‘గల్లీ’ పాసులు..  అమ్ముకుంటున్నారు.!

‘వారియర్స్’ పాసులకు భలే డిమాండ్ 
వ్యాపారాలు, రాకపోకలకు వాడుకుంటున్న పలువురు 
డబ్బులకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు
వత్తాసు పలుకుతున్న ప్రత్యేకాధికారులు 
ఉన్నతాధికారులకు కాలనీవాసుల ఫిర్యాదులు 

ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464..  లాక్ డౌన్ వల్ల వ్యాపారాలన్నీ స్తంభించిపోయాయి. నిత్యావసరాలు, కిరాణా మినహా అన్నింటికి తాళాలు పడ్డాయి. సామాన్య ప్రజలు సైతం ఇంటి నుంచి బయటకు రావడమే కష్టమైపోయింది. బయటకు వెళ్తే పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకుసేవ చేయడానికి ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రవేశపెట్టిన ‘గల్లీ వారియర్స్’ వ్యవస్థకు డిమాండ్ పెరిగింది. వారికి పాసులు ఇవ్వడం, రాకపోకలకు అనుమతులివ్వడంతో యువత ఆసక్తి కనబరుస్తోంది. అయితే వీటిని జారీ చేసే అధికారం ప్రత్యేకాధికారులకు ఇవ్వడం, ఆ ప్రత్యేకాధికారులు కౌన్సిలర్లు చెప్పిన వారికే ఇస్తుండడంతో అది వ్యాపారంగా మారింది. వివిధ వ్యాపారాలు చేసుకునే వారికి ఈ పాసులు అమ్ముకుంటున్నట్టు వివిధ కాలనీవాసుల ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కొందరు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. 

ప్రజలకు పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు లాంటి వాటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండడానికి, అంతేకాకుండా ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండేలా అవగాహన కల్పించడానికి, ప్రజలకు అవసరమైన వాటిని సమకూర్చడానికి ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ శ్రీదేవసేన ప్రత్యేక చొరవ తీసుకొని గల్లీ వారియర్స్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అయితే ఇది కొన్ని కాలనీల్లో సత్ఫలితాలనిస్తుండగా, మరికొన్ని చోట్ల మాత్రం దుర్వినియోగమవుతోంది. అయితే ఈ దుర్వినియోగం కావడానికి ముఖ్య కారణం పాసులు ఇవ్వడంలో రాజకీయాలు జొప్పించడమే. దీంతో గల్లీ వారియర్స్ ఏర్పాటు లక్ష్యమే మరుగునపడిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఆయా వార్డుల కౌన్సిలర్ల సహకారంతో వార్డుకు చెందిన ప్రత్యేకాధికారి గల్లీ వారియర్స్ ను నియమించి, ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. లాక్ డౌన్ పొడగించడం, అసలు బయట తిరిగే అవకాశం లేకపోవడం, ముఖ్యంగా కంటైన్ మెంట్ ప్రాంతాల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని, అసలు ఇంటి బయట కాలు పెట్టవద్దనే నిబంధనలు ఉండడంతో గల్లీ వారియర్స్ నియామకానికి డిమాండ్ పెరిగింది. చాలా మంది తామంటే తాము గల్లీ వారియర్స్ గా ఉంటామంటూ ముందుకు వస్తున్నారు. అయితే దీనిలో సేవా భావం చేసుకునే యువత కంటే పండ్లు, కూరగాయల వ్యాపారాలు చేసుకునే వారు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 

వ్యాపారాల్లో గల్లీ వారియర్స్..  
ఏదైతే వార్డుకు సంబంధించి గల్లీ వారియర్స్ పాస్ తీసుకుంటే ఆ వార్డులో మాత్రమే తిరిగే అవకాశముంటుంది. అయితే కొందరు ఈ పాసులను మెడలో వేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. పట్టణమంతా తిరుగుతున్నారు. పోలీసులు కూడా వీరిని చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో కౌన్సిలర్లకు మరీ డబ్బులిచ్చి పలువురు పండ్లు, కూరగాయల హోల్ సేల్ వ్యాపారులు వీటిని తీసుకున్నట్టు సమాచారం.  పట్టణంలోని పలు కూరగాయలు, పండ్ల హోల్ సేల్ వ్యాపారులు వీటిని మెడలో వేసుకునే వ్యాపారం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ప్రత్యేకాధికారులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

అమ్ముకుంటున్నారనే ఆరోపణలు..
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. వీటిలో 19 వార్డులు కంటైన్ మెంట్ జోన్లు గా ఉన్నాయి. అయితే గల్లీవారియర్స్ పాసులు ఉన్న వారిని బయటకు తిరిగే అవకాశాన్ని పోలీసులు ఇస్తున్నారు. దీంతో కొందరు వ్యాపారులు వీటిని తీసుకొని ఇష్టానుసారంగా తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పాసులకు డిమాండ్ పెరుగుతుండడంతో కౌన్సిలర్లు అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కౌన్సిలర్లు సూచించిన వారికే ప్రత్యేకాధికారులు పాసులు ఇవ్వడంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. చాలా మంది కౌన్సిలర్లు తమ అనుచరులకు పాసులుఇప్పించుకుంటుండగా, మరికొందరు కౌన్సిలర్లు వ్యాపారులకు వీటిని అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అధికారిక సీల్ లు ఉండడం లేదు. కొన్ని చోట్ల కౌన్సిలర్ల సంతకాలు ఉంటున్నాయి. పాసులకు డిమాండ్ పెరుగుతుండడంతో కొందరు కౌన్సిలర్లు రూ. 3వేల నుంచి రూ. 5వేల వరకుఅమ్ముకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల కౌన్సిలర్లు ప్రత్యేకాధికారుల నుంచి పేర్లు రాయకుండా పాసులు తీసుకొని, వాటిని తమ వద్దే అంటిపెట్టుకొని ఉంచుకున్నాట్లు సమాచారం. ఈ విషయాలను పలు కాలనీల ప్రజలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. అయితే దీని గురించి తెలుసుకోవాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు మౌఖికంగా ఆదేశించగా.. గల్లీ వారియర్స్ సరిగ్గానే పని చేస్తున్నట్టు చూపించడానికి కౌన్సిలర్లు ముప్పుతిప్పలు పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖానికి మాస్కులు వేయించి, మెడలో ఏవో కార్డులు వేయించి, ఫోటోలు తీసి వాటిని ప్రత్యేకాధికారులకు పంపుతున్నట్టు తెలిసింది. అయితే పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మాత్రం అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆయా కాలనీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

Feroz Khan 9640466464

Comments