ఉద్యమ నాయకుడు

ఆదివాసీలను చైతన్యవంతం చేసిన లీడరు 
సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం 
గిరి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం 
మనసులు గెలిచిన సోయం 

(సమయవాణి ప్రతినిధి – ఆదిలాబాద్)
సోయం బాపురావు.. ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా.. ఆయనను ఆ స్థాయికి చేర్చింది ఆదివాసీ ఉద్యమే. ఆదివాసులను ఏకతాటిపైకి తీసుకువచ్చి.. వారిని చైతన్యపరిచి.. ఉద్యమం వైపు నడిపించడంలో ఆయన విజయం సాధించారనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ ఉద్యమం ద్వారా.. తన రాజకీయ చాణక్యంతో ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కొన్ని వివాదాస్పద ప్రకటనలతో వివాదాలకు ఆయన కేంద్ర బిందువుగా మారినా.. ఆదివాసుల్లో ఆయనపై నమ్మకం ఏ మాత్రం తగ్గలేదు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తూనే.. వారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు సోయం బాపురావు. ఏదైనా సహాయం కోసం వచ్చే ఆదివాసులను ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపించరని ఆయనకు పేరుంది. 


తన జాతి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించి న్యాయం చేకూర్చడానికి ఉద్యమ బాట పట్టారు సోయం బాపురావు. మొదట ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన సోయం బాపురావు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనతోనే టీఆర్ఎస్ లో చేరారు. 2004లో బోథ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాతి పరిణామాల్లో టీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో దోస్తానా కొనసాగించారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచే ఆదివాసులకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడేవారు. వలస లంబాడీల వల్ల ఆదివాసులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉదాహారణలతో సహా వివరించేవారు. 
రెండు దశల్లో ఉద్యమం.. 
ఆదివాసీ ఉద్యమం రెండు దశల్లో కొనసాగిందని చెప్పవచ్చు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఒక దశ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత మరొక దశ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ మాదిరిగానే ఎస్టీల్లో ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలని సోయం బాపురావు ఉద్యమించారు. పలువురితో కలిసి తుడుందెబ్బను ఏర్పాటు చేసి అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. అయితే ఆ ఉద్యమం అంత ఉధృతంగా సాగలేదు. కాని ఆదివాసులు తమ వాణిని వినిపించారు. వలస లంబాడీల వల్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. అయితే ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే ఆశించే పాలకులు వాటిని పట్టించుకోలేదు. ఆదివాసుల రెండో దశ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగింది. ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ దశ ఉద్యమం చాలా ఉధృతంగా జరిగింది. ఎంత ఉధృతమంటే ఒక జిల్లాలో నెల రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసేంతగా.. ఎంత ఉధృతమంటే వేలాది కేంద్ర ప్రభుత్వ బలగాలు కవాతు నిర్వహించేంతగా. అయితే రెండో దశ ఉద్యమంలో ఆదివాసులు తమ డిమాండ్ ను పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు ఎస్టీల్లో ఏబీసీడీ వర్గీకరణ కాదు.. లంబాడీలను పూర్తిగా ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లంబాడీ ఉద్యోగులను ఆదివాసీ గూడేల్లోకి రాకుండా నిషేధించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వ బలగాలను రంగంలోకి దింపింది. ఉద్యమంపై సరైన నివేదికలను ఇవ్వని రెండు, మూడు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. అయితే ఉద్యమంపై.. ఆదివాసుల డిమాండ్ పై మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అంశమని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఉద్యమం శాంతియుతంగానే సాగింది. 
రాజకీయాల ద్వారానే.. 
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఉద్యమానికి రాజకీయ వేదిక కావాలనుకొని సోయం బాపురావు భావించారు. ఒక దశలో తుడుందెబ్బ బ్యానర్ పై ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోథ్ నియోజకవర్గ టికెట్టును సంపాదించి ఎన్నికల బరిలో నిలిచారు. అందరి సర్వేలు సోయం బాపురావు కచ్చితంగా గెలుస్తారని చెప్పినా.. అందరి అంచనాలకు భిన్నంగా సోయం బాపురావు ఓడిపోయారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు సోయం బాపురావు ఓటమికి అదే స్థాయిలో కారణాలున్నా.. కొన్ని స్వయం కృతాపరాధాలు సైతం ఉన్నాయి. సోయం బాపురావును ఓడించేందుకు పాలక టీఆర్ఎస్ పార్టీయే కాదు లంబాడాలందరు ఒక్కటయ్యారు. ఎత్తుకు పై ఎత్తులు వేశారు కాంగ్రెస్ లోని ఒక వర్గం కూడా ప్రత్యర్థికి సహకరించిందనే ఆరోపణలున్నాయి. దీంతో ఏడు వేల కంటే తక్కువ ఓట్లతో సోయం బాపురావు ఓటమిని చవిచూశారు. 
వెనుదిరిగి చూడకుండా.. 
2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా సోయం బాపురావు వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత ఆరు నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఉద్యమం ద్వారా ఆదివాసులను ఏకం చేస్తూనే.. కాంగ్రెస్ టికెట్టు కోసం ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్టు ఇవ్వడానికి నిరాకరించింది. పార్లమెంట్ టికెట్టును మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కు కేటాయించింది. దీంతో ఉద్యమాన్ని కొనసాగించడానికి ఎలాగైనా రాజకీయ వేదిక కావాలనుకున్న సోయం బాపురావు బీజేపీ ద్వారా సంప్రదింపులు జరిపారు. పార్లమెంట్ టికెట్టును సంపాదించి ఎన్నికల బరిలో నిలిచారు. ఆదివాసులను ఏకం చేయడమే కాకుండా గిరిజనేతరులను సైతం తన వైపునకు తిప్పుకొని భారీ విజయాన్ని సాధించారు. 
సమస్యల పరిష్కారం.. 
పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించిన తర్వాత కొన్ని వివాదాస్పద ప్రకటనలతో జాతీయ స్థాయిలో ఓ న్యూస్ గా మారారు. కొన్ని విషయాల్లో తప్పటడుగులు వేశారనే ప్రచారం జరిగింది. అయితే ఎప్పుడూ ఉద్యమాన్ని, ఆదివాసులను విస్మరించలేదు. మెల్లమెల్లగా ఆదివాసీ గ్రామాల్లో పర్యటించడం మొదలుపెట్టారు. సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఆదివాసుల డిమాండ్లను పలు వేదికల్లో వినిపించడమే కాకుండా.. ఆదివాసుల గొంతుకగా మారారు. ఉద్యమ వేదిక అయిన తుడుందెబ్బలో కొన్ని అసమ్మతి రాగాలు వినిపించినా.. వాటిని పరిష్కరించడంలో సఫలమయ్యారు. అంతేకాకుండా ఆదివాసులను ఎల్లప్పుడూ ఆదుకుంటారని సోయం బాపురావుకు పేరుంది. ఏదైనా సమస్యతో, ఏదైనా అవసరంతో ఆయన ఇంటికి వచ్చిన ఏ ఆదివాసీ ఖాళీ చేతులతో వెళ్లడు. 

Feroz Khan 9640466464 


Comments