జాతీయ మీడియా కుట్ర – ఆదిలాబాద్ కు చెడ్డపేరు.!

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించినా.. వార్తల్లో చూపించరు.. స్వేరోస్ విద్యార్థులు ఎవరెస్ట్ ను అధిరోహించినా.. తమ షోలలో కనీస చోటివ్వరు.. అదే ఒక నాయకుడు వివాదాస్పద కామెంట్లు చేస్తే.. ప్రైమ్ టైమ్ షోలలో చూపిస్తారు.. పాతకక్షలతో జరిగే గొడవలకు గంటలకు గంటలు సమయమిస్తారు.. తమ రాజకీయ గురువులను మెప్పించేందుకు.. ఒక పార్టీ తెలంగాణలో పాతుకుపోయేలా చేసేందుకు జాతీయ మీడియా పన్నుతున్న కుట్రలతో ప్రశాంతంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెడ్డ పేరు వస్తోంది. ఈ విష ప్రచారాన్ని తెలుగు మీడియా తిప్పికొట్టలేకపోతోంది. 

ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సోయం బాపురావు బీజేపీ తరపున ఎంపీగా గెలిచిన తర్వాత.. ఒక సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆదివాసీ అమ్మాయిల వైపు కన్నెత్తి చూసినా.. వెంట బడినా ముస్లిం అబ్బాయిల తలలు నరికేస్తాం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తెలుగు మీడియా అంతగా పట్టించుకోలేదు. అయితే రెండు రోజుల తర్వాత ఆ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. పదికి పైగా ఇంగ్లీష్, హిందీ ఛానళ్లు రోజంతా ఆ వ్యాఖ్యలనే ప్రచారం చేశాయి. అప్పుడు ఆదిలాబాద్ జిల్లా పేరు జాతీయస్థాయిలో మారుమోగిపోయింది. ఆ వ్యాఖ్యలపై కొన్ని టీవీ చానళ్లయితే ప్రైమ్ టైమ్ షోలు సైతం నిర్వహించాయి. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఎంపీ సోయం బాపురావు పై కేసు కూడా నమోదైంది. అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకే ఎంపీ సోయం బాపురావును జాతీయ స్థాయి వ్యక్తిగా చేసిన మీడియా.. అంతకంటే ముందు ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఆదివాసీ ఉద్యమాన్ని నిర్మించి, దాన్ని రాష్ట్రస్థాయిలో విస్తరించడానికి ఎంతలా కష్టపడ్డారో ఒక్కసారి కూడా చూపెట్టలేదు. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సోయం బాపురావు.. ఆ తర్వాత లంబాడీల వల్ల గోండులకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఉద్యమబాట పట్టారు. ముందుగా ఎస్టీల్లో ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన ఆయన.. ఆ తర్వాత లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ తో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఉద్యమాన్ని అణగదొక్కకుండా ఉండేందుకు వివిధ పార్టీలు మారారు. ముందుగా టీఆర్ఎస్.. ఆ తర్వాత కాంగ్రెస్.. ఆ తర్వాత బీజేపీ ఇలా వివిధ పార్టీల్లో ఉన్నారు. ఆయన ఏ పార్టీ నుంచి బరిలో ఉన్నా.. ఆయనను గెలిపించేది ఉద్యమమేనని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట. గోండులే కాదు.. గిరిజనేతరులు కూడా ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. వారిలో మైనార్టీలూ ఉన్నారు. అలాంటి సోయం బాపురావును జాతీయ మీడియా ఓ వర్గానికి.. ఓ మతానికి కొమ్ముకాసే వ్యక్తిలా చూపించింది. కానీ గోండులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు ఆయన చేపట్టిన నిర్మించిన ఉద్యమం.. ఆయన రాజకీయ వ్యూహాలు వారికి వార్తా విషయాలుగా కనిపించలేదు. దీంతో సోయం బాపురావుకే కాదు.. ఆదిలాబాద్ జిల్లాకూ చెడ్డపేరు వచ్చింది. 

ఇక రెండో విషయం.. ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ కాలనీలో జరిగిన కాల్పుల ఘటన. ఈ చిన్నపాటి ఘటనను జాతీయ మీడియా కవర్ చేయడం తో ఇది జాతీయస్థాయి అంశంగా మారింది. అయితే ఈ ఘటనను కవర్ చేయడానికి కారణం కాల్పులు జరిపింది ఏఐఎంఐఎంకు చెందిన నాయకుడు కావడమే. సుమారు రెండు దశాబ్దాలుగా ఫారుఖ్ అహ్మద్ ఎంఐఎంలో ఉన్నారు. రెండు పర్యాయాలు మున్సిపల్ వైస్ చైర్మన్ గా పని చేశారు. ఆదిలాబాద్ పట్టణాభివృద్ధిలో ఆయన పాత్రను తీసిపారేయలేం. ఎంతో మంది కలెక్టర్లు ఆయనను అభినందించారు. అయితే తాటిగూడ కాలనీలో జరిగిన చిన్నపాటి గొడవలో ఆయన సహనం కోల్పోయి, క్షణికావేశంలో, ఆత్మరక్షణ కోసం తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ పిస్టల్ తోకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన జరిగిన రెండు కుటుంబాల మధ్య పాతకక్షలు సైతం ఉన్నాయి. పాతకక్షలు, క్షణికావేశంలో జరిగిన ఈ ఘటన జాతీయ మీడియాకు కథాంశంగా మారింది. సుమారు పదిహేను నిమిషాల నుంచి అరగంట పాటు తమ విలువైన సమయాన్ని జాతీయ మీడియా ఈ ఘటనకు కేటాయించింది. అప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా పేరు ఉచ్ఛరించడానికే వందసార్లు ఆలోచించే జాతీయ మీడియా.. ఏఐఎంఐఎం నాయకుడి కాల్పుల ఘటనలో ఆదిలాబాద్ జిల్లా పేరును పదులసార్లు పలికింది. 
పార్లమెంట్ ఎన్నికలు జరిగి.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో ఈ రెండు ఘటనలే కాదు.. భైంసాలో జరిగిన అల్లర్లకు సైతం జాతీయ మీడియా ఎంతో సమయాన్ని కేటాయించింది. అయితే కేవలం వ్యతిరేక ఘటనలు జరిగే సమయంలోనే జాతీయ మీడియాకు ఆదిలాబాద్ పేరు గుర్తుకు వస్తోంది. అదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా పేరును ఇనుమడింపజేసేలా ఎందరో మంది ప్రయత్నించినా.. జాతీయ మీడియాకు సమయం దొరకదు. కార్పోరేట్ పాఠశాలలు, కళాశాలలను తలదన్ని తెలంగాణలో విద్యనందిస్తూ.. ప్రపంచస్థాయిలో విద్యార్థుల పేరు మారుమోగేలా చేస్తున్న సాంఘిక సంక్షేమ గురుకులాలు కనిపించడం లేదు. ఎవరెస్ట్ తోపాటు ఐదు ఖండాల్లో ఐదు ఎత్తయిన శిఖరాలను అధిరోహించిన తెలంగాణ బిడ్డ మాలావత్ పూర్ణ పేరు తీసుకోవడానికి జాతీయ మీడియా మనసొప్పదు. బోరబండ మురికివాడ నుంచి బోస్టన్ సిటీకి వెళ్లిన ప్రియాంక వారికి కానరాదు. హార్వర్డ్ యూనివర్సిటీ సమ్మర్ క్యాంప్ కు ఎంపికైన ఆనంద్ పేరు వారికి వినిపించదు. ప్రపంచస్థాయి విద్యాలయాలుగా సాంఘిక సంక్షేమ గురుకులాలను తీర్చిదిద్దుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారికి కనిపించడు. అంతేకాదు.. హిందీ రాష్ట్రాల్లోని చిన్న ఊర్లలోని సమస్యలను సైతం గంటలకు గంటలు చూపించే జాతీయ మీడియాకు ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు అస్సలు కనిపించవు. 

ఆదిలాబాద్ జిల్లానే కాదు.. తెలంగాణలోని వివాదాస్పద విషయాలను జాతీయ మీడియా కవర్ చేయడానికి అనేక కారణాలున్నాయి. ఎందుకంటే తెలంగాణలో తొలిసారి బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూపెట్టేందుకు జాతీయ మీడియా ప్రయత్నిస్తోంది. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ప్రతీ చిన్న అంశాన్ని కూడా కవర్ చేస్తోంది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను సైతం లైవ్ కవర్ చేసింది. జాతీయ మీడియా కుట్రలతో ఆదిలాబాద్ పేరు సైతం జాతీయస్థాయిలో మారు మోగుతున్నా.. అది చెడ్డగానే ఉంటోంది. ఈ జాతీయ మీడియా కుట్రలను తెలుగు మీడియా తిప్పికొట్టలేకపోవడం విషాదంగా నిలిచిపోతుందేమో! 



Feroz Khan 9640466464 

ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్

Comments