ఆత్మహత్యా ప్రయత్నమా..?
ఫారుఖ్ అహ్మద్ ఘటనపై అనేక అనుమానాలు
హత్య చేసేందుకు కుట్ర పన్నారని కుటుంబసభ్యుల ఆరోపణలు
తల గోడకు కట్టుకున్నాడని జైలు అధికారుల ప్రకటనలు
ఎమ్మెల్యే, ఫారుఖ్ అహ్మద్ కు మధ్య బహిర్గతమైన విభేదాలు
దూరంగా ఉంటున్న ఎంఐఎం శ్రేణులు
కాల్పుల ఘటన తర్వాత జైలు జీవితాన్ని గడుపుతున్న ఫారుఖ్ అహ్మద్ మార్చి 24వ తేదీన అస్వస్థతకు గురి కావడం తీవ్ర చర్చకు దారితీసింది. అతడిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఫారుఖ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. జైలు గోడలకు తల కొట్టుకొని ఆత్మహత్యకు యత్నించాడని జైలు అధికారులు ప్రకటనలు ఇస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఫారుఖ్ అహ్మద్ బంధువులు ఎమ్మెల్యే జోగు రామన్నమై ఆరోపణలు గుప్పించడం ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వారిద్దరి మధ్య విభేదాలు బహిర్గతం కాగా.. ఇది ఆత్మహత్యా ప్రయత్నమా.. హత్యా యత్నమా అనే చర్చ ఇప్పుడు సాగుతోంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో గతేడాది డిసెంబర్ 12వ తేదీన కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా.. రెండు బుల్లెట్లు దిగిన జమీర్ కొన్ని రోజుల తర్వాత మృతి చెందాడు. దీంతో అప్పుడు ఫారుఖ్ అహ్మద్ పై హత్య కేసు నమోదు చేశారు. దీంతో ఎంఐఎం పార్టీ అతడిని సస్పెండ్ చేయడమే కాకుండా జిల్లా ఎంఐఎం కార్యవర్గాన్ని మొత్తం రద్దు చేసింది.
అనేక అనుమానాలు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు..
ఫారుఖ్ అహ్మద్ అస్వస్థతకు గురి కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు మూడు నెలలుగా జైలులో ఉన్న ఫారుఖ్ అహ్మద్ ఇప్పటి వరకు మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా, కోర్టు తిరస్కరించినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఫారుఖ్ నిరాశతో ఉన్నట్టు తెలిసింది. అంతే కాకుండా ఈ ఘటన సత్వర విచారణ కోసం హై కోర్టు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా కోర్టుకు ప్రత్యేక ఆదేశాలు సైతం జారీ చేసింది. దీంతో ఈ కేసు సత్వర విచారణ జరిగి తీర్పు కూడా త్వరగా వచ్చే అవకాశముంది. అయితే విచారణ ప్రారంభం కాకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్వల్పంగా నురగలు కక్కుకుంటూ ఉన్న ఫారుఖ్ అహ్మద్ ను బుధవారం మధ్యాహ్నం సమయంలో రిమ్స్ కు తీసుకువచ్చారు. అయితే తలను గోడకు కొట్టుకొని ఆత్మహత్యకు యత్నించాడని, అందుకే ఆస్పత్రికి తీసుకువచ్చామని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే తల గోడకు కొట్టుకుంటే నోట్లో నుంచి నురగలు ఎందుకు వస్తున్నాయని ఆయన బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఫారుఖ్ అహ్మద్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నారని వారు ఆరోపిస్తున్నారు. ఫారుఖ్ అహ్మద్ కు ఏమన్నా అయితే ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని చెబుతున్నారు.
మరో వైపు కేసు విచారణ ఆలస్యం కావడానికి.. ప్రజల నుంచి సింపతీ పొందడానికి ఫారుఖ్ అహ్మదే స్వయంగా ఆత్మహత్యకు యత్నించాడని ఆయన ప్రత్యర్థి వర్గీయులు చెబుతున్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడంతో కేసు విచారణ వేగంగా సాగుతుందని, తీర్పు కూడా త్వరగా వచ్చేస్తుందని, దీంట్లో దోషిగా తేలితే మళ్లీ జైలుకు వెళ్తాననే భయం.. హై కోర్టుకు వెళ్లినా తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎలా అనే ఆందోళనతోనే ఫారుఖ్ అహ్మద్ ఇలాంటి నాటకమాడుతున్నాడని ప్రత్యర్థులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే, ఫారుఖ్ అహ్మద్ మధ్య విభేదాలు
ఆదిలాబాద్ పట్టణాభివృద్ధి కోసం ఎమ్మెల్యే, ఫారుఖ్ అహ్మద్ ఎన్నో సంవత్సరాలు కలిసి పని చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గా సుమారు దశాబ్ద కాలం పాటు పని చేసిన ఫారుఖ్ అహ్మద్ కు ఎమ్మెల్యే రామన్నతో సన్నిహితంగా మెలిగేటట్లు కనిపించేవారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు ఎవరికీ ఎక్కడా అనుమానం రాలేదు. అయితే ఆ సమయంలో మన్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న రంగినేని మనీషాకు, ఎమ్మెల్యే జోగురామన్నకు మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి. ఇవి ఎన్నోసార్లు బహిర్గతమయ్యాయి కూడా. అదే సమయంలో ఫారుఖ్ అహ్మద్ తన వైపు కాకుండా రంగినేని మనీషా వైపు నిలబడడం ఎమ్మెల్యేకు కోపం తెప్పించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో జోగురామన్న గెలుపు కోసం ఫారుఖ్ అహ్మద్ కొన్ని వార్డుల్లో ప్రచారం నిర్వహించినా.. ఎమ్మెల్యే వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని ఆయన ప్రత్యర్థులు చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్యేకు, ఫారుఖ్ అహ్మద్ మధ్య విభేదాలు మొదలయ్యాయని చెబుతారు. దీంతోనే కాల్పుల ఘటన తర్వాత ఎమ్మెల్యే బాధితులను పరామర్శించడమే కాకుండా.. వారికి పూర్తి మద్దతుగా నిలిచారు. వారికి సహాయం సైతం చేశారు.
ఎంఐఎం.. దూరం..!
ఫారుఖ్ అహ్మద్ కు మున్సిపల్ వైస్ చైర్మన్ గా చేసే అవకాశమివ్వడమే కాకుండా.. ఆయనను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఎంఐఎం.. ఈ ఘటన తర్వాత ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసింది. పార్టీ నుంచి ఫారుఖ్ అహ్మద్ ను సస్పెండ్ చేయడమే కాకుండా.. ఆదిలాబాద్ జిల్లా కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అప్పటి నుంచి ఫారుఖ్ అహ్మద్ కు కుటుంబసభ్యులు తప్ప ఎవరూ అండగా నిలబడినట్టు కనిపించలేదు. ఫారుఖ్ అహ్మద్ అస్వస్థతతో రిమ్స్ కు వచ్చినా.. ఎంఐఎం శ్రేణులు ఎవరూ కనిపించకపోవడం కూడా చర్చనీయాంశమైంది. అధిష్ఠానం ఆదేశాలతోనే ఎంఐఎం శ్రేణులు ఫారుఖ్ కు సహకరించనట్టు తెలుస్తోంది.
Feroz Khan 9640466464
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్
addComments
Post a Comment