‘అద్దె’ మాఫియా..

ప్రధాన ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు
లక్షల్లో అడ్వాన్స్, అద్దెల వసూళ్లు
ఆదాయం చూపించకుండా పన్ను ఎగ్గొడుతున్న యజమానులు
ప్రభుత్వ ఆదాయానికి గండి
వ్యాపారం చేయడం కష్టంగా మారిందంటున్న వ్యాపారులు
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464

మాఫియా.. సీరిస్-1

ఇదీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న భవనాలు.. అన్నీ వ్యాపార అవసరాలకే వినియోగిస్తారు. స్థలాన్ని, అంతస్తును బట్టి రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు అడ్వాన్స్, రూ. 25వేల నుంచి రూ. 80 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో భవన యజమానికి సంపాదన ఏడాదికి రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. అయితే వీరు కేవలం మున్సిపల్ ట్యాక్స్ మాత్రమే చెల్లించి.. ఆదాయపు పన్ను ఎగ్గొడుతున్నట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వీరు 10 శాతం నుంచి 30 శాతం వరకు ఆదాయపు పన్ను చెల్లించాలి. కొందరు ఆదాయాన్ని చాలా తక్కువగా చూపిస్తుండగా.. మరికొందరు అసలు ఆదాయమే చూపించనట్లు తెలుస్తోంది. ఇది ఒక్క బస్టాండ్ ప్రాంతానికి సంబంధించిన విషయమే కాదు.. జాతీయ రహదారి వెంబడి ఉన్న దుకాణాలు, పంజాబ్ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, నేతాజీ చౌక్, వినాయక్ చౌక్.. ఇలా జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న భవనాల యజమానులు అద్దెల ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నా వీరి నుంచి పన్ను వసూలు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. వేతన జీవుల నుంచి ముక్కుపిండి ఆదాయపు పన్నును వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇలాంటి వారి పట్ల చూసీ చూడనట్టు వ్యవహరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

వ్యాపారం చేయలేక..
వ్యాపారపరంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. కొత్తకొత్తగా వెలుస్తున్న వ్యాపారాలు.. చేపడుతున్న భారీ నిర్మాణాలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే సొంత భవనం లేకుంటే ఇక్కడ వ్యాపారం చేయడం ఎంత కష్టమో అది వ్యాపారులకే తెలుస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికైతే చుక్కలే కనిపిస్తున్నాయి. భవనాల యజమానులు లక్షల్లో అడ్వాన్స్ అడుగుతుండడం, ప్రాంతాన్ని బట్టి రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు అద్దె అని చెబుతుండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సైతం ఈ స్థాయిలో అద్దెలు లేవని చెబుతున్నారు.

పన్ను ఎగ్గొడుతూ..
ఏడాదికి లక్షల్లో సంపాదిస్తున్న భవనాల యజమానులు ఆ ఆదాయాన్ని మాత్రం లెక్కల్లో చూపించడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఒక వ్యక్తికి రెండు దుకాణాలు ఉన్నాయనుకుందాం. అందులో ఒక దుకాణం మాత్రమే అద్దెకి ఇచ్చి ఇంకో దుకాణం ఖాళీగా ఉందని భావిద్దాం. ఇక్కడ ఈ అద్దెకి ఇచ్చిన ఇంటిపై వచ్చే వార్షిక నికర ఆదాయాన్ని అంటే మున్సిపల్‌ పన్నులు పోను మిగిలిన మొత్తాన్ని ఐటీ రిటర్న్స్ లో చూపించాలి. ఈ అద్దె ఆదాయం ఆ ప్రాంతంలో ఉండే మార్కెట్‌ రెంట్‌ కంటే తక్కువ ఉండకూడదు. ఇక మిగిలిన ఖాళీగా ఉన్న దుకాణంపై మార్కెట్‌ రెంట్‌ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వ్యాపార అవసరాలకు కాకుండా గృహ అవసరాలకు అద్దెకు ఇస్తే అలాంటి ఆదాయాన్నికూడా చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి వ్యక్తి రెండు ఇళ్ల వార్షిక అద్దె ఆదాయంలో 30 శాతం మినహాయింపు కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వాటి కొనుగోలు కోసం తీసుకున్న హోమ్‌ లోన్‌ చెల్లిస్తున్నట్టయితే వడ్డీ చెల్లింపులనూ మినహాయింపు కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే దుకాణాలను అద్దెకు ఇస్తున్న కేవలం 20 శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. మిగితా 80 శాతం మంది అసలు లెక్కలే చూపించనట్టు సమాచారం.

ఇద్దరి మధ్యే ఒప్పందం
అద్దె విషయంలో భవన యజమాని, అద్దెకు తీసుకున్న వ్యక్తి మధ్యే ఒప్పందం జరుగుతుంది. వీరి మధ్యలో ఏమైనా మనస్పర్థలు వస్తేనే ఎంత అద్దె తీసుకుంటున్నారు, అడ్వాన్స్ ఎంత చెల్లించారనే విషయం బహిర్గతమవుతుంది. అప్పటి వరకు వారి మధ్య జరిగిన ఒప్పందం ఎవరికీ తెలియదు. ఈ లెక్కన వారు ఎంత అద్దె వసూలు చేస్తున్నారనే విషయం ప్రభుత్వానికి తెలిసే అవకాశం లేదు. అయితే మున్సిపల్ రికార్డులను బట్టి ఆదాయపు పన్ను శాఖ అధికారులు వివరాలు సేకరించే అవకాశముంటుంది. ఆ భవనాన్ని గృహ అవసరాలకు వినియోగిస్తున్నారా లేదా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారా అనే విషయం మున్సిపల్ రికార్డుల్లో ఉంటుంది. అయితే భవనాన్ని, ఏ అవసరాలకు వినియోగిస్తున్నారో దాన్ని బట్టి మున్సిపాలిటీ అధికారులు మున్సిపల్ పన్ను వసూలు చేస్తారు. అయితే వ్యాపార అవసరాల కోసం ఎంత అద్దె వసూలు చేస్తున్నారనే వివరాలు వారి వద్ద ఉండవు. ప్రాంతాన్ని బట్టి ఆదాయపు పన్ను అధికారులు వివరాలు సేకరించి, దాడులు నిర్వహిస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచే పన్నుల రూపంలో ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో ఆదాయం వచ్చే అవకాశముంది.

త్వరలో.. మాఫియా సీరిస్-2
ఫీరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
ferozkhanjournalist@gmail.com
#విన్నపం. మాఫియా..
కనీస వివరాలు మీ వద్ద ఉంటే..
పై నెంబర్ కు వాట్స్ అప్ లేదా ఈమేల్ చేయండి.

Comments