గుట్కాపై పోలీసుల సమరం
జిల్లాలోకి రాకుండా కట్టడి చేసే ప్రయత్నం
వచ్చినా పట్టుకుంటున్న వైనం
లక్షలాది రూపాయల గుట్కా పట్టివేత
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
గుట్కా.. ఆరోగ్యాన్ని స్వాగా చేస్తోంది. ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తోంది. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. చిన్నారులను అనాథలుగా మిగిలిస్తోంది. ఆర్థికంగా తీరని నష్టాన్ని కలిగిస్తోంది. అందుకే ప్రభుత్వం గుట్కా, ఖైనీ వంటి మత్తు పదార్థాల అమ్మకాలపై నిషేధం విధించింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో కొందరు అక్రమార్కులు గుట్టుగా గుట్కా దందా కొనసాగిస్తున్నారు. రూట్లు మార్చి మరీ జిల్లాకు తీసుకువస్తున్నారు. కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఎలాంటి సంబంధం లేకుండా డబ్బు సంపాదనే ధేయయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే కొంతకాలంగా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడంతో వీరి ఆటలు కొనసాగడం లేదు. జిల్లాకు గుట్కా తీసుకురావడానికే ముప్పులు తిప్పలు పడుతుండగా.. ఎలాగోలా తీసుకొచ్చి నిల్వ చేసినా.. పక్కా సమాచారంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మహాలక్ష్మీవాడ కాలనీలో గుట్కా నిల్వలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ ఇన్స్ పెక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు, అనుమానాస్పదంగా ఉన్న షేక్ రషీద్ అద్దె ఇంట్లో తనిఖీలు నిర్వహించగా, వివిధ బ్రాండ్లకు చెందిన నిషేధిత గుట్కా ప్యాకెట్లు దొరికాయి. వీటి విలువ లక్షా 67 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇది ఒక ఉదాహారణ మాత్రమే. నిరంతరం పోలీసులు ఎప్పటికప్పుడు గుట్కా జిల్లాకు రాకుండా నిఘా పెడుతూనే.. వచ్చినా వెంటనే స్వాధీనం చేసుకునేలా పక్కాగా నిఘా పెడుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే సుమారు రూ. 10లక్షల విలువైన గుట్కా స్వాధీనం చేసుకొని 24 మందిపై కేసులు నమోదు చేశారు. ఏడాది వ్యవధిలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ కోట్ల రూపాయల్లోనే ఉంటుంది.
టాస్క్ ఫోర్స్ దాడులు..
గుట్కా పట్టివేతలో ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేకగ పాత్ర పోషిస్తున్నారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ విస్తృత దాడులు చేస్తున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ లో సీసీఎస్ ఇన్స్ పెక్టర్ చంద్రమౌళి, టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు ఎండి సిరాజ్ ఖాన్, ఎస్ కే తాజొద్దీన్, మంగల్ సింగ్, రమేష్ కుమార్, ప్రేం సింగ్, ఎంఏ కరీం, హన్మంతరావు కీలకపాత్ర పోషిస్తున్నారు.
కోడ్.. డీ కోడ్..
గుట్కా వ్యాపారంపై పోలీసులు నిఘా పెట్టడంతో వ్యాపారులు సైతం కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. కోడ్ భాషలో మాట్లాడుకుంటూ వాటిని జిల్లాకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అలాంటి వాటిని కూడా పోలీసులు డీ కోడ్ చేస్తూ గుట్కాను పట్టుకొని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల మంచిర్యాలకు చెందిన ఓ వ్యాపారి ఐచర్ వాహనంలో నిత్యావసర సరుకులు తీసుకువస్తున్నాడు. కడెం మండలం మీదుగా వెళ్తున్న ఈ లారీని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా, రూ. 5.25 లక్షల విలువైన గుట్కా, అంబర్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కోడ్ భాషలో మాట్లాడుకుంటూ వీటిని తీసుకువస్తున్నారు. అంతేకాకుండా కంటైనర్లలో సైతం గుట్కాను తీసుకువస్తున్నారు. గుట్కాను స్వీటి, అంబర్ ను డార్లింగ్ పేర్లతో పిలుస్తున్నారు. రవాణా చేయడానికి కంటైనర్లను సైతం వాడుకుంటున్నారు. దీంతో వీటిపై కూడా ఇప్పుడు పోలీసులు నిఘా పెంచారు.ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను పెంచుకుంటూ గుట్కా వ్యాపారం జరగకుండా అడ్డుకుంటున్నారు.
Feroz Khan 9640466464
addComments
Post a Comment