‘మజ్లిస్’ హీరో... ఎవరో!

అధ్యక్ష పదవికి పోటాపోటీ

పార్టీలో చేరుతున్న ఆశావాహులు 

ఎవరిపైనుంటుందో అధినేత నమ్మకం 

ఆదిలాబాద్ జిల్లా లో జోరుగా చర్చా 

ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464



హత్య కేసులో నిందితుడైన ఫారుఖ్ అహ్మద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆదిలాబాదు జిల్లాలో ఎంఐఎం పార్టీకి నాయకత్వం కరువైంది. నలుగురు కౌన్సిలర్లు ఉన్నా.. పార్టీని నడిపించే నేత ను ఎంపిక చేయడంలో పార్టీ అధిష్టానం ఆచితూచి స్పందిస్తోంది. జిల్లా అధ్యక్ష పదవిపై ఆశతో చాలా మంది చేరికకు సిద్ధమైనా.. స్పష్టమైన హామీ ఇవ్వకుండానే వారిని పార్టీలోకి చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల నుంచి పార్టీలో పలువురు నాయకులు చేరగా, అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు రాషిద్ ఇటీవల పార్టీలో చేరగా, స్వతంత్ర కౌన్సిలర్ నజీర్ కూడా చేరడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. రాషిద్, నజీర్ తోపాటు జిల్లా అధ్యక్ష పదవికి కో ఆప్షన్ సభ్యుడు రోహిత్ పేరును సైతం అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే త్వరలో జిల్లాలో అసదుద్దీన్ లేదా అక్బరుద్దీన్ జిల్లాలో పర్యటించనుండగా... వారి ఆశీర్వాదం ఎవరిపైనుంటుందో అప్పుడే తేలనుంది. పార్టీ భవిష్యత్తు, రేసులో ఉన్న వారి బలాబలాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ నిర్ణయం తీసుకోనుంది. 


మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్.. తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పార్టీ.. ఆ పార్టీకి చాలా పట్టణాల్లో ప్రత్యేక క్యాడర్ ఉంది. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల బలం ఉంది. కొన్ని చోట్ల గెలుపోటములను శాసించగల శక్తి ఉంది. అలాంటి పార్టీకి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు నాయకత్వం కరువైంది. ఫారుఖ్ అహ్మద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక.. క్యాడర్ లో తీవ్ర అయోమయం నెలకొంది. అయితే పార్టీ అధినాయకత్వం దీనిపై ఆచితూచి స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది. పార్టీకి అధ్యక్షుడిని నియమించాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుండడంతో పాటు... అధ్యక్ష స్థానం కోసం పలువురు ప్రయత్నాలు చేస్తుండడంతో నిర్ణయం తీసుకునే దిశగా అధిష్టానం అడుగులు వేస్తోంది. 



నజీర్ ‘రీ జాయిన్’.. 

నజీర్.. ప్రస్తుతం ఖుర్షీదనగర్ కౌన్సిలర్.. 2009 నుంచి ఎంఐఎంలో ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల కంటే ముందు అప్పటి అధ్యక్షుడు ఫారుఖ్ అహ్మద్ తో విభేదాలతోపాటు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కౌన్సిలర్ గా గెలుపొందారు. ఆ తరువాతి పరిణామాల్లో ఫారుఖ్ అహ్మద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో నజీర్ ఇటీవల మళ్లీ ఎంఐఎంలో చేరారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ వారు ఆహ్వానించినా ఏ పార్టీలోకి వెళ్లకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందడం ఆయనకు కలిసివచ్చే అంశం. పట్టణంలో ఆయనకు మంచి పేరుంది. వార్డులో తప్ప పట్టణవ్యాప్తంగా ప్రత్యేక క్యాడర్ లేకపోవడం మైనస్ పాయింట్. అయితే ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్లు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించకపోవడం కలిసివచ్చే అంశం. 




‘ఆప్’ నుంచి ఎంఐఎంకు.. 

రాషిదుల్ హఖ్.. జిల్లాలో ఎదుగుతున్న యువ నాయకుడు.. అవినీతిని, ఆర్టీఐని ఆయుధంగా చేసుకొని అవినీతిని బయటి ప్రపంచానికి తెలియజేశాడు. అవినీతి అంతానికి ఆమ్ ఆద్మీ పార్టీ పనికి ఆకర్షితుడై ఆ పార్టీలో చేరాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఆప్ తరపున ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడి ఓటమి చవిచూశాడు. అప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే పట్టణంలోని అంబేద్కర్ నగర్ నుంచి తన కుటుంబసభ్యురాలిని ఇండిపెండెంట్ గా పోటీ చేయించి కౌన్సిలర్ గా గెలిపించుకున్నాడు. అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నించడం, పట్టణంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పేరు ఉండడం, సేవా కార్యక్రమాలు చేస్తుండడం ఎంఐఎం అధ్యక్ష పదవి అధిరోహించడానికి రాషిదుల్ హఖ్ కు కలిసి వచ్చే అంశం. గతంలో రాషిద్ తాత ఇస్రారుల్ హఖ్ కూడా ఎంఐఎం పార్టీకి చెందిన వారే. దీన్ని అధినాయకులు పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. అయితే ఎంఐఎం అధ్యక్ష పదవిని పొందాలంటే అధినాయకుల ఆశీర్వాదం తప్పనిసరి. వారు చెప్పినట్టు వినాల్సిందే. కానీ రాషిదుల్ హఖ్ స్టేట్ ఫార్వర్డ్ గా ఉంటాడనే పేరుంది. ఇప్పటికే ఎంఐఎంకు ఉన్న క్యాడర్ ను కలుపుకొని పోగలుగుతాడా అనే అనుమానం అధినాయకత్వానికి ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎంఐఎంకు ఉన్న ఐదు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్ తోపాటు కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరిస్తున్నట్టు సమాచారం. 




రోహిత్.. సైలెంట్ వర్కర్.. 

మున్సిపాలిటీలో ఎంఐఎం నుంచి కోఆప్షన్ మెంబర్ గా ఉన్న షమీమ్ సుల్తానా కుమారుడు రోహిత్. సైలెంట్ వర్కర్ గా ఆయనకు పేరుంది. మాజీ అధ్యక్షుడు ఫారుఖ్ అహ్మద్ కు నమ్మిన బంటు. పార్టీ అంటే అతడికి ప్రాణం. గత మున్సిపల్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కౌన్సిలర్ గా ఓటమి చెందాడు. రోహిత్ చేసిన సేవలను గుర్తించే పార్టీ అతని తల్లికి కోఆప్షన్ మెంబర్ గా అవకాశమిచ్చింది. అధ్యక్ష పదవికి తాను పోటీ పడడం లేదని రోహిత్ చెబుతున్నా.. అధిష్టానం అతడి పేరును సైతం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా పట్టణవ్యాప్తంగా ఉన్న ఎంఐఎం కార్యకర్తలకు రోహిత్ అందుబాటులో ఉంటాడు. సమస్యలను విని అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాడు. ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు. ఇది అతడికి కలిసివచ్చే అంశం. అయితే అమాయకంగా ఉండడం, వయసు కాస్త తక్కువగా ఉండడం మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు. 


రాషిద్, నజీర్, రోహితే కాకుండా ఇంకా పలువురు జిల్లా అధ్యక్ష పదవిని ఇస్తే ఎంఐఎం లో చేరేందుకు సిద్ధమని అధిష్టానానికి చెప్పినట్టు సమాచారం. అయితే ముందుగా పార్టీలో చేరాలని, ఆ తర్వాతే అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తామనేది చెబుతామని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతోనే ఎలాంటి ముందస్తు హామీ లేకుండా రాషిద్, నజీర్ పార్టీలో చేరిపోయారు. అయితే గతంలో ఎంఐఎం ద్వారా మున్సిపల్ చైర్మన్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన సిరాజ్ ఖాద్రీ కూడా ఎంఐఎంలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. ఎంఐఎం కౌన్సిలర్ షాహిదా బేగం భర్త సలీం కూడా తనకు తెలిసిన ఎమ్మెల్యే ద్వారా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా మహమ్మద్ అయ్యుబ్ ఖాన్, డాక్టర్ సలీం, జాఫర్ అహ్మద్,  పోలీసు శాఖలో ఏఎస్ఐ గా పని చేస్తున్న ఓ వ్యక్తి కూడా అధ్యక్ష పదవి ఇస్తే ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సైతం సిద్ధమైనట్టు సమాచారం. అయితే అధిష్టానం మాత్రం పోటీ పడుతున్న వారి పూర్తి సమాచారాన్ని సేకరిస్తోంది. రాషిద్, నజీర్ ల చేరికతో ఎంఐఎం కౌన్సిలర్ల సంఖ్య నాలుగు నుంచి ఆరుకు చేరింది. ఇంకో కోఆప్షన్ మెంబర్ ఉన్నాడు. పట్టణవ్యాప్తంగా గట్టి క్యాడర్ ఉండడంతో వారిని కలుపుకొని నాయకుని వేటలో అధినాయకత్వం ఉంది. అందులో భాగంగానే త్వరలో అక్బరుద్దీన్ లేదా అసదుద్దీన్ జిల్లాకు వచ్చి సమాచారాన్ని సేకరించనున్నారని తెలిసింది. వారు వచ్చాకే అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందో తేలనుంది.  

Feroz Khan 9640466464 

ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్

Comments