దుబ్బాక ఓటమి.. టీఆర్ఎస్ తెలిసి చేసిన పనేనా సుమీ..!

అల్లుడిని పక్కన పెట్టే ప్రయత్నమా.. 
కొడుకు కోసం తాపత్రయమా..!
హరీష్ రావు ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం 
ఇదే కార్యకర్తల చర్చల సారాంశం
ఫిరోజ్ ఖాన్, రాజకీయ విశ్లేషకులు, 9640466464

దుబ్బాకలో కమలం వికసించింది.. కాషాయ జెండా ఎగిరింది. అయితే ఇది బీజేపీ విజయమా.. టీఆర్ఎస్ స్వయం కృతాపరాధమా.. అనే చర్చ ఓ వైపు జరుగుతుండగా.. అంతర్గత ప్రణాళికలు.. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా టీఆర్ఎస్ కావాలనే ఈ ఎన్నికపై ఎక్కువ దృష్టి పెట్టలేదనే వాదనా వినిపిస్తోంది. టీఆర్ఎస్ కు చెందిన కీలక నాయకుడు హరీష్ రావును పక్కన పెట్టి.. కొడుకు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించేందుకు సీఎం కేసీఆర్ ఇలాంటి ప్రణాళికలు రచించారనే ప్రచారం జరుగుతోంది. 

దుబ్బాక నియోజకవర్గం.. మంత్రి హరీశ్ రావు సొంత జిల్లా అయిన సిద్ధిపేట పరిధిలో వస్తుంది. గత 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే కొంత కాలం క్రితం ఆయన మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితం నవంబర్ పదో తేదీన రాగా.. హోరా హోరీ జరిగిన పోరులో ఇక్కడి నుంచి బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ కు అయితే డిపాజిట్ కూడా దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండగా.. రఘునందన్ రావు గెలుపుతో ఆ సంఖ్య రెట్టింపు అయింది. అయితే ఏ విధంగా చూసినా ఇది టీఆర్ఎస్ ఓడిపోయే స్థానం కాదు. బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోదని ప్రగల్భాలు పలికిన నాయకులు ఆ పార్టీ గెలుపుతో నోరు మూసుకున్నారు.. అయితే ఇలా ఎలా జరిగిందనే చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల్లో జరుగుతోంది. దీనికి అనేక మంది నాయకులు అనేక కారణాలు చూపుతుండగా.. సీఎం కేసీఆర్ గురించి తెలిసిన నాయకులు మాత్రం ఈ స్థానాన్ని కావాలనే ఓడిపోయారని చెబుతున్నారు. మంత్రి హరీశ్ రావును పక్కన పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ఇలా చేశారని పేర్కొంటున్నారు. 

కేటీఆర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్.. 
ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇదే భవిష్యత్తుల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించకుండా ఎక్కడ అడ్డుపడుతుందేమోననే సీఎం కేసీఆర్ భయపడుతున్నట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఉద్యమ సమయంలో పార్టీలో.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ప్రభుత్వంలో హరీశ్ రావు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన కొన్నాళ్ల తర్వాతే కేసీఆర్ తర్వాతి స్థానం హరీశ్ రావుదే అన్నట్టు ఉండేది పరిస్థితి. కేసీఆర్ కు అన్నింటికి కుడిభుజంలా ఉండేవారు. అయితే కేటీఆర్ ఎంట్రీ ఇచ్చాక.. హరీశ్ రావును పక్కన పెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాక కేసీఆర్ హరీశ్ రావును పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఆయనకు ఉన్న ప్రజా మద్దతును చూసి మెల్లమెల్లగా ఆయన ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని కార్యకర్తలు చెబుతున్నారు. దుబ్బాకలో రామలింగారెడ్డి కుటుంబసభ్యులకు టికెట్టు ఇస్తే ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తెలిసినా.. కావాలనే సోలిపేట సుజాతకు టికెట్టు ఇచ్చారని, ఆ తర్వాత ఉప ఎన్నిక బాధ్యతను హరీశ్ రావుకు అధిష్టానం అప్పగించిందని కార్యకర్తలు చెబుతున్నారు. దుబ్బాక ఎన్నికల్లో పార్టీ ఓడితే ఆ భారాన్నంతా హరీశ్ రావుపై మోపేందుకే హరీశ్ రావుకు ఆబాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా దుబ్బాక నియోజకవర్గంలో అసమ్మతి రాగాలు వినిపించినా.. వాటిని పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా దుబ్బాక ఓడిపోయే హరీశ్ రావు అసమర్థ నాయకుడని కేటీఆర్ కంటే వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక సమయంలో టీఆర్ఎస్ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలో సైతం హరీశ్ రావు వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం మానేశారని ప్రచారం జరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 



Feroz Khan 9640466464 

Comments