డీసీసీ.. ఇంకెప్పటికీ..! నాయకత్వ లోపంతో కార్యకర్తల్లో అయోమయం

డీసీసీ.. ఇంకెప్పటికీ..!
భార్గవ్ రాజీనామా తర్వాత.. అంతా సైలెంట్ 
ముగ్గురు, నలుగురి మధ్య పోటీ 
కుల, మత సమీకరణాలు సమీక్షిస్తున్న పెద్దలు 
నాయకత్వ లోపంతో కార్యకర్తల్లో అయోమయం 
ఇతర పార్టీల నాయకులు కూడా ఎదురుచూస్తున్న వైనం 
ఫిరోజ్ ఖాన్, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, 9640466464



రాష్ట్రంలోనే కాదూ.. దాదాపూ అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలున్నా.. జాతీయ స్థాయి నుంచి పట్టణ, గ్రామీణ స్థాయి వరకు నాయకత్వ లోపం ఆ పార్టీని వెన్నాడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. సీనియర్‌ నాయకులతోపాటు గల్లీ కార్యకర్తలంతా ఏమి చేయాలో తోచక గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పక్క పార్టీల వైపు దృష్టి మళ్లిస్తుండగా.. మరికొందరు పార్టీ పదవులకు రాజీనామా చేసి గప్ చుప్ గా ఉంటున్నారు. 


ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీని పట్టించుకునే వారు కరువయ్యారు. రాష్ట్రస్థాయిలోనే సరైన నాయకుడు లేకపోవడం.. జిల్లాల్లో పర్యవేక్షించాల్సిన వారు కరువవడంతో కార్యకర్తలంతా ఎవరి దారి వారు వెతుక్కుంటున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బలమైన కార్యకర్తలున్నా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే నాయకులు ఒకరిద్దరూ తప్ప మరెవరూ కనిపించడం లేదు. అడపాదడపా మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్ ఖాన్ మినహా.. పార్టీని పట్టించుకునే వారు కరువయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భార్గవ్ దేశ్ పాండే డీసీసీ పీఠానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా ఎవరినీ ఎంపిక చేయలేదు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి భార్గవ్ దేశ్ పాండే సోషల్ మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు.


ఉమ్మడి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పినా మాజీ మంత్రి సి. రాంచంద్రా రెడ్డి వృద్ధాప్యంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్ ఖాన్, తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి డీసీసీ పీఠానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వీరితోపాటు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కూడా పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆయన గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఒకానొక సందర్భంలో ఆయన బీజేపీలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే పార్టీ పెద్దల సూచనతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇప్పుడు డీసీసీ పీఠం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. అయితే కుల, మత రాజకీయ సమీకరణాలతో ఈ పీఠం ఎవరికి దక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 



కుల, మత సమీకరణాలు.. 
ఆదిలాబాద్ జిల్లాలో అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ కుల, మత సమీకరణాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరికి అధ్యక్ష పీఠం ఇస్తే బాగుంటుందో ఇప్పటికే అంతర్గత సర్వే నిర్వహించినట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడే వారిని ఎంపిక చేద్దామనుకున్నా.. కుల మత సమీకరణాలు వారికి అడ్డుగా వస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్టు కోసం నలుగురు పోటీ పడగా, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాతను అధిష్టానం ఎంపిక చేసింది. ఆమె మూడో స్థానంలో నిలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కోసం కష్టపడే వారే కరువయ్యారు. మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్ ఖాన్ ఒంటి చేత్తో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన గండ్రత్ సుజాత నెల, రెండు నెలలకోసారి మాత్రమే కనిపిస్తున్నారు. ఆమె ఎక్కువగా విదేశాల్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్ష పీఠం వరించినా.. ఆ తర్వాత దాన్ని వదిలేసుకున్న భార్గవ్ దేశ్ పాండే అసలు క్షేత్రస్థాయిలో కనిపించడమే లేదు. వృద్ధాప్యం కారణంగా మాజీ మంత్రి సి. రాంచంద్రారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో పార్టీని బతికించుకునే పనిలో పడ్డారు సాజిద్ ఖాన్. సాధారణంగా ఆలోచిస్తే.. సాజిద్ ఖాన్ కు డీసీసీ పీఠం దక్కే అవకాశం ఉంది. అయితే ఇక్కడే కుల, మత సమీకరణాలు అడ్డుగా వస్తున్నాయి. సాజిద్ ఖాన్ తోపాటు తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సైతం డీసీసీ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో రెడ్డి వర్గానికి టీఆర్ఎస్ ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే జోగురామన్నతో టీఆర్ఎస్ లోని రెడ్డి వర్గానికి చెందిన నాయకులతో ఇప్పటికీ పొసగడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో రెడ్డి వర్గానికి చెందిన నాయకుడికి డీసీసీ పీఠం ఇస్తే పార్టీని బలోపేతం చేయవచ్చనే వాదనను రెడ్డి వర్గీయులు ముందుకు తీసుకువస్తున్నారు.


ఎవరూ లేని సమయంలో పార్టీని బతికించుకుంటూ.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న సాజిద్ ఖాన్ తనకే డీసీసీ పీఠం వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. అయితే కుల, మత సమీకరణాల్లో ఆయనను ఎంపిక చేస్తే జరిగే లాభనష్టాలపై అధిష్టానం ఆలోచిస్తోంది. సాజిద్ ఖాన్ కు డీసీసీ పీఠం ఇస్తే.. బీజేపీ ఎక్కడ బలపడుతుందోననే భయం వారిని వెన్నాడుతోంది. సాజిద్ ఖాన్ ముస్లిం కావడంతో మతాల సెంటిమెంట్ ను బీజేపీ ఎక్కడ ముందుకు తీసుకువస్తుందోననే అనుమానం వారిలో వ్యక్తమవుతోంది. దీని వల్ల లాభ, నష్ట శాతాలు సమానంగా ఉన్నా.. రిస్క్ తీసుకునే దానిపై వారి నిర్ణయం ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ తోపాటు బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుండగా.. వారిని ఏకతాటిపై తీసుకురావడంలో సాజిద్ ఖాన్ సఫలమవుతారా అనే అనుమానం కూడా లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలోని కొన్ని వర్గాలు ముందు కాంగ్రెస్ కు సపోర్ట్ గా నిలవగా, ఎన్నికలకు ఒక రోజు ముందు మొత్తం సీన్ మారిపోయింది. రాత్రికి రాత్రే వాట్సాప్ లలో మెస్సేజ్ లు వైరలై.. ముస్లిం ఓటర్లు టీఆర్ఎస్ వైపు మళ్లారు. అయితే ముస్లిం ఓటర్లను ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా.. ఇతరుల మనసులను సాజిద్ ఖాన్ గెలవగలుగుతారా లేదా అనేది తేల్చుకునే పనిలో అధిష్టానం ఉంది. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ సైతం డీసీసీ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండడంతో అధిష్టానం ఆయనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే డీసీసీ పీఠంపై అధిష్టానం ఎవరిని కూర్చోబెడుతుందోనని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు సైతం ఎదురుచూస్తున్నారు.


Comments