khan 9640466464 
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, జాతీయ కౌన్సిల్ సభ్యులు, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్  (ఎన్ యూజే - ఇండియా)

Comments