‘ఖాకీ’ పవర్.. ‘గుట్కా’ పరార్!

పోలీసుల ఉక్కుపాదం..  విక్రయదారుల్లో వణుకు..  రవాణా చేసేందుకు భయం..  

మూడు నెలల్లోనే  87 మంది పై కేసులు.. ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు బాస్.! 


‘పోలీసు బాస్’ ఆదేశాలతో దండు కదిలింది.. ‘ఖాకీ’ తన పవర్ చూపిస్తోంది. అడుగడుగునా నిఘా పెట్టింది.. ‘గుట్కా’పై ఉక్కు పాదం మోపుతోంది. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు, జిల్లా నుంచి విక్రయకేంద్రాలకు రవాణా జరగకుండా అడ్డుకుంటోంది. స్వాధీనం, అరెస్టులతో విక్రయదారుల్లో వణుకు పుట్టిస్తోంది.. దీంతో కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో గుట్కా దొరక్కుండాపోతోంది. వారం రోజుల్లో పోలీసుల వరుస దాడులతో కొందరు ఈ వ్యాపారాన్ని ఇప్పటికే వదిలిపెట్టగా..  మరి కొందరు విడిచిపెట్టేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రజలు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ఇదే ఒత్తిడి కొనసాగితే గుట్కా మహమ్మారి జిల్లాను వదిలిపెట్టే అవకాశముంది. 

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేరాల నియంత్రణకు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర. అనతికాలంలోనే ఇక్కడి పోలీసుల పనితీరును విశ్లేషించుకొని నూతన ఒరవడితో ముందుకు సాగుతున్నారు. నేరాల నియంత్రణలో భాగంగా గుట్కా, మట్కాపై ఉక్కుపాదం మోపుతున్నారు. సమగ్ర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ కదలిక జరిగినా సమాచారం అందేలా చూస్తున్నారు. ముఖ్యంగా గుట్కా మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. హెచ్చరికలు జారీ చేసి మరీ గుట్కా మాఫియా నడుం విరిచారు. మాటిమాటికి పట్టుబడితే కేసులతో సరిపెట్టకుండా గుట్కా విక్రయాలు చేపడితే సెక్షన్ 328 ఐపీసీ ప్రకారం నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచి జైలుకు తరలించేందుకు, ఆ తర్వాత పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. 

87 మంది నిందితులు 

ఏప్రిల్ లో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజేష్ చంద్ర మూడు నెలల కాలంలోనే రూ. 44 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకోవడంతోపాటు 87 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. ఏప్రిల్ నెలలో 15 కేసులు నమోదు చేసి, 23 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రూ. 12,10,138విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. మే నెలలో 18 కేసులు నమోదు చేసి, 26 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రూ,10,74,280 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. జూన్ లో ఇప్పటి వరకు 29 కేసుల్లో 38 మంది నిందితును అరెస్ట్ చేశారు. రూ. 24,78,158 విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు, తంబాకు స్వాధీనం చేసుకున్నారు. 


ప్రధాన విక్రయదారులపై ప్రత్యేక దృష్టి.. 

జిల్లాలో గుట్కా విక్రయిస్తున్న ప్రధాన విక్రయదారులు, మాటిమాటికి అరెస్టవుతున్న వారిపై ఎస్పీ ఆదేశాలతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో కొంత మంది ఈ పనిని మానేసుకున్నట్టు తెలిసింది. గుట్కా నిషేధాని కంటే ముందు నుంచే ఆదిలాబాద్ జిల్లాలో గుట్కా విక్రయదారుడైన ఓ వ్యక్తి మొన్నటి వరకు జిల్లాలోనే కాకుండా చాలా చోట్ల గుట్కా వ్యాపారం నిర్వహించాడు. కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. అయితే మూడు నెలల నుంచి పోలీసులు తరచూ దాడులు నిర్వహించడం, సరుకును స్వాధీనం చేసుకుంటుండడంతో ఈ దందాను విడిచిపెట్టేసినట్టు తెలిసింది. అయితే అతడి తమ్ముళ్లు ఈ దందాను కొనసాగించడమే కాకుండా దుకాణం పేరును మార్చేసినట్టు తెలిసింది. వారిపై కూడా పోలీసులు నిఘా పెట్టి, కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. అస్లమ్ ట్రేడర్స్ కు చెందిన సాజిదుల్లా ఖాన్ పై కేసులు ఉండగా, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మరో వ్యాపారి అయిన అక్రమ్ ట్రేడర్స్ కు సంబంధించిన గోడౌన్లపై దాడులు చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. అంతేకాకుండా పెద్ద డీలర్ల నుంచి సరుకును తీసుకొని కిరాణా షాపులు, పాన్ షాపులకు సరఫరా చేస్తున్న మధ్యవర్తులపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఎవరైనా వివిధ వాహనాల ద్వారా చేరవేస్తుండగా సమాచారం అందుకొని వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో సరఫరా చేయడానికి సైతం చాలా మంది వెనకాడుతున్నారు. వారం రోజుల్లోనే చాలా మంది ఈ పనిని మానేసుకున్నట్టు తెలిసింది. గుట్కా సమాచారం తెలుసుకునేందుకు ప్రజలను సైతం పోలీసులు భాగస్వాములు చేస్తున్నారు. గుట్కా ఉన్నట్టు సమాచారముంటే డయల్ -100కు ఫోన్ చేయాలని, లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 83339 86898 కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా  సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు, వారికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్టు తెలిపారు. దీంతో గుట్కా సమాచారం అందించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. Feroz Khan 9640466464 

Feroz Khan 9640466464 

ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464

Comments