అంకెల జూదం.. అంతా మాయం!
ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రల్లో మట్కా మాయాజాలం
ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం
చాపకింద నీరులా విస్తరిస్తున్న మట్కా సామ్రాజ్యం
పది రూపాయలకు 1500 ఇస్తామంటూ ఆశలు
పట్టించుకోని అధికారులు
ఈజీ మనీ కోసం విద్యావంతులు, ఉద్యోగులు సైతం అదేబాట
ఉత్తర తెలంగాణ జిల్లాలు, వాటి సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని జిల్లాల్లో మట్కా సామ్రాజ్యం చాప కిందనీరులా విస్తరిస్తోంది. ప్రతి రోజు కోట్లలో వ్యాపారం నడుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరూ ఈ జూదాన్ని నిర్వహిస్తుండగా.. ఈజీ మనీ వేటలో లక్షలాది మంది దీనికి బలవుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతోపాటు వీటికి సరిహద్దున ఉన్న చంద్రపూర్, నాందేడ్, యావత్మాల్, పాండ్రక్వాడ జిల్లాలో ప్రతి రోజు కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతోందంటే ఈ మహమ్మారి ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే పట్టించుకోవాల్సిన పోలీసులు ‘మామూలు’గా అడపా దడపా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటుండగా.. నిర్వాహకులు కోట్లకు పడుగలెత్తుతున్నారు. ఆడుతున్న వారు నట్టేట మునుగుతున్నారు.
మట్టా మహమ్మారి ప్రతి రోజు లక్షలాది మందిని నట్టేట ముంచుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఇది ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. అక్కడి పోలీసులు కాస్ట కటువుగా మారితే ఇటు.. ఇక్కడి పోలీసులు కటువుగా మారితే అటు వెళ్లి మట్కా నిర్వహిస్తున్నారే తప్ప దానిని వదలడం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వచ్చాక ఇది మరింత పెరిగింది. అంతేకాకుండా యువత కూడా ఈ జూదం వైపు ఆకర్షితులవుతున్నారు. చాలా మంది అత్యాశకు పోయి మట్కాకు అలవాటుపడుతున్నారు. మట్కా ఆడుతున్నవారిలో నిరక్షరాస్యులు, పేదలు మాత్రమే ఉన్నారనుకోవడం పొరపాటే. ఈ మహమ్మారిలో ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెద్ద పెద్ద వ్యాపారులు సైతం చిక్కుకుపోయారు.
రూ. 10కి రూ.1500..
ఓపెన్, క్లోజ్, సింగిల్, పానా, బ్రాకెట్ అంటూ వివిధ రకాలుగా ఈ మట్కా ఆడుతున్నారు. ముంబై, కల్యాణి, టైమ్ ఇలా వివిధ పేర్లతో ఈ గేమ్ కొనసాగుతుంది. సింగిల్ డిజిట్ (ఓపెన్ ) లో రూ 11కి రూ. 100, డబుల్ డిజిట్(జోడి) లో రూ. 11 కి 500, ట్రిబుల్ డిజిట్ (పానా గేమ్) లో రూ. 11 కి రూ. 1400 ఇస్తుండడంతో చాలా మంది దీని వైపు ఆకర్షితులై నట్టేట మునుగుతున్నారు. నిర్వాహకులు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ప్రతి పట్టణంలో, ప్రతి మండల కేంద్రంలో, పట్టణాల్లోని ప్రతి కాలనీలో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకొని ఈ మట్కాను కొనసాగిస్తున్నారు. అయితే మట్కా నిర్వాహకులే తప్ప.. మట్కా నిర్వహిస్తున్న వారు సంపాదించకోవడమే తప్ప.. ఆడిన వారు గెలుపొందిన సందర్భాలు చాలా తక్కువ.
ఆన్ లైన్ లోనే ఫలితాలు..
మహారాష్ట్ర కు చెందిన కొందరు ఆన్ లైన్ ద్వారానే ఈ మట్కాను నిర్వహిస్తున్నారు. మిలన్, శ్రీదేవి, కల్యాణ్, మాధురి, టైం బజార్, రాజధాని, శ్రీదేవి ఇలా వివిధ పేర్లతో ఈ మట్కాను నిర్వహిస్తున్నారు. సమయానికి అనుగుణంగా ఫలితాలు వెబ్ సైట్లలో ఉంచుతారు. డిపి బాస్, కల్యాణ్ మట్కా, టైం బజార్ మట్కా అంటూ గూగుల్ లో సెర్చ్ చేస్తే వీటి ఫలితాలు కనిపిస్తాయి. ఒకప్పుడు చీటీలపై నెంబర్లతో సాగిన ఈ మట్కా దందా మొబైల్ ఫోన్లు, యాప్ లు, ఎస్ ఎంఎస్ లతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. మట్కా ఆడాలంటే నిర్వాహకునికో, ఏజెంట్ కో ఫోన్ చేసి తమ నెంబర్ చెబుతున్నారు. డబ్బులను గూగుల్ పే ద్వారానో, డైరెక్ట్ అకౌంట్ లోనే ఆన్ లైన్ లో నో జమ చేస్తున్నారు. దీంతో ఆడే వారు, నిర్వహించే వారు కలిసే అవకాశం లేకపోయినా.. ఈ గేమ్ నడుస్తోంది. ఫలితాలు సైతం ఆన్ లైన్ లోనే వస్తుండడంతో ఎవరికీ అడగాల్సిన పని లేకుండాపోయింది.
కోట్లలో వ్యాపారం..
మట్కా జూదానికి చాలా మంది బానిసలుగా మారి సర్వం కోల్పోతుండగా.. ఉత్తర తెలంగాణ జిల్లాలు, సరిహద్దు మహారాష్ట్ర జిల్లాల్లో ప్రతి రోజు పది నుంచి 15 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని పిప్పల్ కోటి గ్రామ సరిహద్దున ఓ మట్కా నిర్వాహకుడు కోట్ల రూపాయలకు పడుగలెత్తాడు. చిన్నపాటి స్థలంలో మట్కా నిర్వహణ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం అదే ప్రదేశంలో కోట్ల రూపాయలు పెట్టి పెద్ద హోటల్ నిర్మించాడు. దానిలోనే మట్కా నిర్వహణ కొనసాగించాడు. అయితే అక్కడి పోలీసులు కొంత కటువుగా మారడంతో అక్కడ కొన్ని రోజులు దాన్ని మూసివేసి.. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి వచ్చి మట్కా నిర్వహిస్తున్నాడు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతోపాటు సరిహద్దు మహారాష్ట్రలోని జిల్లాల్లో సుమారు వెయ్యి మంది నిర్వాహకులు ఉండగా.. వారు లక్షల మందిని ఏజెంట్లుగా నియమించి ఈ దందాను కొనసాగిస్తున్నారు. అయితే పట్టించుకోవాల్సిన పోలీసులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
‘మామూలుగా’ తీసుకుంటున్న పోలీసు యంత్రాంగం
కొంతమంది పోలీసుల సహకారం సైతం మట్కా నిర్వాహకులకు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పుడప్పుడు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదు. మట్కా నిర్వాహకులను అరెస్టు చేస్తున్న పోలీసులు వారిపై సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. వివిధ ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్నట్టు కొంతమంది డయల్ 100కు ఫోన్ చేసినా.. ఫోన్ చేసిన వారి వివరాలు బహిర్గత పరుస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఫోన్ చేసిన వారికి మట్కా నిర్వాహకులు బెదిరింపులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ కు మట్కా నిర్వాహకులు ముడుపులు అందజేస్తున్నారని, అందుకే పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
Feroz Khan 9640466464
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్
addComments
Post a Comment