ఆదిలాబాద్ జిల్లాలో యథేచ్ఛగా దేశీదారు విక్రయాలు..
మహారాష్ట్ర నుంచి అక్రమ రవాణా..
దొరకని ఇతర మద్యం బ్రాండ్లు..
నాలుగు రెట్లు ధర పెంచి అమ్ముతున్న అక్రమార్కులు..
వైన్ షాపుల్లో స్టాక్ వివరాల్లో తేడా రాకుండా కొత్త ఎత్తుగడలు..
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464..
ఐబీ.. ఎంసీ.. సిగ్నేచర్.. బ్లాక్ డాగ్.. ఇవే కాదు.. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి చీప్ లిక్కర్ కూడా దొరకడం లేదు. లాక్ డౌన్ ప్రారంభమైన మార్చి 22 నుంచి అప్పటి వరకు ఉన్న మద్యం స్టాక్ ను వారం రోజుల పాటు రెండింతలు, మూడింతలు ధర పెంచేసి బెల్టుషాపుల వారు అమ్ముకున్నారు. వైన్స్, బార్ షాపులు మూసి ఉండడంతో మద్యం ప్రియులు బెల్టుషాపుల వద్దకు రోజూ వచ్చి వెళ్తుండడంతో వారు కొత్త దారులు కనిపెట్టారు. డబ్బు సంపాదించే సమయం అనుకొని మహారాష్ట్ర నుంచి దేశీదారును పెద్ద ఎత్తున డంప్ చేసినట్టు తెలుస్తోంది. రూ. వందలోపే దొరికే దేశీదారు క్వార్టర్ సీసాను రూ. 500కు అమ్ముతున్నట్టు తెలిసింది. లాక్ డౌన్ సమయంలో పోలీసుల నిఘా ఇంతగా పెరిగినా.. వారు యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నట్టు సమాచారం.
జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ దేశీదారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి వారం రోజుల పాటు కావాల్సిన బ్రాండ్లు, అడిగినన్ని బాటిళ్లు దొరకగా.. ఆ తర్వాత మద్యం కష్టాలు మొదలయ్యాయి. దీంతో బెల్టు షాపుల వారు ఇప్పుడు దేశీదారు అమ్మకాలను మొదలుపెట్టారు. ఎక్కువ ధరలకు అమ్ముతున్నా రు. వీరికి మద్యం వ్యాపారులు సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలో మద్యం పట్టివేత కేసులు అంతంతమాత్రంగానే ఉన్నట్టు కనిపిస్తోంది.
వారం రోజుల క్రితం మద్యం తరలిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందిని పట్టుకున్నారు. ఇంకా నాలుగైదు దాడులు మినహా.. ఆదిలాబాద్ జిల్లాలో లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మద్యం పట్టుకున్న కేసులు అంతంత మాత్రమే.
స్టాక్ వివరాల్లో తేడా రాకుండా ఎత్తుడగలు..
లాక్ డౌన్ ప్రకటించగానే ప్రభుత్వం మద్యం అమ్మకాలను నిషేధించింది. దీంతో ఎక్సైజ్ అధికారులు అన్ని వైన్ షాపుల్లో ఉన్న స్టాక్ వివరాలు నమోదు చేసుకుని సీల్ వేశారు. అయినా లాక్ డౌన్ ప్రారంభమైన వారం నుంచి పక్షం రోజుల వరకు జిల్లాలో మద్యం యథేచ్ఛగా దొరికింది. అధికారుల సహకారంతోనే కొందరు మద్యం వ్యాపారులు దుకాణాల నుంచి మద్యాన్ని బయటకు తీసి ఇతర చోట్ల డంప్ చేసి బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు కొనసాగించినట్టు తెలిసింది. అయితే లాక్ డౌన్ సమయంలో దుకాణాలకు సీల్ వేసే సమయంలో ఎక్సైజ్ అధికారులు స్టాక్ వివరాలను నమోదు చేశారు. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత స్టాక్ వివరాల్లో తేడా రాకుండా కొత్త ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలో 19 వార్డులు కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించినప్పటి నుంచి పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద 24గంటల పాటు పోలీసులు ఉంటున్నారు. అయితే ఎన్టీఆర్ చౌక్ సమీపంలోని ఓ వైన్స్ దుకాణంలో ఇప్పుడు చోరీ జరిగిందని కేసు నమోదు కావడం చర్చనీయాంశగా మారింది. నిజంగానే చోరీ జరిగిందా.. లేదా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత స్టాక్ వివరాల్లో తేడా రాకుండా ముందస్తుగానే చోరీ నాటకం ఆడుతున్నారా అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
మహారాష్ట్ర నుంచి దేశీదారు..
ఇతర మద్యం బ్రాండ్లు దొరకడం కష్టంగా మారడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ఇప్పుడు యథేచ్ఛగా మహారాష్ట్ర నుంచి దేశీదారును తెచ్చి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని తాంసి, తలముడుగు, భీంపూర్, బోథ్, జైనథ్, బేల, ఆదిలాబాద్‌లలో దేశీదారు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా లాక్ డౌన్ ఉన్నప్పటికి అక్కడి వ్యాపారులు స్టాక్ ను పక్కకు తీసి పెట్టుకొని.. జిల్లాకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తాంసి, భీపూర్ మండలాల్లోని పెన్‌గంగా పరివాహక ప్రాంతమంతా దేశీదారు దిగుమతికి అనువుగా మారింది. దేశీదారు క్వార్టర్ బాటిల్ ధర రూ. 70 నుంచి రూ. 80 ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ. 500కు పైగా అమ్ముతున్నారంటే దాని డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. తలమడుగు, తాంసి, భీంపూర్ మండలాల్లో నిల్వచేస్తున్న వ్యాపారులు వాటిని మిగతా గ్రామాలకు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది.
మళ్లీ గుడుంబా గుప్పు ..
మద్యం అమ్మకాలు నిలిచిపోవడం.. దేశీదారు కూడా అధిక ధర పలుకుతుండడంతో మత్తు కోసం చాలా మంది నానా తంటాలు పడుతున్నారు. గుడుంబా, ఇప్ప పువ్వు సారా కోసం కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు గ్రామాల్లో నిలిచిపోయిన సారా, గుడుంబా తయారీ మళ్లీ ప్రారంభమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఇచ్చోడ మం డలంలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి నాటుసారా తయారీ పాత్రలను ధ్వంసం చేయడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి దేశీదారు విక్రయాలతోపాటు గుడుంబా తయారీని అరికట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.
addComments
Post a Comment