కండువా ‘మార్పు’ తీసుకొస్తుందా!

పూటకో పార్టీ మారుతుండడంతో అనుయాయుల్లో గందరగోళం 

కానరాని భవితవ్యం!

క్రమక్రమంగా దూరమవుతున్న అనుచరగణం 

ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నారనే ప్రచారం 



ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే.. ఎంపీగా సైతం పార్లమెంట్ లో గళం వినిపించిన నాయకుడు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కు చైర్మన్ గా కూడా వ్యవహరించారు.. అలాంటి నాయకుడు.. ఇప్పుడు పూటకో పార్టీ మారుతుండడంతో అనుచరుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే చాలా మంది ఆయనకు దూరం కాగా.. ఉన్న వాళ్లు సైతం భవిష్యత్తుపై బెంగతో కలిసి నడిచేందుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం, టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీ ఇలా నాలుగు పార్టీలు మారిన రాథోడ్ రమేష్.. ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నారనే భయం వారిలో కనిపిస్తోంది. కుటుంబసభ్యులను సైతం రాజకీయాల్లోకి తీసుకు రాగా.. వారిలోనూ అయోమయం నెలకొంది. 


రాథోడ్ రమేష్.. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆదిలాబాద్ రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకొని నడిపించారు. ఆ సమయంలో పార్టీలతో సంబంధం లేకుండా రాథోడ్ రమేష్ కుటుంబానికి చాలా అనుచరవర్గం ఉండేది. మంచి పలుకుబడి సైతం ఉండేది. ఆ కుటుంబం జిల్లా రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం సాగించేది. రమేష్ రాథోడ్ 1999 – 2004 మధ్యకాలంలో ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2006 నుండి 2009 వరకు అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. 2009లో 15 వ లోక్ సభకు పోటీచేసి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు.  అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాథోడ్ రమేష్ ఓటములను చవిచూస్తూ వస్తున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుండడంతో అనుచరులు సైతం క్రమంగా దూరమవుతున్నారు. ఆర్థికంగా సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. 


వరుస ఓటములు.. నాలుగు పార్టీలు.. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాథోడ్ రమేష్ నాలుగు పార్టీలు మారారు. 2014లో తెలంగాణ ఏర్పాటు కాగా, అప్పటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన అదే ఆదిలాబాద్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. కేవలం 17.45 శాతం ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో 40.82 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి గొడెం నగేష్ విజయం సాధించగా, 24.59 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ జాదవ్ రెండో స్థానంలో నిలిచారు. అదే సమయంలో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాథోడ్ రమేష్ కుమారుడు రాథోడ్ రితేష్ సైతం ఓటమిని చవిచూశారు. తెలుగుదేశం పార్టీకి నాయకులు క్రమంగా దూరమవుతుండడంతో రాథోడ్ రమేష్ సైకిల్ వీడి కారెక్కారు. ఆ సమయంలో ఖానాపూర్ టికెట్టు త‌న కొడుక్కు లేదా త‌న‌కు ఇవ్వాలని, భవిష్యత్తులో త‌న కుటుంబానికి మ‌రో మంచి ప‌ద‌వి ఇవ్వాలని షరతు పెట్టారు. అయితే అప్పటికే ఖానాపూర్ నియోజకవర్గంలో రేఖా నాయక్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో రేఖా నాయక్, రాథోడ్ రమేష్ కు మధ్య వైరం పెరిగింది. అయితే రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా తనకే టీఆర్ఎస్ అధిష్టానం ఖానాపూర్ టికెట్టు ఇస్తుందని రాథోడ్ రమేష్ భావించారు. ఊరూరా తిరిగారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టీఆర్ఎస్ 2018 ఎన్నికల్లో టికెట్లు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ తో మంతనాలు జరిపి ఖానాపూర్ టికెట్టును సాధించారు. అయితే మళ్లీ అజ్మీరా రేఖా శ్యాం నాయక్ చేతిలో ఓటమిని చవిచూశారు. రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ టికెట్టు సాధించగలిగారు. దీంతో 2018లో కాంగ్రెస్ తరపున బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిని చవి చూసిన సోయం బాపురావు బీజేపీలోకి చేరిపోయి, ఆ పార్టీ తరపున పోటీకి దిగారు. 29.54 శాతం ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా, టీఆర్ఎస్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అప్పటి నుంచి కాంగ్రెస్ కు అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేయగా.. పార్టీ కార్యకలాపాలకు పూర్తి దూరంగా ఉన్నారు. ఇటీవల ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. 


దూరమవుతున్న అనుచరగణం 

అందరితోనూ కలుపుగోలుగా ఉండే వ్యక్తిగా రమేశ్‌ రాథోడ్‌కు పేరుండేది. అనతి కాలంలోనే ఆయన రాజకీయాల్లో రాణించారు. అయితే ఆయన ప్రస్తుత పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అనుచరులు ఆయనకు క్రమంగా దూరమవుతున్నారు. పార్టీ మారుతున్న ప్రతిసారి తనకు పార్టీలో సముచిత స్థానం లభించడం లేదని  తన అనుచరులు, అభిమానులతో ఆవేదన పంచుకునేవారు. అయితే పార్టీ మారిన ప్రతిసారి ఆయన అనుచరులు పాత పార్టీల్లోనే ఉండిపోయారు. అంతేకాకుండా రాథోడ్ రమేశ్ ఒంటెద్దు పోకడలతో ఆయన చేరిన పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఇప్పటికే ఆయన అనుచరులు ఎన్నోసార్లు ఆరోపణలు సైతం గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాభీష్టం మేరకు టీడీపీని వీడుదామని ఆయన అనుచరులు కోరినా వినిపించుకోని ఆయన.. ఆ తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏనాడు కూడా రాజకీయ, ఆర్థిక లబ్ధిచేకూర్చలేదని కొందరు అనుచరులు బహిరంగంగానే ఆరోపిస్తూ ఆయనకు దూరమయ్యారు. ఏ పార్టీలో ఉన్నా కిందిస్థాయి కార్యకర్తలను ఎదగనివ్వరనే అపవాదు సైతం రాథోడ్ రమేష్ పై ఉంది. అంతేకాకుండా కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి తీసుకువచ్చారని, భార్యను ఎమ్మెల్యే చేయడంతోపాటు కొడుక్కు సైతం టికెట్టు ఇప్పించుకుంటారని, దీంతో ఇతరులకు అవకాశం దక్కదని ఆయన వద్ద గతంలో ఉన్న అనుచరులు చెబుతుంటారు. ఆయన టీడీపీలో ఉన్న సమయంలోనే రాథోడ్ రమేష్ వ్యవహార శైలి నచ్చక అప్పటి ఖానాపూర్ ఎంపీపీతోపాటు టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ, సత్తన్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్, ఖానాపూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ ముజీబ్, మస్కాపూర్ సర్పంచ్ గుగ్లావత్ రాజేశ్వరి, లక్ష్మణ్, ఉపసర్పంచ్ లు కొడిమ్యాల వీరేశ్ ఇలా చాలా మంది రాజీనామా చేశారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో మారిన తర్వాత, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సమయంలో చాలా మంది అనుచరులు ఆయన వెంట వెళ్లలేదు. దీంతో క్రమంగా రాథోడ్ రమేష్ ఆదరణ తగ్గుతూ వస్తోంది. 



‘కాషాయం’ కలిసొస్తుందా.. 

ఈటల రాజేందర్ తో కలిసి ఇటీవల ఢిల్లీ వెళ్లి రాథోడ్ రమేష్ బీజేపీలో చేరారు. ఇప్పటికే బీజేపీలో బలమైన ఎస్టీ నేతగా సోయం బాపురావు పేరు సంపాదించారు. సోయం సిట్టింగ్ ఎంపీగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగూ ఎంపీ టికెట్టుపై ఆశలు పెట్టలేరు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ ఖానాపూర్ లేదా ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల మీదే. ఆసిఫాబాద్ కంటే ఖానాపూర్ లోనే రాథోడ్ రమేష్ కు కాస్త పట్టుంది. ఆదివాసులు సైతం అధికంగా ఉండడంతో సోయం బాపురావు మద్దతుతో ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచే అవకాశముందని ఆయన భావిస్తుండొచ్చు. అయితే లంబాడాలు మద్దతు ఇవ్వడం అనుమానమే. టీఆర్ఎస్ నుంచి లంబాడ అయిన రేఖా శ్యాం నాయక్ కే లంబాడాలు మద్దతు ఇచ్చే అవకాశముంది. మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ అభ్యర్థిని తెరపైకి తీసుకువస్తే ఆదివాసుల ఓట్లు పడడమూ అనుమానమే. గిరిజనేతరుల్లో అధికంగా ఉన్న ముస్లింలు బీజేపీ వైపు ఉండే అవకాశాలు లేవు. మరోవైపు దళితుల మద్దతు కూడగట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేసినా.. గెలిచే అవకాశాలు తక్కువగానే ఉంటాయని ఖానాపూర్ నాయకులు ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయముండడంతో అప్పటి వరకు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో.. రాథోడ్ రమేష్ అప్పటి వరకు బీజేపీలో ఉండగలుగుతారా.. లేక మళ్లీ పార్టీ మారుతారా.. పార్టీలోనే ఉన్నా ఆయనకు టికెట్టు వస్తుందా.. టికెట్టు వచ్చినా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా.. అనేది తేలాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే. 


Feroz Khan 9640466464 

ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్

Comments