అధిష్టానం ఎదుట జడ్పీటీసీ చారులత.!
కుల సమీకరణాల్లో పీఠం దక్కే ఛాన్స్
ఎస్టీ నియోజకవర్గాలు అధికంగా ఉండడమే కారణం
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
డీసీసీ పీఠం బరిలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు పలువురి పేర్లు వినిపించగా.. ఇప్పుడు ఉట్నూర్ జడ్పీటీసీ చారులత రాథోడ్ పేరు ముందు వరుసలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎస్టీ మహిళ కావడం, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్ డ్ కావడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే డీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందనేది అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంది.
కేంద్రం, రాష్ట్రమే కాదు.. జిల్లా, మండల, గ్రామీణ స్థాయిల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో బాధపడుతోంది. సమర్థవంతులైన నాయకులు, పటిష్టమైన కార్యకర్తలున్నా.. వారికి బాధ్యతలు అప్పగించడంలో అధిష్టానం అలసత్వం వహిస్తోంది. దీంతో పార్టీ క్రమంగా బలహీనపడుతుండగా, ఇతర పార్టీలు వాటిని అందిపుచ్చుకొని బలపడుతున్నాయి. కార్యకర్తలు, నాయకులు సైతం ఇతర పార్టీల తీర్ఛం పుచ్చుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న భార్గవ్ దేశ్ పాండే రాజీనామా చేసిన తర్వాత పార్టీ ఇప్పటి వరకు ఎవరికీ ఆ బాధ్యతలు అప్పగించకపోవడంతో కార్యకర్తలు సైతం అయోమయానికి గురవుతున్నారు. అయితే డీసీసీ అధ్యక్షులుగా పలువురి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోంది. వీరిలో ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గండ్రత్ సుజాత, కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్ ఖాన్, తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఉండగా, తాజాగా ఉట్నూర్ జడ్పీటీసీ చారు లత పేరు వినిపిస్తోంది. కుల సమీకరణాల్లో ఆమె పేరు ముందువరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఆమె రాజకీయంగా చేసిన కొన్ని తప్పటడుగులు దీనికి అడ్డుగా మారినట్టు సమాచారం.
సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా..
రాజకీయాల్లోకి రాకముందు చారులత సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలంబాబా ఎన్జీఓను స్థాపించి పలువురిని ఆదుకున్నారు. గిరిజన ప్రాంతాల్లోని పేద మహిళలు, మానసిక వైకల్యం కలిగిన చిన్నారులకు ఆపన్నహస్తం అందించారు. ఇంకా చదువు ప్రాముఖ్యతను వారికి వివరించారు. వైద్య సేవలు సైతం అందించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గత జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉట్నూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
అనుకోని విధంగా..
అయితే జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఆమె వ్యవహారశైలి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గెలిచే అవకాశం లేకున్నా కాంగ్రెస్ అధిష్ఠానం చారులతను జడ్పీ చైర్మన్అభ్యర్థిగా ప్రకటించింది. జడ్పీటీసీల మద్దతు కూడగట్టే బాధ్యతను సైతం ఆమెకే అప్పగించింది. అప్పుడు జిల్లాలోని 17 జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 9, బీజేపీ 5, కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా రాథోడ్ జనార్ధన్ పేరును తెరపైకి తీసుకురావడంతో అంతర్గత కలహాలు మొదలైనట్టు ప్రచారం జరిగింది. దీంతో ఒకరిద్దరు ఎంపీటీసీల మద్దతు సాధిస్తే బీజేపీ లేదా కాంగ్రెస్ జడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ ఆ బాధ్యతను చారులతకు అప్పగించింది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ జడ్పీ చైర్మన్ గా ఉన్న చారులత రాథోడ్ కాంగ్రెస్ శిబిరం నుంచి బయటకు వెళ్లిపోయి టీఆర్ఎస్ శిబిరంలో చేరిపోయారు. ఆ తర్వాత ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ జనార్ధన్ కు మద్దతు తెలిపారు. మిగిలిన ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు బీజేపీకి మద్దతు తెలిపారు. అయితే చేసిన తప్పును సరిదిద్దుకోవాలనో.. లేక అనర్హత వేటు పడుతుందేమోననే భయమో తెలియదు గానీ.. ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ లోనే కొనసాగారు.
కుల సమీకరణాల్లో..
తప్పటడుగుల విషయం ఎలా ఉన్నా.. కుల సమీకరణాల్లో చారులత రాథోడ్ పేరు డీసీసీ అధ్యక్ష పీఠం బరిలో ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ లో బలమైన ఎస్టీ మహిళా నాయకులు లేరు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో బోథ్, ఖానాపూర్ రెండు ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గాలే. కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ జిల్లాలో పునర్ వైభవం రావాలంటే చారులత రాథోడ్ ను డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని పలువురు నాయకులు ఆమె పేరును సిఫారసు చేసినట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లా మాజీ పీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డితోపాటు రాష్ట్ర కాంగ్రెస్ లోని ఓ వర్గం ఆమె పేరును బలంగా ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. అయితే డీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందో అధిష్టానం పేరు ప్రకటించే వరకు ఆగవలసిందే.
addComments
Post a Comment