ప్రజల సమస్యల పరిష్కార బాధ్యత అధికారులపైనే ఉంటుంది: మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య..

 ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. శనివారం రోజున స్థానిక టీటీడీసీ లో మానవ హక్కుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన, వందేమాతరం గీతం తో ప్రారంభించారు. ఈ సందర్బంగా జస్టిస్ మాట్లాడుతూ, అర్జీదారుని సమస్యను అధికారులు సవినయంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని, తన పరిధిలో లేని సమస్యకు పరిష్కారానికి సలహాలను అర్జీదారునికి తెలియజేయాలని అన్నారు. అధికారులు అధికారాన్ని ఉపయోగించి దరఖాస్తుదారుని సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు అంటే ఆ రాష్ట్రంలో పరిపాలన, సంక్షేమం సవ్యంగా జరుగుతున్నాయని అభిప్రాయపడవచ్చని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకోవాలని అన్నారు. మానవ హక్కులు ఉల్లంఘిస్తే శాంతి లోపిస్తుందని, శాంతి కల్పనకు కృషి చేయాలనీ అన్నారు. మానవాళికి శాంతి కల్పించడమే ప్రధాన ధ్యేయమని వివరించారు. విద్యతోనే ఏదైనా సాధించవచ్చని నేడు మనం ఈ స్థితికి రావడానికి కారణం విద్యేనని అన్నారు. ప్రపంచ యుద్ధాల సమయంలో శాంతి స్థాపనకు ఒడంబడికలు చేసుకోవడం జరిగిందని అన్నారు. అర్జీదారు తన సమస్యను నేరుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కు పంపించినప్పటికీ అట్టి దరఖాస్తును ఆయా రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్ కు పంపించి చర్యలు చేపట్టాలని సూచిస్తుందని అన్నారు. మానవ హక్కుల కమిషన్ సభ్యులు ఎన్.ఆనంద్ రావు మాట్లాడుతూ, తమ రోజువారీ కమిషన్ పనులను ఏ రోజుకారోజు వచ్చే అర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సమస్యతో పాటు అర్జీదారు తన కష్టనష్టాలు, చిరునామా, పూర్తివివరాలు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే పరిహారం, ప్రాసిక్యూషన్ వంటివి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా విధులు నిర్వహిస్తే క్రమశిక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. అర్జీదారుని సమస్యను మర్యాదపూర్వకంగా తెలుసుకోవాలని, చట్ట ప్రకారం సమస్యను పరిష్కరించ వచ్చా, లేదా అని పరిశీలించాలని అధికారులకు తెలిపారు. అంతకు ముందు జిల్లాలోని మున్సిపాలిటీ, విద్య, వైద్యం, పంచాయితీ, అటవీ శాఖ, రెవెన్యూ, గిరిజన సంక్షేమం, పోలీస్ శాఖల అధికారులు వారి శాఖ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జడ్జి డా.శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ రాజేష్ చంద్ర, ITDA PO భవేష్ మిశ్ర, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Feroz khan 9640466464


Comments