డబ్బులెక్కడినుంచొస్తాయి..! ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయవిశ్లేషకులు, 9640466464

మాటలతోనే మోడీ మాయ! 
భ్రమల్లో ఉంచుతూ.. సంక్షేమాన్ని మరుస్తూ.. 
ఆత్మ నిర్భర్తా ఉత్తిదేనా? 



ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయవిశ్లేషకులు, 9640466464.. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కేందుకు రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని దేశప్రధాని మోడీ ప్రకటించారు. దాని కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. మంచిదే.. రూ. 20 లక్షల కోట్లు అంటే మన దేశ జీడీపీలో దాదాపు పది శాతం. అయితే ఇప్పటికే దేశాన్ని ముందుకు నడపడానికి డబ్బులు లేని సమయంలో ఆర్బీఐ వద్ద ఉన్న నగదు నిల్వలను తీసేసుకున్న కేంద్రం.. ఈ ఆర్థిక ప్యాకేజీకీ డబ్బులు ఎక్కడి నుంచి తీసకువస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. లేదా గతంలో బిహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రానికి ప్రకటించిన లక్ష కోట్ల ప్యాకేజీ లాగే ఇది కూడా ‘జుమ్లా’గా మిగిలిపోతుందో అనే అనుమానం వ్యక్తమవుతోంది. 



కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే మూడు దశల్లో లాక్ డౌన్ ను అమలు చేశారు. అయితే మూడో దశలో కాస్త సడలింపులు ఇవ్వగా.. లాక్ డౌన్ ముగుస్తుందేమోనని భావించారు. అయితే క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో నాలుగో దశ కూడా లాక్ డౌన్ ఉంటుందని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. అయితే ఇది కొత్త నిబంధనలతో అమలవుతుందని స్పష్టం చేశారు. అదే సమయంలో  రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దీని వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిస్తామని చెప్పారు. ఆ వివరాలు ఎలా ఉన్నా.. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థలో ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పేద, బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా 70 వేల కోట్లతో గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీని ప్రకటించారు. అయితే జన్ ధన్ ఖాతాలు ఉన్న మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 500 రావడం మినహా దీని నుంచి ఎలాంటి లాభం కనిపించలేదు. ఎటు చూసినా కష్టాలే దర్శనమిచ్చాయి. దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మినహా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా కనిపించలేదు. 



కష్టాలు పట్టని ప్రభుత్వం.. 
లాక్ డౌన్ లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తే ప్రజల కష్టాలు వాటికి పట్టవని స్పష్టమైంది. ముఖ్యంగా వలస కూలీల గాథలు చూస్తే ఎవరికైనాకన్నీళ్లు వస్తాయి. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి గాని, కేంద్ర మంత్రుల నుంచి గాని, అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. స్వస్థలాలకు వెళ్లేందుకు వలసకూలీలు వందలు,వేలకిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. ఉన్న చో ట కూడా వారికి భోజన సౌకర్యం కల్పించలేదు. మహారాష్ట్రలో పదహారు మంది కూలీలు గూడ్స్ రైలు కింద పడి మరణించినా.. ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కానరాలేదు. లాక్ డౌన్ ప్రారంభమైన 40 రోజుల తర్వాత కొన్ని నిబంధనలతో రైళ్లను ప్రారంభించినా.. పైసా లేని వలస కూలీల నుంచి ముక్కు పిండి రైలుచార్జీలు వసూలు చేశారు. అలాంటి సమయంలో కొన్ని చోట్ల ఆయా రాష్ట్రాలు, మరి కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఆ చార్జీలను భరించి వారికి కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి. దుకాణ, ఇళ్ల యజమానులు మూడు నెలల అద్దె తీసుకోవద్దని మాటమాత్రంగా చెప్పిన ప్రభుత్వాలు.. కనీసం రైలు చార్జీలు కూడా విడిచిపెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు 189 మంది కార్మికులు మరణించారని స్టాండెండ్ వర్కర్స్ యాక్షన్ నెట్ వర్క్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికీ ఈ సంఖ్య పెరిగింది. వీరిలో సొంతూర్లకు వెళ్తూ ప్రయాణంలో, ఆకలితో మరణించిన వారు సైతం ఉన్నారని వారు స్పష్టం చేశారు. ఓ సర్వే ప్రకారం 84 శాతం కార్మికులకు యాజమాన్యాలు వేతనాలు చెల్లించలేదు. వారులో 98 శాతం మందికి ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. 70 శాతం మందికి రేషన్ సైతం అందలేదు. 50 శాతం మందికి తినడానికి తిండి సైతం లేదు. 



పేదలపై భారం.. పెద్దలపై కరుణ 
పెద్దలపై భారం.. పేదలపై కరుణ అన్నట్టుంది కేంద్ర ప్రభుత్వ పరిస్థితి. ఇప్పుడు ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా వారికే లాభం చేకూర్చేలా ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్ ధరలు విపరీతంగా తగ్గాయి. అయితే వాటిని ప్రజలకు బదిలీ చేయకుండా పెట్రోల్ పై పది రూపాయలు, డీజిల్ పై పదమూడు రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం విధించి ఖజానాను నింపుకుంది. పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసరాల ధరలు సైతం తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో పేదలపై భారం తగ్గింది. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. అంతేకాకుండా లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటినా వాటిని నియంత్రించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు ప్రకటించినా 20 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా పెద్దలకే లాభం చేకూరేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడులను ఆకర్షించే పేరుతో భారీగా భూములను కేటాయించడం, దశాబ్దానికి పైగా పన్ను మినహాయింపులుఇవ్వడం చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని వల్ల ఉపాధి పెరుగుతుందని ప్రభుత్వం చెప్పుకోవచ్చు కానీ.. పేదలకు ఎలాంటి లాభమో, ఏం భారం తగ్గుతుందో ప్రభుత్వం మాత్రం చెప్పలేకపోతుంది. 



స్థానిక నినాదం వట్టిదేనా..! 
జాతినుద్దేశించి ప్రసగించిన ప్రధానమంత్రి మోడీ స్థానిక నినాదాన్ని అందుకున్నారు. స్థానిక ఉత్పత్తులకు మద్దతునిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆరేండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను చూస్తుంటే ప్రభుత్వ ఉద్దేశాలను అనుమానించక తప్పడం లేదు. విదేశీ పెట్టుబడులను పెంచుతూనే స్థానికంగా ఉత్పత్తి అని ఎలా చెబుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ ‘కరోనా సంక్షోభం తలెత్తినప్పుడు మనదేశంలో ఒక్క పీపీఈ కిట్‌ కూడా తయారు కావట్లేదు. ఎన్‌-95 మాస్కులు మాత్రం కొద్దిమొత్తంలో తయారయ్యేవి. కానీ, ఇప్పుడు మనం రోజుకు 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల ఎన్‌-95 మాస్కులు సొంతంగా ఉత్పత్తి చేసుకునే స్థితిలో ఉన్నాం. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవడం వల్లే భారత్‌ ఇలా చేయగలిగింది. మనదేశాన్ని స్వావలంబన కలిగిన దేశంగా మార్చేందుకు అదే ఉపకరిస్తుంది.’ అని చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న చర్యలను చూస్తే స్థానికానికి మద్దతు తెలుపుతున్నట్టు లేదు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ దాదాపు అమ్మకానికి పెట్టేశారు. కొంతమంది కోటీశ్వరులకు వాటిని అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఏడు వేల కోట్లు పెట్టి 72,400 రైఫిల్స్ ను ఇండియా అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఇప్పటికే వాల్ మార్ట్ లాంటి సంస్థలకు అనుమతులిచ్చేసిన ప్రభుత్వం.. దేశీయ ఆర్థిక వ్యవస్థలను కబళించే ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఆత్మ నిర్భర్తా దేశంలోని బడా పెట్టుబడిదారులకు, విదేశాలకు చెందిన పెద్ద కంపెనీలకే లాభం చేకూరేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Comments