బీజేపీ కష్టం.. ఫలితమనుభవించనున్న ఎంఐఎం
హైదరాబాద్ లో హంగ్..
కింగ్ మేకర్ గా ఒవైసీ టీం
ఏమిటీ నగర భవితవ్యం
ఫిరోజ్ ఖాన్, రాజకీయ విశ్లేషకులు, 9640466464
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులొడ్డింది.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు.. జాతీయ అధ్యక్షుడిని సైతం రంగంలోకి దింపింది. అంచనాలకు మించి ఫలితమొచ్చింది. కారుకు తామే ప్రత్యామ్నాయమని కమలం నిరూపించుకుంది. అయితే నగర ఓటర్ల నిర్ణయం కాషాయానికి ఆనందాన్ని మిగిల్చినా.. ఎటూ తేల్చని ఓటరు నాడితో హైదరాబాద్ లో హంగ్ ఏర్పడనుంది. దీంతో పతంగికి కాలం కలిసొచ్చింది. ఎంఐఎం కింగ్ మేకర్ గా మారింది. వారి సహకారం లేనిదే ఎవరూ మేయర్ పీఠం ఎక్కే పరిస్థితి లేకపోగా.. బీజేపీ పడిన కష్ట ఫలితం.. పదవుల పేరుతో ఎంఐఎం అనుభవించనుంది.
ఉత్కంఠ రేపిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితం బహిర్గతమైంది. నగర ఓటరు నాడిని ఏ పార్టీ పట్టుకోలేకపోయిందని నిరూపితమైంది. రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు.. కేంద్ర మంత్రులు.. పార్టీల అధ్యక్షులు వచ్చినా.. ఏ ఒక్కరివైపు నగర ఓటరు పూర్తిగా మొగ్గు చూపలేదు. దీంతో హైదరాబాద్ లో ప్రస్తుతం హంగ్ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. 150 స్థానాలకు ఎన్నికలు జరగగా.. నేరేడ్ మెట్ తప్ప మిగితా 149 స్థానాల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటిలో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. అతి పెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ సొంతంగా మేయర్ పీఠం అధిరోహించే అవకాశం లేదు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకున్నా మెజార్టీకి దూరంలోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో టీఆర్ఎస్ కలిసే పరిస్థితి లేదు. బీజేపీ, ఎంఐఎం ఎలాగూ కలవవు. దీంతో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసే అవకాశముండగా.. వారి మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఏ ఫార్ములాతో వారి పొత్తు కుదురుతుందోననే అనుమానం వ్యక్తమవుతోంది.
లెక్కలు ఇలా..
150 స్థానాలకు గాను ఎన్నికల సంఘం 149 స్థానాలకు ఫలితాలను ప్రకటించగా.. టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఎక్స్ అఫీషియోతో సంబంధం లేకుండా మెజార్టీ 76 కాగా.. ఏ పార్టీకి మెజార్టీ దక్కలేదు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియోలు కూడా ఓటర్లే. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటర్లుగా ఉంటారు. గ్రేటర్ జాబితాలో సుమారు 49 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరిలో ఎంత మంది ఇతర చోట్లలో తమ ఓటు హక్కును వినియోగించలేదో జీహెచ్ఎంసీ వద్ద సరైన సమాచారం లేదు. ఆ లెక్కలు తీసే పనిలో జీహెచ్ఎంసీ ఇప్పుడు నిమగ్నమైంది. హైదరాబాద్ లో ఎక్స్ అఫీషియో సభ్యులు టీఆర్ఎస్ కు 35, మజ్లిస్ కు 10, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్ కు ఒకరు ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే.. మ్యాజిక్ ఫిగర్ కూడా పెరుగుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యులను కలపకుండా మ్యాజిక్ ఫిగర్ 76 కాగా.. కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ 95 దాకా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం సహకారం లేనిదే ఏ పార్టీ కూడా మేయర్ పీఠాన్ని అధిరోహించే అవకాశం లేదు.
ఎంఐఎం జాక్ పాట్..
ఎంఐఎంకు గతంలోఉన్న సీట్లలో, ఇప్పుడు గెలిచిన సీట్లలో ఎలాంటి తేడా లేకున్నా.. హంగ్ ఏర్పడడం ఎంఐఎంకు వరంగా మారింది. కష్టం బీజేపీ పడగా.. దాని ఫలితం ఎంఐఎం అనుభవించనుంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్, ఎంఐఎంకు ఎలాంటి ఫార్ములాతో దోస్తీ కుదురుతుందో లేదోననే ప్రశ్న తలెత్తుతోంది. ఎంఐఎంతో పొద్దు కుదరాలంటే దాని డిమాండ్లు కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో ఒకసారి ఎంఐఎం కాంగ్రెస్ తో కలిసి మేయర్ పీఠాన్ని పంచుకుంది. ఆ సమయంలో 50-50 ఫార్ములాను అనుసరించారు. మొదటి రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ అభ్యర్థిగా, ఎంఐఎం అభ్యర్థి డిప్యూటీ మేయర్ గా, మరో రెండున్నరేళ్లు ఎంఐఎం అభ్యర్థి మేయర్ గా, కాంగ్రెస్ అభ్యర్థి డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను అనుసరించాలని ఎంఐఎం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎంఐఎం సహకారం లేనిదే ఏ పార్టీ కూడా మేయర్ పీఠాన్ని అధిరోహించే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీ ఈ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్.. ఎంఐఎంను ఎలా ఒప్పిస్తారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఎలాంటి అడుగులు వేస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
Feroz Khan 9640466464
addComments
Post a Comment