ప్రతివార్డులో పదులసంఖ్యలో గల్లీ వారియర్స్ నియామకం..
లాఠీలు, పోలీసు సైరన్లతో భయపెట్టే వాతారణం సృష్టిస్తున్న వైనం..
కాపలా అంటూ ఇష్టారాజ్యం..
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
మోగుతున్న పోలీసు సైరన్.. చేతిలో లాఠీలు.. ఒకేసారి పదిమందికి పైగా రోడ్లపైకి వెళ్తున్నారు.. అయితే వీరు ప్రజలను కాపాడే పోలీసులు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. గల్లీ వారియర్స్ పేరుతో అధికారులు ప్రతికాలనీలో నియమించిన గల్లీ వారియర్స్ సృష్టిస్తున్న భయానక వాతావరణం ఇది. ఒక వార్డులో పోలీసు అధికారాలను చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. సేవ కోసం నియమిస్తే సేవచేయడానికి బదులు కాపలా పేరుతో అధికారం చలాయించడం, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 49వార్డులు ఉన్నాయి. జిల్లాలో 11 కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా కలెక్టర్ తోపాటు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణ పరిధిలో కరోనా కేసులు నమోదైన వార్డులను కంటైన్ మెంట్ జోన్లు (రెడ్ జోన్లు) గా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో దుకాణాలను పూర్తిగా మూసివేసి, రహదారులకు అడ్డుకట్టలు వేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు లాంటి వాటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ప్రజలకు అవసరమైన వాటిని సమకూర్చడం కోసం గల్లీ వారియర్స్ ను నియమించారు. ఈ వ్యవస్థను ఆ తర్వాత అన్ని వార్డులను పెంచాలని నిర్ణయించారు. అయితే ఈ గల్లీ వారియర్స్ రెడ్ జోన్లలో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన సరుకులు అందించడంతోపాటు ఆయా వార్డుల్లో ప్రజలు అనవసరంగా బయటకు తిరగవద్దని అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ గల్లీ వారియర్స్ నియామకంలో రాజకీయాలు జొప్పించడంతో దాని లక్ష్యమే మరుగునపడిపోయింది. అంతేకాకుండా ప్రజల ఇబ్బందులు తీరాల్సిందిపోయి మరింత ఎక్కువయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నియామకంలో రాజకీయాలు.. గల్లీ వారియర్స్ నియామకంలో రాజకీయాలు వచ్చిపడ్డాయి. ఆయా వార్డుల కౌన్సిలర్ల సహకారంతో వార్డుకు చెందిన ప్రత్యేకాధికారి వీరిని నియమించి, ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నారు. లాక్ డౌన్ పొడగించడం, అసలు బయట తిరిగే అవకాశం లేకపోవడం, ముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో అసలు ఇంటి బయట కాలు పెట్టవద్దనే నిబంధనలు ఉండడంతో గల్లీ వారియర్స్ నియామకానికి డిమాండ్ పెరిగింది. తాము ఉంటామంటే తాము ఉంటామంటూ యువత చాలా మంది ముందుకు వస్తున్నారు. అయితే దీనిలో సేవా భావం కంటే బయట తిరగవచ్చనే అవకాశవాదమే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో కౌన్సిలర్ తన అనుయాయులను గల్లీవారియర్స్ గా నియమించాలని సిఫారసు చేయడం, ఆ వార్డు ప్రత్యేకాధికారి దానికి సరేననడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అయితే గల్లీ వారియర్స్ గా ఇస్తున్న ఐడెంటిటీ కార్డుల్లో కేవలం ప్రత్యేకాధికారి సంతకం మాత్రమే ఉంది. ఆ అధికారికి సంబంధించి ఎలాంటి ప్రభుత్వ ముద్రలు ఉండడం లేదు. దీంతో ఎవరు అసలు గల్లీ వారియరో.. లేదా కార్డులను నకిలీ ప్రింట్ చేసి గల్లీ వారియర్లుగా తిరుగుతున్నారో అర్థం కావడం లేదని ఆయా కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాంతాలు.. శత్రుత్వాలు.. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 44 వార్డును ఉదాహరణగా తీసుకుంటే.. ఈ వార్డు పరిధిలో సంజయ్ నగర్, భుక్తాపూర్, డాల్డా కంపెనీ, ఉస్మానియానగర్, నెహ్రూ చౌక్ ప్రాంతాలు వస్తాయి. ఇంకా ప్రతి వార్డులో కనీసం నాలుగైదు కాలనీలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కౌన్సిలర్ ఒకే కాలనీకి చెందిన వారు కావడం, ఆ ప్రాంతం వారినే గల్లీ వారియర్స్ గా నియమించాలని సిఫారసు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఒకే కాలనీ వారు అన్ని కాలనీలు తిరిగే అవకాశం వస్తోంది. అయితే ఇతర కాలనీల వారికి ఏమైనా అవసరం పడితే చేయూతనందించే వారు కరువయ్యారు. అంతేకాకుండా కౌన్సిలర్లు ఆయా పార్టీలకు చెందిన వారు కావడం, గల్లీ వారియర్స్ గా తమ అనుయాయులను, తమ వెంట తిరిగే యువతను నియమించాలని సిఫారసు చేస్తున్నారు. దీనికి ఆ వార్డు ప్రత్యేకాధికారులు సైతం తలూపుతున్నారు. దీంతో గల్లీ వారియర్స్ గా నియమింపబడ్డ వారు.. రాజకీయాల్లో తమ ప్రత్యర్థి పార్టీలకు చెందిన యువత, ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి, ఇతర అవసరాల నిమిత్తం బయటకు వెళ్తే.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా పోలీసుల్లా చేతుల్లో లాఠీలు పట్టుకోవడం, పోలీసు సైరన్ మోగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గల్లీ వారియర్స్ ఆగడాలను అరికట్టాలని, అర్హులైన, సేవా భావం కలిగిన యువతకే గల్లీ వారియర్స్ గా నియమించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Feroz Khan 9640466464
addComments
Post a Comment