అయ్యో కార్మికుడా..!
శ్రామికుల సంక్షేమం పట్టని ప్రభుత్వాలు
సంక్షోభం పేరుతో పని గంటలభారం
సంపద సృష్టించే వారిపై ప్రభుత్వాల జులుం
వేతనాల గురించి చర్చించని ప్రభుత్వాలు
కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
కరోనా.. కార్మికుడిని అతలాకుతలం చేసింది.. మిగితా వారెవరిపై చూపనంత ప్రభావాన్ని చూపింది. సొంతూర్లకు వెళ్లడానికి అష్టకష్టాలను పెట్టింది. రైళ్ల కింద వలస కూలీలను చిదిమేసింది. ఇప్పుడు అదనపు పనిగంటల భారాన్ని మోపబోతోంది. అయితే ఇదంతా కరోనా చేసిందంటే.. తప్పే అవుతుంది.. కరోనా పేరుతో ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలివీ. ఇప్పటికే కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా ఒక ఆయుధంలా దొరికింది. అందుకే ఇప్పుడు ప్రభుత్వాల వేగం పెరిగింది. ఇప్పటికైనా మేలుకోకుంటే.. సంపద సృష్టించే వారిపై పిడుగు పడనుంది.
భారతదేశంలో ప్రస్తుతం ఎనిమిది గంటల పని విధానం అమలు ఉంది. దీన్ని 12 గంటల వరకూ పెంచుకునే అవకాశం రాష్ట్రాల ప్రభుత్వాలకు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ త్వరలో తీసుకురానున్నట్టు తెలిసింది. కరోనా మహమ్మరి బూచి చూపుతూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించగా.. ఇప్పుడు కార్మికుల కొరతను సాకుగా చూపుతూ కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ రిపోర్టులు తెలియజేశాయి. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇలాంటి చర్యలు చేపడుతున్నామని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా.. పెంచిన పని గంటలకు ఏ మేర వేతనం పెంచి ఇవ్వాలనే దానిపై ఎలాంటి స్పష్టతనివ్వకపోవడం చూస్తుంటే వారికి కార్మికులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది.
టాప్ లో ఉత్తరప్రదేశ్..
కార్మిక చట్టాల సవరణ, నిర్వీర్యంలో బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. కార్మిక చట్టాల అమలును మూడేళ్లపాటు నిలిపివేస్తూ ఇప్పటికే ఆర్డినెన్స్ ను తేనున్నట్టు ప్రకటించింది. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఇది తప్పనిసరని చెబుతూ ఆ రాష్ట్ర మంత్రి వర్గం ఆర్డినెన్స్ ను ఆమోదించింది. కేవలం నాలుగు చట్టాలు చట్టాలు మినహాయించి ‘ఉత్తరప్రదేశ్ కార్మిక చట్టాల తాత్కాలిక మినహాయింపు ఆర్డినెన్స్ 2020’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వద్ద పెండింగ్ లో ఉంది. ఇది ఆమోదిస్తే భవన నిర్మాణ కార్మిక చట్టం, వర్క్ మెన్ కాంపెన్సేషన్ యాక్ట్, కార్మిక నిర్మూలన చట్టం, వేతనాల చెల్లింపు చట్టం మినహా ఇతర ఏ కార్మిక చట్టాలు కూడా ఈ రాష్ట్రంలో పని చేయవు.
అదే బాటలో ఇతర రాష్ట్రాలు..
కేంద్రం అధికారాలు ఇవ్వడంతో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళ మినహాయించి.. అన్ని రాష్ట్రాలు కార్మికులపై పని భారం పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాలు కార్మిక చట్టాలను మార్చి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతున్నాయి. చైనాలో ఉన్న అమెరికన్ కంపెనీలను ఇండియాకు తీసుకురావడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తామని ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాలు కూడా గత ఏప్రిల్ లోనే చట్టాల్లో కొన్ని మార్పులు చేసేశాయి.
మరి వేతనం ఎలా..
పని గంటలను పెంచుతున్నట్టు ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. అయితే దానికి ఓవర్ టైం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా అది కార్మికుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. అయితే ఇవన్నీ చెప్పినా.. పరిశ్రమల యాజమాన్యాలు వినే పరిస్థితుల్లో ఉన్నాయా అంటే చెప్పలేం. ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలే ఊడిపోయే పరిస్థితి ఉంది. పన్నెండు గంటలు పని చేయాల్సిందేనని, వేతనం మాత్రం అంతే ఇస్తామని యాజమాన్యాలు చెప్పే ప్రమాదముంది. అయితే మిగితా రాష్ట్రాలు ఇంకా వేతనం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ ఉద్యోగులు, కార్మికులు పని చేయాలంటే ఇది వరకల్లా ఒకే చోట ఎక్కువ మంది పనిచేసేందుకు వీలు కాదని, అందువల్ల కార్మికుల సంఖ్య తగ్గి, పని పెరుగుతుందని, దీన్ని అధిగమించేందుకు 12 గంటల పని విధానానికి అనుమతులిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే కార్మికులు, వలస కూలీలపై ప్రభుత్వాలకు ఎంత ప్రేమ ఉందో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు పని గంటల భారం మోయక తప్పని పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఎలాగూ పట్టించుకోవు కాబట్టి.. పరిస్థితిని అర్థం చేసుకోని పోరాటాలకు కార్మిక సంఘాలు ముందుకు వచ్చి విజయం సాధిస్తాయో.. లేదా ఎప్పటిలాగే ఒకటి రెండు ధర్నాలు చేసి.. తమ పనైపోయినట్టు వ్యవహరిస్తాయో కాలమే సమాధానం చెబుతుంది.
Feroz Khan 9640466464
addComments
Post a Comment